ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఆనందం వ్యక్తం చేశారు. తన అన్నయ్య కీరవాణికి పద్మశ్రీ అవార్డు రావడం పట్ల గర్వంగా ఉందని రాజమౌళి స్పష్టం చచేశారు. పద్మ శ్రీ అవార్డు గుర్తింపు కోసం ఎంతో కాలం ఎదురుచూస్తున్నానని తెలిపారు. కీరవాణితో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
తన సోదరుడికి వరుస అవార్డులు రావడం పట్ల రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. కీరవాణికి చూస్తూ కూర్చున్న ఓ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ‘నిజానికి ఈ గుర్తింపు ఎప్పుడో వచ్చి ఉండాలని మీ అభిమానులందరి లాగానే నేనూ భావిస్తున్నాను. కానీ, ఈ ప్రపంచం ఒక వ్యక్తి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఊహించని రీతిలో అందిస్తుందంటూ మీరు ఎప్పుడూ చెప్పే మాటలను గుర్తు పెట్టుకున్నాను. ఒకవేళ నేనే కనుక ఈ విశ్వంతో మాట్లాడగలిగితే.. కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా. ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాక మరొకటి ఇవ్వు అప్పుడే విజయాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించే అవకాశం ఉంటుంది అని చెబుతాను’ అంటూ తెలిపారు. నా పెద్దన్న.. ఎం.ఎం.కీరవాణికి పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉంది. గర్వంగా ఫీలవుతున్నా అని రాజమౌళి ట్వీట్ చేశారు.
ఈ ఏడాది’ఆర్ఆర్ఆర్’ సినిమాకు గానూ కీరవాణికి వరుస అవార్డులు వరించాయి. ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డుతో పాటు ‘బోస్టన్ సోసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్’, ‘క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డు’, ‘లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. తాజాగా వచ్చిన పద్మశ్రీ అవార్డుతో ఆయన ఖ్యాతి మరింత పెరిగింది. ఇప్పటికే ‘నాటు నాటు’ పాట ఆస్కార్ నామినేషన్‌లో చోటు దక్కించుకుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే కీరవాణి కిరీటంలో ఆస్కార్ రూపంలో మరో కలికితురాయి చేరడం ఖాయం.