దిశ దశ, భూపాలపల్లి:
అన్నారం బ్యారేజీ సమీపంలో జరుగుతున్నఇసుక తవ్వకాల విషయంలో నిర్వాహకుల ఇష్టారాజ్యం నడుస్తోందా..? బారీ ఎత్తున మేటలు వేయడంతో ఇసుక తొలగించాలన్న ప్రతిపాదనలు చేసిన ఇరిగేషన్ విభాగం అధికారులు పట్టించుకోని వైఖరి అవలంభించారా..? జీపీఎస్ ద్వారా ఇసుక తవ్వకాలకు సంబంధించిన ఏరియాకు హద్దులు నిర్ణయిచంలేదా..? బార్డర్లు నిర్ణయించినా ఇష్టారీతిన తవ్వకాలు జరిపారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఎగువన…
అన్నారం బ్యారేజీకి ఎగువ ప్రాంతంలో భారీ ఎత్తున ఇసుక వచ్చి చేరిందని ఇరిగేషన్ అధికారులు నివేదికలు ఇచ్చారు. గేట్లు మూసి వేసే పరిస్థితి కూడా లేకుండా ఇసుక మేటలు వేసిందని తొలగించాల్సిన ఆవశ్యకత ఉందని అధికారులు తేల్చారు. దీంతో అన్నారం బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో ఇసుక తరలించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే లక్షలాది క్యూబిక్ మీటర్ల మేర ఇసుకను తొలగించే విషయంలో నిబంధనలు పాటించారా లేదా అన్నదే అసలు చర్చగా మారింది. ఇసక మేటలు వేసిన గేట్ల కింది భాగంతో పాటు ఎగువన ఇసుక తరలించాల్సి ఉంటుంది. ఒక లేయర్ మాదిరిగా ఇసుకను తొలగిస్తూ ఎక్కవగా ఉన్న చోట ఇసుకను తొలగించాల్సి ఉంటుంది. అయితే అన్నారం బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో మాత్రం కొంత ప్రాంతంలో ఇసుక భారీగా తొలగించినట్టుగా అక్కడ ఏర్పడిన గుంతలు స్పష్టంగా చెప్తున్నాయి. బ్యారేజీ మధ్యన అప్ స్ట్రీమ్ ఏరియాలో నిర్వాహకులు ఇసుకను తవ్వినట్టుగా ఉంది.
దిగువన…
ఇకపోతే అన్నారం బ్యారేజీ దిగువ ప్రాంతంలో కూడా ఇసుకను తరలించేందుకు అధికారులు క్లియరెన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఒకే ప్రాంతంలో ఇసుక తవ్వినట్టుగా గుంతలు దర్శనమిస్తున్నాయి. డౌన్ స్ట్రీమ్ భాగంలో అనుమతులు ఇచ్చినప్పటికీ ఇసుక తవ్వకాలు ఒకే చోట తవ్వడం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
హద్దులు లేవా..?
అయితే TGMDC ద్వారా ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చినప్పుడు పక్కాగా జీపీఎస్ ద్వారా హద్దులు నిర్ణయిస్తారు. ఎక్కడైతే ఇసుక తవ్వకాలు జరపాల్సి ఉందని ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా TGMDC హద్దులు ఏర్పాటు చేస్తోంది. కానీ అన్నారం బ్యారేజ్ ఎగువ, దిగువ భాగాన ఇసుక తవ్వకాలు కనిపిస్తున్న ప్రాంతంలో మాత్రం లెవల్ మెయింటెన్ చేయనట్టుగా స్పష్టం అవుతోంది. ఇసుక మేటలు అక్కడే ఉన్నందున అదే ప్రాంతంలో తవ్వకాలకు అనుమతి ఇచ్చామని అధికారులు అన్నట్టయితే గోదావరి నదిలో ఇసుక ఒకే లెవల్లో ఉండాలి. కానీ ఇసుక సేకరించిన ప్రాంతంలో గుంతలు ఏర్పడడం, మిగతా ప్రాంతంలో ఎత్తుగా ఉండడం గమనార్హం. ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చిన అధికారులు ఈ విషయంపై దృష్టి సారించారా లేదా అన్న అనుమానం కలుగుతోంది. ఇసుక మేటలు వేసిన గేట్ల కింది భాగంతో పాటు మిగతా ప్రాంతాలను గుర్తించే విషయంలో అధికారులు హద్దులు నిర్ణయించలేదా..? నిర్వాహకులకు అప్పగించిన తరువాత వారు ఎక్కడ తవ్వకాలు జరిపినా పట్టించుకోలేదా అన్నదే అంతు చిక్కని ప్రశ్నగా మారింది. వరద నీరు వచ్చినప్పుడు ఇసుక దిగువ భాగానికి కొట్టుకపోతుందని దీంతో ఇబ్బంది ఉండదన్న వాదనలు కూడా తెరపైకి తీసుకవచ్చే అవకాశం లేకపోలేదు. అయితే వరద నీటి కారణంగా ఇసుక ఎలాగూ కొట్టుకపోతుంది కాబట్టి తవ్వకాలకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇసుక మేటలు చూపించి అధికారులు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా నివేదికలు సిద్దం చేసిన అధికారులు తవ్వకాలు జరిపే అప్పడు కూడా ఇదే పద్దతిని పాటించాల్సిన అవసరం లేదా అన్న చర్చ కూడా స్థానికంగా సాగుతోంది. ఎగువ ప్రాంతంలో ఇసుక తవ్వకాల వల్ల ఏర్పడిన గుంతల వల్ల వరద ప్రవాహం వచ్చి చేరినప్పుడు ఈ గుంతల మీదుగా ప్రవహించే నీరు వేగం మరింత ఎక్కువ అయ్యే అవకాశం లేకపోలేదు. గేట్లకు కొద్ది దూరంలోనే జరిపిన ఈ తవ్వకాల వల్ల వరద ఉధృతి ప్రబావం గేట్లపై పడినట్టయితే బాధ్యుత ఎవరు వహిస్తారో అధికారులకే తెలియాలి.
వారి దృష్టి పడలేదా..?
ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం గణనీయంగా తగ్గిందని ఇసుక రవాణాపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందు కోసం వివిధ విభాగాల అధికారులను రీచుల వద్ద డిప్యూటేషన్ వేసి ఇసుక రీచుల్లో జరుగుతున్న తంతుపై దృష్టి సారించింది. అయితే అన్నారం ఎగువ, దిగువ భాగంలో ఉన్న ఈ ఇసుక తవ్వకాల తీరుపై ప్రత్యేక అధికారుల బృందం దృష్టి సారించిందా లేదా అన్న చర్చ కూడా సాగుతోంది.
ఆ రోడ్డు ఎందుకు..?
అన్నారం బ్యారేజ్ ఎగువ బాగాన తవ్వకాలకు బ్రేకు పడిన తరువాత కూడా రోడ్డును మాత్రం అలాగే ఉంచారు. ఇసుక తరలించేందుకు మెయిన్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ గోదావరి నదిలోకి వేసిన ఈ రోడ్డు మీదుగానే గతంలో ఇసుకను స్టాక్ యార్డుకు తరలించేవారు. కానీ ఇప్పుడు అక్కడ ఇసుక తవ్వకాలు నిలిచిపోయినందున రోడ్డును అలాగే ఎందుకు ఉంచారన్నదే అంతు చిక్కడం లేదు. కాంట్రాక్టు ముగిసిన తరువాత TGMDC అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులను కానీ, నిర్వాహకులు కానీ ఈ రోడ్డును తొలగించకపోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటనేది వారికే తెలియాలి.