దిశ దశ, కామారెడ్డి:
కామారెడ్డి జిల్లాలోని అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ముగ్గురు శవాలుగా తేలిన ఘటనపై ఇంకా స్పష్టత రానట్టుగా తెలుస్తోంది. ఎస్సై సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ లు ముగ్గురు ఒకే సారి ఆత్మహత్య చేసుకున్నారా లేక ఒకరిని కాపాడబోయి మిగతా ఇద్దరు తుది శ్వాస విడిచారా అన్న విషయంపై క్లారిటీ లేకుండా పోతోంది. దీంతో ముగ్గురి మొబైల్ ఫోన్లు రిట్రైవ్ చేస్తే తప్ప పోలీసులు ఓ నిర్దారణకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. జిల్లా ఎస్పీ సింధూ శర్మ కూడా మీడియాతో మాట్లాడుతూ… టెక్నాలజీ సాయంతో ముగ్గురి మరణానికి గల కారణాల గురించి ఆరా తీస్తున్నామన్నారు. దీంతో ఈ ముగ్గురి మరణం ఎలా సంభవించిందన్నది మాత్రం ఇంకా తేలలేదని స్పష్టం అవుతోంది.
అసలేం జరిగింది..?
ఎస్సై సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ లు ముగ్గురు కలిసి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్దకు ఎందుకు వెల్లారన్న విషయం తేలాల్సిన అవసరం అయితే ఉంది. వీరు ముగ్గురు చెరువులో ప్రమాదవశాత్తు పడిపోయారా లేక, ముగ్గురు ఒకే సారి దూకి చనిపోయారా, ఆత్మహత్యకు పాల్పడే వారిని కాపాడే ప్రయత్నంలో మిగతా వారు కూడా చనిపోయారా అన్న విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. చెరువు కట్టపై ఎవరూ లేకపోవడంతో పాటు, అక్కడ సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో అసలేం జరిగింది అన్న విషయం తెలియకుండా పోయింది. ముగ్గురు మిస్సయ్యారన్న విషయం వెలుగులోకి వచ్చిన తరువాత పోలీసులు అన్వేషిస్తున్న క్రమంలో అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో వీరి ఆనవాళ్లు లభ్యం అయ్యాయి. దీంతో చెరువులో గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టడంతో ముగ్గురి శవాలు బయటపడ్డాయి.
కారణం ఏంటీ..?
ముగ్గురి మరణం ఎలా సంబంవించింది అన్న విషయంపై స్ఫష్టత లేకపోయినప్పటికీ అసలు వీరు ముగ్గురు ఎందుకు కలుసుకున్నారన్న విషయంపై ఆరా తీస్తే క్లూ లభించే అవకాశం లేకపోలేదు. ఎస్సై, కానిస్టుబుల్, ఆపరేటర్ ముగ్గురు కలుసుకోవడం, దాబా హోటల్ లో భోజనం చేయడం అక్కడి నుండి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్దకు చేరుకోవడం వెనక కారణం ఏంటన్నది తేల్చాల్సిన ఆవశ్యకత ఉంది. మరణం బీబీపేటలో పని చేస్తున్న కానిస్టేబుల్ శృతి, అదే గ్రామానికి చెందిన నిఖిల్, భిక్కనూరులో ఎస్సైగా పని చేస్తున్న సాయి కుమార్ లు ఎందుకు కలుసుకోవల్సి వచ్చిందన్న మిస్టరీని ఛేదించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ విషయం పక్కన పెడితే… ఎస్సై సాయి కుమార్, కానిస్టేబుల్ శృతిలు తమ పై అధికారుల అనుమతి తీసుకుని వెళ్లారా..? ఒకవేళ పర్మిషన్ తీసుకున్నట్టయితే ఎక్కడకు వెళ్తామని చెప్పారు..? ఆ తరువాత వీరెందుకు కలుసుకోవల్సి వచ్చింది అన్న కోణంలో ఆరా తీస్తే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది. వివిధ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు పోలీసు అధికారులు, తమ కింది స్థాయి సిబ్బంది మధ్య పరిచయాలు పెరగడం కామన్ గా జరుగుతూ ఉంటుంది. బదిలీపై వెల్లిన తరువాత కూడా యోగక్షేమాలు తెలుసుకోవడం కూడా సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఎస్సై సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, ప్రత్యేకంగా కలుసుకోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటన్నది తెలియరావడం లేదు. పోలీసు అధికారులు ఈ విషయంపై స్పష్టత ఇవ్వకపోవడంతో అసలు విషయం ఏమై ఉంటుంది అన్న చర్చ తీవ్రంగా సాగుతోంది. డ్యూటీలో భాగంగా వీరిద్దరి మధ్య పరిచయాలు ఉన్నట్టయితే బదిలీ అయిన తరువాత కూడా వీరెందుకు కలుసుకోవల్సి వచ్చింది..? ఒక వేళ కలిసినా ట్రీట్ ఇచ్చుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోకుండా ప్రత్యేకంగా చెరువు వద్దకు వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్ని కూడా అంతుచిక్కకుండా పోతోంది.
థర్డ్ పర్సన్ ఎవరు..?
కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ వీరిద్దరితో కలిసి వెళ్లడానికి అసలు కారణం ఏంటీ..? అతనికి వీరితో ఉన్న అనుబంధం ఏంటీ అన్నది కూడా మిస్టరీగా మారింది. నిఖిల్ తనకు ప్రాణ హానీ ఉందనో మరేదో విషయంగానే పోలీసులకు ఫిర్యాదు చేశాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఫిర్యాదు అందిన విషయం తన దృష్టికి రాలేదని ఈ విషయంపై విచారణ జరుపుతున్నామని కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ వెల్లడించారు. ఇంతకీ నిఖిల్ ఎవరితో ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేశాడు..? అతన్ని ప్రత్యర్థులు టార్గెట్ చేయాల్సిన ఆవశ్యకత ఏంటీ..? అతని ఫిర్యాదులో ఎస్సై సాయి కుమార్ పేరు కానీ శృతి పేరు కానీ ఉందా అన్నది కూడా తేల్చాల్సి ఉంది. ఒకవేళ నిఖిల్ ఇచ్చిన ఫిర్యాదులో ఎస్సై, కానిస్టేబుల్ పేర్లు లేనట్టయితే అతన్ని టార్గెట్ చేసింది ఎవరన్నది తేల్చాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకవేళ ఎస్సై సాయి, పీసీ శృతిల పేర్లు ఉన్నట్టయితే ఇందుకు కారణాలు ఏంటన్న విషయంపై దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సాధారణ కంప్యూటర్ ఆఫరేటర్ పోలీసు విభాగానికి చెందిన వారితో అంత సాన్నిహిత్యంగా ఉండడానికి అసలు కారణం ఏంటన్న చర్చ సాగుతోంది. నిఖిల్ ఫిర్యాదు ఇచ్చినా ఇవ్వకున్నా అసలు అతను ఎస్సై, పీసీలతో కలిసి వెళ్లడానికి కారణం ఏంటీ అన్న విషయం తేల్చేందుకు అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు, పోలీసు విభాగానికి చెందిన వారి నుండి వివరాలు సేకరించినట్టయితే అసలు విషయం తేలే అవకాశం లేకపోలేదు.
మరణం చుట్టే…
అయితే ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లా పోలీసు అధికారులు చెప్తున్న విషయాలను బట్టి ఈ ముగ్గురి మరణం ఎలా సంభవించింది అన్న కోణంలో మాత్రమే ఆరా తీస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. వారి మొబైల్ కాల్స్ డాటా, వాట్సప్ ఛాటా కోసం సాంకేతిక నిపుణుల వద్దకు పంపించామని ఎస్పీ వెల్లడించారు. ముగ్గురి మొబైల్స్ లో లబించే డాటా ఆదారంగా వారి మరణం ఎలా జరిగిందన్న విషయంపై స్పష్టత వస్తుందని అంటున్నారు. అయితే వీరు మగ్గురు ఎందుకు కలుసుకున్నారు, వీరి ముగ్గురి మధ్య ఉన్న సాన్నిహిత్యం ఏంటీ..? ఆరోజు కలుసుకునే అవకాశం ఉందన్న విషయం ఇతరులతో పంచుకున్నారా అన్న వివరాలను సేకరించినా దర్యాప్తు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో నీళ్లలో మునిగి చనిపోయిన ఘటనలను బట్టి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో జరిగిన ఘటనను బేరీజు వేసుకున్న పోలీసులు ఒకరు చనిపోయే ప్రయత్నం చేస్తుంటే మిగతా ఇద్దరు కాపాడే ప్రయత్నంలో నీళ్లోలో మునిగిపోయి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో జరిగిన ఇలాంటి నేరాల విషయంలో జరిగిన పరిశోధనల ఆధారంగా పోలీసులు ఈ ముగ్గురి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ఛేదించినా కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.