ఇంటికెళ్లి కలిసిన ఆది శ్రీనివాస్…
బీఆర్ఎస్ ముఖ్య నేత ఫోన్
ఈటల వెంటే నడుస్తారా..?
దిశ దశ, వేములవాడ:
కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా పనిచేసిన తుల ఉమ రాజకీయ భవిష్యత్తు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు. ఓ వైపున వివిధ వర్గాల నుండి సానుభూతి మాటలు, మరో వైపున తాను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న విషయంపై తర్జన భర్జన పడుతున్న ఆమె గురించి వేములవాడ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బీజేపీ అధిష్టానం చివరి నిమిషంలో ఇచ్చిన షాకు నుండి ఇంకా తేరుకోని ఉమ రెండు మూడు రోజుల్లో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్తున్నారు. కానీ ఆమెకు టికెట్ నిరాకరించిన తీరుతో నియోజకవర్గంలో మరింత సానుభూతి పెరిగింది. ఈ దశలో ఆమె తీసుకునే నిర్ణయం వల్ల ఇక్కడి అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.
పరామార్శల వెల్లువ…
అయితే చివరి రోజు కావడంతో శుక్రవారం తుల ఉమ నామినేషన్ వేసేందుకు ర్యాలీగా వెల్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ అధిష్టానం బీఫారం చెన్నమనేని వికాస్ రావు పేరిట పంపించి షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఉదయం పంపిన తుది జాబితాలో కూడా తన పేరే ఉండడంతో ధీమాతో ముందుకు సాగిన తుల ఉమ ర్యాలీలో ఉన్నప్పుడు వేములవాడ అభ్యర్థిని బీజేపీ అధిష్టానం మార్చేసిందన్న సమాచారం అందుకున్నారు. దీంతో కన్నీరు మున్నీరుగా విలపించిన తుల ఉమ అగ్రవర్ణ సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా కామెంట్ చేశారు. దొరల తీరుపై విరుచుకపడిన తీరు అందరినీ ఆలోచనలో పడేసింది. ఈ క్రమంలో వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ తుల ఉమ ఇంటికి వెళ్లి పలకరించి బీజేపీ అధిష్టానం తీరుపై మండిపడ్డారు. బీసీ బిడ్డకు చివరి నిమిషంలో అన్యాయం చేయడం సముచితం కాదని వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో తనకు బాసటగా నిలవాలని, తన గెలుపునకు సహకరించాలని తుల ఉమను ఆది శ్రీనివాస్ అభ్యర్థించగా తానిప్పుడే ఏ నిర్ణయం తీసుకోలేనని రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని అన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు ఒకరు కూడా ఫోన్ చేసి బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయం తీరును తప్పిపట్టినట్టు సమాచారం. మరోవైపున నియోజకవర్గంలోని తుల ఉమ అనుచరులతో పాటు వివిధ వర్గాలకు చెందిన వారు కూడా ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
ఈటల వెంటే నడుస్తారా..?
2021లో అనూహ్య పరిణామాల నేఫథ్యంలో గులాభి దళం నుండి బయటకు రావల్సి వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు తుల ఉమ కూడా బీజేపీలో చేరారు. అప్పటికే అధినేత కేసీఆర్ పై కినుక వహించిన ఉమ చాలా కాలంగా మౌనంగా ఉంటూ వచ్చారు. 2018 ఎన్నికల్లోనే టికెట్ ఆశించినప్పటికీ తనను పట్టించుకోలేదన్న వేదనతో తుల ఉమ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈటల రాజేందర్ బీజేపీలోకి చేరడంతో ఆయనతో పాటు కాషాయం కండువా కప్పుకున్నారు. జనశక్తి ఉద్యమంలో పనిచేసిన తుల ఉమ స్వరాష్ట్ర సాధన కోసం ఏర్పడిన ఉద్యమ పార్టీలో చేరి జడ్పీ ఛైర్ పర్సన్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీలో చేరినప్పుడు కూడా ఈ అంశాన్ని అంత సీరియస్ గా పట్టించుకోని బీజేపీ నాయకత్వం బీఫారం విషయం వచ్చే సరికి ఆమె కారణంగా పార్టీ క్యాడర్ ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ కారణంగానే ఆమెకు టికెట్ నిరాకరించినట్టుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ మరో అంశం కూడా ప్రచారంలో ఉంది. సంగారెడ్డి అభ్యర్థి ఎంపిక విషయంలో ఈటల రాజేందర్ తన సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. వేములవాడ, సంగారెడ్డి టికెట్ల విషయంలో ఈటల ఏమాత్రం తగ్గకుండా అధినాయకత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ క్రమంలో సంగారెడ్డి టికెట్ విషయంలో తన సామాజిక వర్గానికి చెందిన పులిమామిడి రాజుకు ఇవ్వల్సిందేనని ఈటల తేల్చి చెప్పడంతో వేములవాడ టికెట్ విషయంలో కొంత వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈటల రాజేందర్ పూర్తి స్థాయిలో తుల ఉమ టికెట్ విషయంలో అండగా నిలవలేకపోయారన్న వాదనలు బీజేపీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈటల వెన్నంటి బీజేపీలోనే తుల ఉమ కొనసాగుతారా లేక తన భవిష్యత్తు కోసం పార్టీ మారుతారా అన్న విషయంపై క్లారిటీ రావడం లేదు. అభ్యర్థిత్వం మారిపోయిన తరువాత మీడియాతో మాట్లాడిన తుల ఉమ దొరలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ దశలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు కూడా ‘వెలమ’ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో ఆమె ఉన్న పార్టీలోనే కొనసాగుతారా లేక బీఆర్ఎస్ లోకి వెళ్లి తాను వ్యతిరేకిస్తున్న సామాజిక వర్గాలకు అనుకూలంగా ప్రచారం చేస్తారా అన్నదే పజిల్ గా మారింది. ఈ నేపథ్యంలో వేములవాడలో బీసీ కార్డు నినాదంతో ముందుకు సాగి తన ప్రతీకారం తీర్చుకుంటారా అన్న చర్చ కూడా చర్చ సాగుతోంది. ఏది ఏమైనా తుల ఉమ ఫైనల్ నిర్ణయం తీసుకుని తన మద్దతు ఎవరికి ప్రకటిస్తారో అన్న సస్పెన్స్ వీడాలంటే మాత్రం ఆమె వైఖరిని వెల్లడించే వరకూ వేచి చూడాల్సిందే.