ఇసుక తవ్వకాల్లో విచిత్రం
దిశ దశ, భూపాలపల్లి:
గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఇక్కడి భూములను సస్యశామలం చేయడం మాట ఎలా ఉన్నా… ఇసుక కాంట్రాక్టర్లకు మాత్రం ఈ నది వరప్రదాయినిగా తయారైంది. ఆదాయం కోసం సర్కారు సాండ్ దందా చేయడమే మేలని భావిస్తుండడం వారికి లాభల పంట పండిస్తోంది. కొంతకాలంగా రాష్ట్ర ఖాజానాకు పెద్ద దిక్కుగా మారిన గోదావరి నదిలో రీచులను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు..? అవి ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నారు..? వాటికి ఇచ్చిన గడువు ఏమిటీ ఇలా చాలా అంశాలను పట్టించుకునే వారు లేకుండా పోయారు. కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినా వారిని వెనకేసుకొస్తున్న తీరు కూడా విస్మయానికి గురి చేస్తోంది.
అన్నారంలో…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండలంలోని ఒక్క అన్నారం శివార్లలోని ఇసుక రీచులనే పరిశీలించినట్టయితే విస్తూపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడి నుండి కొన్ని సంవత్సరాలుగా డబుల్ బెడ్రూం ఇండ్ల పేరిట ఇసుక రవాణా జరిగింది. రాష్ట్రంలోని వివిధ నదుల నుండి 2 BHK భవనాల నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం ఇసుకను తరలించేందుకు అనుమతి ఇచ్చింది. TSMDC ఆధ్వర్యంలో అనుమతులు ఇచ్చిన ఈ రీచుల్లో తవ్వకాలు జరిపిన ఇసుక ఎక్కడి డబుల్ బెడ్రూంల నిర్మాణానికి ఉపయోగపడింది..? ఎక్కడ నిర్మించారు అన్న విషయం అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికే తెలియాలి. ఇందులో అత్యంత ఎక్కువ ఇసుక అన్నారం వద్ద ఏర్పాటు చేసిన రీచ్ నుండే వెల్లి ఉంటుందని ఓ అంచనా. బాహాటంగానే ఇక్కడి ఇసుకను డబుల్ ఇండ్ల పేరిట తరలించిన లెక్కలు తీస్తే వాస్తవాలు బయటపడతాయని అంటున్నారు కొందరు. అయితే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తరువాత డబుల్ ఇండ్ల విషయాన్ని పక్కనపెట్టినప్పటికీ అంతకుముందు ఇచ్చిన అనుమతులను అడ్డం పెట్టుకుని ఇసుకను అక్రమంగా తరలించుకపోయారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇక్కడ రీచ్ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా నామినేషన్ విదానాన్ని అవలంభించినట్టుగా సమాచారం. ఇంతకాలం కమర్షియల్ రీచుల కోసం నామినేషన్ విధానం అమలు చేయకపోగా, ఈ సారి మాత్రం ఓ కాంట్రక్టర్ కోసం ప్రత్యేకంగా ఈ పద్దతిలో రీచును కెటాయించిన తీరు సంచలనమేనని చెప్పాలి. మరోవైపున ఇదే చోట టెండర్ ద్వారా కూడా మరో రీచును ఏర్పాటు చేసిన అధికారులు ఇక్కడి ఇసుకను వే బిల్లుల ద్వారా అమ్మకాలు సాగించేందుకు అనుమతులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వాస్తవంగా ఒక్కో రీచును ఒక్కో ప్రాంతంలో ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేకంగా హద్దులు కెటాయించాల్సి ఉన్నప్పటికీ అలాంటి చొరవ తీసుకునేందుకు ఏనాడూ అధికారులు ప్రయత్నించకపోవడం కూడా విడ్డూరం. దీంతో ఒకేచోట రెండు ఆపై రీచుల కోసం ఇసుక తవ్వకాలు జరిపించారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల అన్నారం బ్యారేజీకి దిగువన ఉన్న ఈ క్వారీలో ఇసుకను లోడ్ చేసేందుకు లారీలనే లోపలకు అనుమతించారు. వందలకొద్ది లారీలను క్యూలో ఉంచి ఇసుక లోడింగ్ చేసేవారు. మిషనరీ ద్వారా లారీలను నింపుతున్న అధికారుటు పట్టించుకున్న పాపాన పోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవలే ఈ అంశం వెలుగులోకి రావడంతో లారీలను గోదావరి నదిలోకి పంపకుడా నిలువరిస్తున్నారు.
చర్యలు మరీ..?
ఇసుక లోడింగ్ కోసం లారీలను గోదావరి నదిలోకి పంపించడం అనేది నిబంధనలకు విరుద్దం. టీఎస్ఎండీసీ కెటాయించిన రీచు నుండి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా స్టాక్ యార్డ్ వద్దకు తరలించి అక్కడ లారీలను లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ అలాంటి చొరవ తీసుకుకుండా ఏకంగా లారీలనే గోదావరి నదిలోకి తీసుకెళ్లి లోడ్ చేయించిన తీరుపై కఠినంగా వ్యవహరించకపోవడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అయితే ఇసుక రీచు నిర్వహాకులు చేసిన ఈ తప్పిదంపై పర్యావరణ చట్టంతో పాటు ఇతరాత్ర చట్టాలను అమలు చేసి కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. కానీ అలాంటి చర్యలు తీసుకునేందుకు సంబంధిత శాఖల అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించినట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా రీచులకు హద్దులు ఏర్పర్చినప్పటికీ ఇతర ప్రాంతాల్లోని రీచుల కోసం కూడా ఇసుక తవ్వకాలు జరుపుతున్న తీరుపై కూడా టీఎస్ఎండీసీ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడం వెన్ ఉన్న ఆంతర్యం ఏంటో అర్థం కాకుండా పోతోంది. అంతేకాకుండా ఇక్కడి నుండి గతంలో ఇరిగేషన్, డబుల్ ఇండ్ల పేరిట ఇసుక తరలిపోయినట్టయితే టీఎస్ఎండీసీ ఎంతమేర ఇసుక తరలించేందుకు అనుమతి ఇచ్చింది..? ఎంత కాలంలో పూర్తి చేయాలన్న అగ్రిమెంట్ జరిగింది అన్న వివరాలతో పోల్చినట్టయితే ప్రభుత్వ అవసరాల పేరిట ఎంత మేర ఇసుక వెల్లిందోనన్న విషయం స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అదే పర్సన్…?
అన్నారం వద్ద ఇసుక రీచులను నిర్వహాకుల పేర్లలో గత ప్రభుత్వం నుండి కూడా ఒకే వ్యక్తి పేరు వినిపిస్తోంది. ఏ ఏజెన్సీకి టీఎస్ఎండీసీ అగ్రిమెంట్ చేసిందో కానీ అప్పడు, ఇప్పుడు అదే వ్యక్తి ఇక్కడ ఇసుక వ్యాపారాన్ని చేసేందుకు ముందుకు వస్తుండడం గమనార్హం. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని తూర్పు జిల్లాకు చెందిన సదరు వ్యక్తి అన్నారం నుండి ఇసుక వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపుతుండడం, ఆయన పేరు మాత్రమే ఈ ప్రాంతంలో వినిపిస్తుండడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటీ అన్న విషయంపై దృష్టి సారించినట్టయితే వాస్తవాలు తెలిసే అవకాశం ఉందని అంటున్నారు పలువురు.