నెట్టింట టీటీడీ దర్శనం టికెట్ల విక్రయం…
సరికొత్త పంథా ఎంచుకున్న దళారులు…
దిశ దశ, నిఘా బ్యూరో:
ఆన్ లైన్ లో దర్శనం టికెట్లు దొరకవు… క్యూ లెన్లో రోజుల కొద్ది వెయిట్ చేయాలి… కానీ వారు మాత్రం దర్జాగా దర్శనం టికెట్లు, దర్శనం టికెట్లు అంటూ కూరగాయలు అమ్మినట్టుగా విక్రయిస్తున్నారు. సామాన్యుడికి దొరకనిది… ఆన్ లైన్ లో బుక్ చేసుకునే అవకాశం లేనిది… దళారులకు ఎలా సాధ్యం అవుతోందన్నదే వెంకన్న భక్తుడి ప్రశ్ర. కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దర్శనం చేసుకోవడానికి భక్తులు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఏడు కొండల వాడిని దర్శించుకునేందుకు ఏడు సముద్రాలు దాటి వస్తుంటారు భక్తులు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన క్షేత్రం కావడమే కాకుండా వడ్డీ కాసుల వాడిగా, కోరిన వారికి కొంగు బంగారంగా కొలుస్తారు భక్తులు. దేశంలో ఏ ఆలయంలోనూ దైవ దర్శనం అయినా సులవుగా చేసుకోవచ్చు కానీ వెంకన్నను దర్శించుకోవడం భక్తులకు కష్టతరమే. నిత్యం భక్తుల రద్దీతో ఉండే ఈ ఆలయాన్ని సందర్శించి మూల విరాట్టును దర్శించుకునేందుకు భక్తులు పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. అటువంటి వెంకన్న దర్శనం ఇప్పుడు కాస్ట్లీ అయిపోయింది. ఇదేదో టీటీడీ సేవల టికెట్ల ధరలు పెంచడం వల్లే కాదండి… బ్రోకర్లకు కారణంగానేనని స్పష్టమవుతోంది.
నెట్టింట వ్యాపారం…
మద్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి 10 గంటల వరకు వెంకన్న దర్శనానికి సంబంధించిన టికెట్లు మా వద్ద ఉన్నాయి… కావల్సిన వారు వాట్సప్ ఛాటింగ్ ద్వారా మాకు టచ్ లోకి రండి అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు దళారులు. ఫలానా వేళల్లో దర్శనం మాత్రమే అందుబాటులో ఉందని ఢంకా బజాయించి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం చేస్తున్న దళారుల చేతికి దర్శనం టికెట్లు ఎలా చిక్కుతున్నాయన్నదే పజిల్ గా మారింది. పైగా ఒకటి కాదు రెండు కాదు రోజులకొద్దీ తేదీల వివరాలను పేర్కొంటూ దర్శనాలు అందుబాటులో ఉన్నాయంటూ చేస్తున్న ప్రచారం దేనికి సంకేతం..? సామాన్య భక్తుడు సర్వ దర్శనం క్యూలో వెల్లి వెంకన్నను కనులారా చూసేందుకు ప్రత్యక్ష్య నరకం చవి చూస్తుంటే… ఆన్ లైన్ లో దర్శనాలు బుక్ చేసుకోవాలని మరి కొంతమంది భక్తులు ప్రయత్నిస్తుంటే వారెవరికీ చిక్కని దర్శనం టికెట్లు బ్రోకర్ల వద్దకు ఎలా చేరుతున్నాయన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.? సాంకేతికతను అందిపుచ్చుకుని అంతా పారదర్శకంగా సాగుతోందన్న ప్రచారమే తప్ప చేతల్లో మాత్రం వేరే విధంగా జరుగుతోందని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్న టికెట్ల విక్రయ ప్రచారం తేటతెల్లం చేస్తోంది. టెక్నాలజీలోని లోపాలను అవకాశంగా మార్చుకుని దర్శనం టికెట్లను బ్లాకులో విక్రయించే ముఠాలు రంగంలోకి దిగాయా లేక… టీటీడీలోని కొంతమంది వీరితో చేతులు కలిపారా అన్నదే తేలాల్సి ఉంది.
ఆధారం లేకున్నా ఎలా..?
ప్రతి దర్శనానికి ఐడీ ప్రూఫ్ చూపిస్తేనే లైన్ క్లియర్ చేస్తున్న టీటీడీ మాత్రం బ్రోకర్ల చేతికి రోజుల కొద్ది దర్శనం టికెట్లు అప్పనంగా ఎలా ఇస్తోంది. ఐడీ ప్రూఫ్ లు లేకుండా వీరు అడ్వాన్స్ బుకింగ్ ఎలా చేస్తున్నారు. ముందస్తుగా టీటీడీ ఆన్ లైన్ దర్శనాల వివరాలను ప్రకటిస్తున్నా అవి దళారులకు మాత్రమే ఎందుకు ఓపెన్ అవుతున్నాయి..? సామాన్యులకు ఎందుకు అవకాశం చిక్కడం లేదు..? వీటన్నింటి చిక్కుముడి విప్పితే తప్ప వెంకన్న దర్శనం టికెట్ల మాటున జరుగుతున్న బాగోతం బయటకు రాదేమో. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న టీటీడీ ఆచరణలో పెడుతున్న తీరు సరిగా లేదా లేక పోతే మరేదైనా కారణమా.? ఇంతకాలం ఐడీ ప్రూఫ్ తో దర్శనం టికెట్ ఇచ్చే టీటీడీ కొంతమందికి వెసులుబాటు కల్పించిందా..? ఇలా ప్రతి ఒక్కటి అనుమానంగానే ఉన్నాయి.
షేర్ మార్కెట్ ను మించి…
ఇకపోతే దళారులు సోషల్ మీడియా ఆన్ లైన్ మార్కెట్ లో టీటీడీ టికెట్ల విక్రయం చేస్తున్న తీరు షేర్ మార్కెట్ ను మించిపోయిందనే చెప్పాలి. భక్తుడు కోరుకున్న రోజును బట్టి దర్శనం టికెట్ ధర మారుతోంది. రూ. 300 దర్శనం ఎంట్రీ టికెట్ కు రోజులను బట్టి రూ. 3 వేల వరకు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దళారులు ఇంత ధైర్యంగా వాట్సప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఎలా ప్రచారం చేస్తున్నారంటే వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న వారెవరు..? టీటీడీ విజిలెన్స్ కళ్లు మూసుకుందన్న నమ్మకమా లేక బ్రోకర్ మాఫియా కభంద హస్తాల్లో నిఘా వర్గాలు చిక్కుకపోయాయా లేక మరేదైనా కారణమా అన్నదే అంతుచిక్కడం లేదు. సామాన్య భక్తుడు తెలిసో తెలియక అంబర్, సిగరెట్ కొండపైకి తీసుకెల్తే అన్ని రకాలుగా తనిఖీలు చేసీ మరీ కొండపైకి పంపిస్తున్న టీటీడీ ఇలాంటి అక్రమాలపై ఉక్కుపాదం మోపడం లేదెందుకు..? వరాలిచ్చే వెంకన్న సన్నిధిలో తల నీలాలు ఇస్తామని, నిలువు దోపిడీ ఇచ్చి మొక్కులు తీర్చుకుంటామని మొక్కుతున్న భక్తులు అంతకు ముందే దళారుల చేతిలో నిట్ట నిలువునా దోపిడీకి గురవుతున్న తీరు ఎవరికీ కనిపించకపోవడం విస్మయం కల్గిస్తోంది.