దిశ దశ, పెద్దపల్లి:
ఇసుక పాలసీ మార్చే విషయంలో అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. ఇసుక రీచుల నిర్వాహకులతో కూడా సమావేశం అయిన అదికారులు పలు అంశాలపై చర్చించినట్టుగా సమాచారం.
ఆదాయంపైనే దృష్టి…
ఇసుక అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. 2019లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 900 కోట్ల ఆదాయం గడిస్తే ఇప్పుడు మాత్రం రూ. 700 కోట్ల నుండి రూ. 800 కోట్ల వరకే ఆదాయం వస్తోందన్న విషయంపై సమగ్రంగా ఆరా తీసినట్టు సమాచారం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మీదుగా ప్రవహిస్తున్న నదుల నుండి తరలిస్తున్న ఇసుకలో సింహభాగం భాగ్యనగారానికే చేరుతోంది. 2019తో పోల్చితే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో నిర్మాణాలు ఎక్కువగానే జరుగుతున్నాయని గణాంకాలు సేకరించారు ఉన్నతాధికారులు. భవన నిర్మాణాలకు అవసరమైన ముడి సరుకుల అమ్మకాల వివరాలను సేకరించిన అధికారులు అదే స్థాయిలో ఇసుక కూడా అమ్మకాలు జరగాల్సి ఉంటుదని అంచనా వేసినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం 2019 సంవత్సరంలో కంటే తక్కువ ఆదాయం వస్తుండడానికి కారణమేంటీ..? అక్రమంగా తరలిస్తున్నారా లేక ఓవర్ లోడ్ కారణంగానా అన్న అంశాలపై అధ్యయనం చేసినట్టుగా తెలుస్తోంది. సర్కారుకు ఆదాయం పెంచే విషయంలో అన్ని కోణాల్లోనూ వివరాలు సేకరిస్తున్న మైనింగ్ అధికారులు ఇసుక రీచుల నిర్వాహకులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
కాంట్రాక్టర్ల వాదన…
అయితే ఇసుక వల్ల వచ్చే ఆదాయం తగ్గడానికి కారణం తాము కాదని ఉన్నతాధికారులకు ఇసుక రీచుల కాంట్రాక్టర్లు చెప్పినట్టుగా సమాచారం. 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల రూ. వందల కోట్లలో ఆదాయం గడించిన విషయాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అలాగే మహానగరంలో జరుగుతున్న భవన నిర్మాణాలకు ఇసుక కన్నా ఎక్కువగా డస్ట్ వినియోగం పెరిగిపోయిందని దీంతో ఇసుక వ్యాపారంపై ప్రభావం పడి ఉండవచ్చన్న విషయాన్ని కూడా పరిశీలించాలని రీచుల నిర్వాహకులు వివరించినట్టు తెలుస్తోంది.
మానకొండూరు మండలం ఊటూరు క్వారీని పర్యవేక్షించిన అధికారుల బృందం
అధికారుల చేతుల్లోకి…
అయితే ఇసుక రీచుల కేంద్రంగా సాగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకే ఉన్నతాధికారులు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. దీంతో పలువురు అధికారులకు రీచుల బాధ్యతలు అప్పగించి ఇసుక తరలించే విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు సమాయత్తం అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అధికారులకు రీచుల క్షేత్ర స్థాయి పరిశీలనకు కూడా శ్రీకారం చుట్టారు. అయితే రీచుల నిర్వాహకులు కూడా మరో అంశాన్ని తెరపైకి తీసుకవచ్చినట్టు సమాచారం. నదుల్లోని ఇసుకను స్టాకు యార్డుల వరకు తీసుకవచ్చే బాధ్యత మాత్రమే తమదని మిగతా అంశాలకు తమకు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పినట్టుగా తెలిసింది. అయినప్పటికీ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ అధికారులు తమపైనే భారం వేశారని చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా స్టాక్ యార్డుల నుండి లోడింగ్ వ్యవహారం, లింక్ రోడ్ నిర్మాణం, గ్రామల్లో ధుమ్ము, ధూళీ సమస్యలు రాకుండా ఉండేందుకు వాటర్ స్పే చేయించడంతో పాటు ఇసుక రవాణాతో ముడిపడి ఉన్న అంశాలన్నింటిని వ్యవహారాలను తామే చక్కబెట్టాల్సి వస్తోందని వివరించినట్టుగా తెలిసింది. దీంతో అదనపు బాధ్యతలను కూడా తామే పర్యవేక్షిస్తామని ఇందుకు అనుగుణంగా అధికార యంత్రాంగానికి బాధ్యతలు అప్పగిస్తామని చెప్పినట్టు సమాచారం. దీంతో రీచుల నిర్వాహకులు గ్రామాల్లో వాటర్ స్ప్రే చేయించే విధానంతో పాటు తమకు సంబంధం లేని బాధ్యతల నుండి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో ఇసుక లారీలు రాకపోకలు సాగించే రహదారుల్లో ధుమ్ము లేస్తుండడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని సీతంపల్లి వాసులు వందలాది లారీలను నిలువరించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేయడంతో గురువారం రాత్రి ఇసుక లారీలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను కూడాా నిలిచిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.