దిశ దశ, హైదరాబాద్:
ఇప్పటి వరకు ఏం జరిగిందో కూడా అంతా బట్ట బయలయింది… ఏఏ అధికారి ప్రమేయం ఉందో కూడా వెలుగులోకి వచ్చింది… అరెస్ట్ చేసినప్పుడు కానీ… కస్టడీలోకి తీసుకుని విచారించి తిరిగి జైలుకు తరలించినప్పుడు కానీ రహస్యం అన్న పదానికే తావు లేకుండా జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం బిగ్ ట్విస్ట్ ఇచ్చారు పంజాగుట్ట పోలీసులు. గుట్టు రట్టు కాకుండా రహస్యంగా ఉంచేందుకు సీల్డ్ కవర్ లో వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించారు. దీంతో అందులో ఏముందన్నదే హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటివరకిలా…
ఎస్ఐబీ కార్యాలయం కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు చేపట్టిన ప్రతి అంశం వెలుగలోకి వచ్చింది. ఈ కేసులో మొదట అరెస్ట్ అయిన ప్రణిత్ రావు నుండి మొదలు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావుల అరెస్ట్ సందర్భంగా కోర్టుకు సమర్పించిన కన్ఫెషన్ రిపోర్టు అంతా కూడా ఓపెన్ సీక్రెట్ అన్నట్టుగానే వ్యవహరించారు ఇన్వెస్టిగేషన్ అధికారులు. అంతేకాకుండా వారిని కస్టడీకి తీసుకుని విచారించిన తరువాత… వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించిన సందర్భంలో కూడా సీక్రసీకి తావు లేకుండానే వ్యవహరించారు. కానీ తాజాగా మాజీ డీసీపీ రాధా కిషన్ రావు కస్టడీ ముగిసిన తరువాత మాత్రం దర్యాప్తు అధికారులు కాన్ఫిడెన్షియల్ ఫైల్ తయారు చేయడం వెనక ఏదో మతలబు ఉందన్న చర్చ సాగుతోంది. రాధా కిషన్ రావు కస్టడీ ముగిసిన తరువాత కోర్టులో హాజరు పర్చగా ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే కస్టడీలో ఉన్నప్పుడు ఆయన నుండి రాబట్టిన సమాధానాలతో పాటు గతంలో విచారించిన మిగతా నిందితుల నుండి సేకరించిన ముఖ్యమైన విషయాలను మాత్రం అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు పోలీసులు. వారి నుండి సేకరించిన వాంగ్మూలాన్ని అత్యంత రహస్యంగా సీల్డ్ కవర్ లో ఉంచి కోర్టుకు సమర్పించడం సంచలనంగా మారింది. ఇన్ని రోజుల పాటు రహస్యానికి తావు లేకుండా వ్యవహరించిన ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇప్పుడు సీక్రసీ మెయింటెన్ చేయడం అందరిని ఆశ్యర్యపరుస్తోంది.
పొలిటికల్ వింగా..?
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అదికారులను మాత్రమే అరెస్ట్ చేసిన దర్యాప్తు అధికారులు ఇఫ్పుడు కాన్ఫిడెన్షియల్ ఫైల్ కోర్టుకు అందించడం వెనక రాజకీయ నాయకుల ప్రమేయం ఉండి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులను విచారించినప్పుడు నలుగురు రాజకీయ నాయకుల పేర్లు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన అధికారులతో పాటు రాధాకిషన్ రావు కస్టడీ స్టేట్ మెంటుకు సంబంధించిన అంశాలను క్రోడీకరించుకుని తయారు చేసిన నివేదికను ప్రత్యేకంగా సీల్డ్ కవర్ లో పొందుపర్చి కోర్టుకు సమర్పించినట్టుగా సమాచారం. అయితే దర్యాప్తు అధికారులు మాత్రం ఈ విషయం గురించి బయటకు చెప్పడం లేదు కాని… రూమర్లు మాత్రం పొలిటికల్ వింగ్ చుట్టే సాగుతున్నాయి.
మరి కొంతమంది…
అలాగే ఎస్ఐబీ కార్యాలయం కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన విషయంలో మరికొంతమందిని కూడా పంజాగుట్ట పోలీసులు పిలిపించినట్టుగా తెలుస్తోంది. వీరిని శనివారం పిలిపించుకుని విచారించనున్నారు. ఇందులో పోలీసు విభాగానికి చెందిన వారే ఉన్నట్టుగా సమాచారం.