తెలుగునాట రసవత్తర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపున చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే మరో వైపున కత్తికట్టి పంచాయితీలు పెట్టుకుంటున్న తీరు చర్చనీయాంశంగా మారింది. కుటుంబాలు ఒకటైనా భిన్న స్వరాలు వినిపిస్తున్న పరిస్థితులు ఇప్పటి వరకు గమనించాం. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న వాతావరణం గమనిస్తుంటే అత్యంత విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సయోధ్యతో ముందుకు పోతున్నారా లేక పంథంతో సాగుతున్నారా అన్నదే అంతుచిక్కకుండా పోయింది. అలాయ్ బలాయ్ తీసుకుంటూ ఆత్మీయతలను పంచుకుంటూ తలుక్కున మెరుస్తారు ఒక్కో సారి… అంతలోనే తాము బద్ద శత్రువులమేనన్న సంకేతాలు ఇస్తారో మరోసారి. ఎంటో ఇద్దరు ముఖ్యమంత్రులు వైఖరి ఏంటో అంతుచిక్కకుండా పోతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏర్పడిన పంచాయితీలో ఎవరు ఎటువైపోనన్న విషయంపై స్పష్టత రానుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఆమె చుట్టే రాజకీయాలు…
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపికగా మారిన వైఎస్ షర్మిలా రెడ్డి చుట్టే రెండు రాష్ట్రాల రాజకీయాలు తిరుగుతున్నాయని చెప్పక తప్పదు. అప్పుడప్పుడు జాతీయ పార్టీల వ్యవహారం కూడా ఇందులో మిలితం అవుతున్నప్పటికీ ఎక్కువగా మాత్రం ఇప్పుడు తెలంగాణలోని పార్టీల గురించే విమర్శలు సంధిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా జాతీయ పార్టీలను కార్నర్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా నర్సంపేటలో చోటు చేసుకున్న ఘటనతో ఒక్కసారిగా టీఆరెఎస్ పార్టీ నాయకులు వైఎస్ షర్మిలతో పాటు ఆ కుటుంబాన్ని లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా అధికార టీఆరెఎస్ పార్టీ నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని లక్ష్యం చేసుకుని కూడా ఘాటైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో వైఎస్ ఏం చేశారో వివరిస్తూ ఒక్కసారిగా షర్మిలను టార్గెట్ చేసిన టీఆర్ఎస్ నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. వీరి కామెంట్లకు వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కూడా రిప్లై అదే స్థాయిలో ఇస్తున్నారు. కానీ ఇక్కడ చర్చించాల్సిన విషయం ఏంటంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ మౌనం ఎందుకోనన్నదే అంతుచిక్కకుండా పోయిందన్నదే.
వైఎస్ ను లక్ష్యం చేసుకుని…
వైఎస్ రాజశేఖర్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తెలంగాణాలోని టీఆరెఎస్ నాయకులు దూకుడుగా మాట్లాడుతున్నారు. ఆయనను టార్గెట్ చేస్తూ లక్ష్యం క్యాబినెట్ మంత్రులు కూడా ఘాటైన పదజాలంతో విమర్శలు చేస్తున్నారు. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలను కార్నర్ చేస్తూ వ్యాఖ్యాలు చేస్తే అంత సీరియస్ గా పట్టించుకోకున్నా… తన తండ్రి రాజశేఖర్ రెడ్డిని లక్ష్యం చేసుకుని చేస్తున్న ఆరోపణలపై ఏపీ సీఎం జగన్ మౌనంగా ఉండడం ఏంటా అన్నదే అంతుచిక్కకుండా పోయింది. నాన్న ఆశయ సాధన కోసమే మీ ముందుకు వచ్చాను అన్న నినాదంతో ప్రజా క్షేత్రంలోకి వెల్లిన జగన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రచారం చేసి గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వంతో సాన్నిహిత్యంగా మెదిలిన జగన్ ఇప్పుడు ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారన్నదే మిస్టరీగా మారింది. కృష్ణా జలాల వినియోగం గురించి ఒకటి రెండు సార్లు నువ్వా నేనా అన్న రీతిలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాయి. కొద్ది రోజులకు ఆ పరిస్థితుల నుండి దృష్టి మరల్చడంతో కృష్ణా వాటర్ సమస్య కనుమరుగైపోయింది. అయితే షర్మిల తెలంగాణాలో ఎంట్రీ ఇచ్చిన తరువాత చాలా కాలం వరకూ టీఆరెఎస్ నాయకుల నుండి స్పందన రాలేదనే చెప్పాలి. కానీ నర్సంపేట ఘటన తరువాత టీఆరెఎస్, వైఎస్సార్టీపీల మధ్య సీరియస్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ కూడా టీఆరెఎస్ పార్టీ శ్రేణుల చర్యలను ఖండించడం గమనార్హం. కానీ ఏపీ సీఎం జగన్ కానీ వైఎస్సార్సీపీ నాయకులు కాని స్పందించకపోవడం ప్రస్తావనార్హం. ఇప్పటికే వైసీపీ ముఖ్య నాయకులు సజ్జల లాంటి వారు టీఆరెఎస్ నాయకులపై విమర్శలు చేయగా తెలంగాణ మంత్రులు గంగుల కమలాకర్ తో పాటు ఇతర నాయకులు కౌంటర్ అటాక్ చేశారు. షర్మిల విషయంలో కూడా మొదటి నుండి టీఆరెఎస్ పార్టీ సైలెంట్ గా ఉన్నప్పటికి సివిల్ సప్లై మినిస్టర్ గంగుల కమలాకర్ మాత్రం ఘాటు విమర్శలే చేశారు. అయితే నర్సంపేట ఘటన తరువాత తెలంగాణలోని సీనియర్ నాయకులంతా కూడా షర్మిలతో పాటు వైఎస్ఆర్ ను లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
జగన్ మౌనమేలా…?
ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ మాత్రం మౌనమే నా భాష ఓ మూగ మనసా అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఓ వైపున చెల్లిని, మరో వైపున తండ్రిని లక్ష్యం చేసుకుని తెలంగాణ ప్రాంత నాయకులు సంధిస్తున్న విమర్శనాస్త్రాలను సంధించకపోవడం వెనక ఆంతర్యం ఏంటీ అన్నదే చర్చగా మారింది. నర్సంపేట దాడి ఘటన తరువాత షర్మిల ప్రగతి భవన్ కు తన కారులో వెల్తుండగా తెలంగాణ పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. అదే సమయంలో పంజాగుట్ట ఏరియాలో ఓ హెలిక్యాప్టర్ నాలుగు రౌండ్లు చక్కర్లు కొట్టడంతో చెల్లెలు కోసం రంగంలోకి అన్న దిగాడంటూ ప్రచారం జరిగినప్పటికీ అవన్ని పుకార్లేనని తేలిపోయింది. ఆ తరువాత షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పర్చగా ఆమెను విడుదల చేసింది. ఆ తరువాత తెలంగాణ గవర్నర్ ను కలిసి షర్మిల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ విషయం తెలిసి వారి తల్లి జయమ్మ షర్మిల వద్దకు చేరుకున్నప్పటికీ జగన్ నుండి మాత్రం రెస్పాండ్ కాకపోవడం విశేషం. అటు ఏపీలో ఇటు తెలంగాణాలో అన్నా చెల్లెలిద్దరూ కూడా తండ్రి వైఎస్ నామ స్మరణతో రాజకీయాలు నెరుపుతున్నా తెలంగాణాలో వైఎస్ లక్ష్యంగా సాగుతున్న విమర్శలపై మాత్రం తనయుడు స్పందిచకపోవడం ఏంటోనన్నదే అంతుచిక్కకుండా పోయింది. జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తెలంగాణ ఎపిసోడ్ పై అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారా లేక చెల్లెలి పార్టీకి తనకు సంబంధం లేదన్న సంకేతాలు ఇస్తున్నారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే టీఆరెఎస్ సోషల్ మీడియాలో మాత్రం జగన్ వదిలిన బాణమేనన్న రీతిలో ప్రచారం చేస్తుండడం విశేషం. ఏది ఏమైనా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ చర్చకు దారి తీస్తోంది.