ఈ కౌలు డబ్బులు ఏమయ్యాయ్…

దిశ దశ, కరీంనగర్:

సీలింగ్ భూముల వ్యవహారంపై జిల్లా అధికారులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తొందరపాటు చర్య ఇప్పుడు ప్రభుత్వ ఖజానాకు గండి పడేసేలా తయారైందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా స్థాయి అధికారులను మిస్ గైడ్ చేశారా లేక  అధికారులే వెనకాముందు ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న విషయంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి.

అసలేం జరిగింది…

జివి సదాశివ రావుకు చెందిన 38 ఎకరాల భూమిని అప్పగించాలని ట్రిబ్యూనల్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విషయంపై పట్టాదారులు అప్పీల్ చేసుకోవడంతో ఇంకా కోర్టులో విచారణ సాగుతోంది. ట్రిబ్యూనల్ ఆదేశాల మేరకు తమకు లీజు డబ్బులు ఇప్పించాలని పట్టాదారుల అభ్యర్థనను పరిశీలించిన కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ లీజు అమౌంట్ పట్టదారులకు చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడంతో పట్టాదారులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో జిల్లా కలెక్టర్ కారును జప్తు చేయాలని కోర్ట్  ఆదేశించడంతో అధికారులు అప్పటికప్పుడు లీజు డబ్బులు చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. 2017లో వచ్చిన ఈ తీర్పునకు సంబంధించి కరీంనగర్ జిల్లా రెవెన్యూ అధికారులు 2020లో రూ.11 లక్షల26 వేల 400 కరీంనగర్ కోర్టులో డిపాజిట్ చేశారు. అయితే 2006లో ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పును అనుసరించి అప్పటి నుండి ఈ లీజు డబ్బులు చెల్లించాలని పట్టదారులు అభ్యర్థించడంతో జిల్లా అధికారులు కూడా అమౌంట్ చెల్లించి చేతులు దులుపుకున్నారు… కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది.

ఆ డబ్బు ఉందా..?

ప్రధానంగా ఈ భూములకు సంబంధించిన లీజు అమౌంట్ పట్టాదారుల వాటా కింద రూ. 11 లక్షల 26 వేల 400 చెల్లించిన రెవెన్యూ అధికారులు… మిగతా సగం డబ్బును ప్రభుత్వ ఖాతాలో జమ చేశారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కోర్టు తీర్పును అనుసరించి సగం లీజు డబ్బు చెల్లించినందున మిగతా డబ్బు ఖచ్చితంగా సర్కారు ఖాతాలో ఉండాలి.  పట్టాదారులు మళ్లీ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కేసు ఇంకా పెండింగులో ఉన్నట్టుగానే భావించాలి. అయితే ఇప్పటికే పట్టాదారులకు సగం లీజు అమౌంట్ డిపాజిట్ చేసినందున మిగతా సగం అమౌంట్ ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సిన అవసరం ఉంది. ఇఫ్పటికే 11 ఏళ్లకు సంబంధించిన లీజు అమౌంట్ పట్టాదారులకు కోర్టు ద్వారా చెల్లించినందున మిగతా సమయంలోని కౌలు డబ్బులు కూడా ఇవ్వాలని ఇప్పటికే పట్టాదారులు కోర్టును ఆశ్రయించారు. 2020లో రూ. 11 లక్షలు చెల్లించిన జిల్లా అధికారులు సీలింగ్ భూములు తమ ఆధీనంలోనే ఉన్నాయని వాటి ద్వారా లీజు కూడా వస్తోందని చెప్పకనే చెప్పినట్టయింది. మరో వైపున  మొత్తం 68 ఎకరాలకు సంబంధించిన లీజు అమౌంట్ ను పరిగణనలోకి తీసుకోవల్సి వస్తుందన్న విషయం తెరపైకి వస్తోంది. దీంతో ఎకరా భూమికి రూ. 10 వేల చొప్పున లీజు వస్తోందని అధికారులు ఒప్పుకున్నందున మొత్తం భూమికి ఏటా రూ. 6 లక్షల 80 వేల రూపాయల లీజు డబ్బులు ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. 2006 నుండి ఇప్పటి వరకు సీలింగ్ భూముల లీజు ద్వారా రూ. కోటి పై చిలుకు ఆదాయం సర్కారు ఖజానాలో జమ కావల్సిన అవసరం ఉంది. ఈ డబ్బు సర్కారు అకౌంట్లో జమ అయిందా లేదా అన్న విషయంపై క్లారీటీ తీసుకోవల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది. 

దారి మళ్లాయా..?

కరీంనగర్ జిల్లా కోర్టులో రెవెన్యూ అధికారులు అమౌంట్ డిపాజిట్ చేసిన దానిని బట్టి అయితే మాత్రం సదాశివరావుకు చెందిన భూములు లీజుకు ఇచ్చినట్టుగానే స్పష్టం అవుతోంది. ఏటా లీజు ద్వారా వచ్చిన అమౌంట్ ఏమయిందన్న విషయంపై కూడా జిల్లా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. భూముల లీజు  ద్వారా వచ్చిన దాదాపు రూ. కోటి పై చిలుకు డబ్బు సర్కారు ఖజనాలో చేరనట్టయితే అవి ఏమయ్యాయన్న కోణంలో ఆరా తీయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ అకౌంట్లలో చేరకుండానే నిధులను దారి మళ్లించే అవకాశం లేనందున సీలింగ్ భూముల లీజు సొమ్ముపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగానే కౌలుకు ఇచ్చినట్టయితే మాత్రం డబ్బులు సర్కారు చేతుల్లోకి రావల్సిందేనని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఈ నిధులు ఏ ఏ పద్దుల కింద జమ చేశారో తెలుసుకోవాలని లేనట్టయితే సీలింగ్ భూముల ద్వారా వచ్చిన ఆదాయం దారి మల్లినట్టేనని భావించాల్సి వస్తుంది.

You cannot copy content of this page