మేడిగడ్డపై తర్జనభర్జన
ఒక్క పిల్లరే అలా ఎందుకు.?
దిశ దశ, భూపాలపల్లి:
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ సమయంలో నిర్మించిన తీరు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. కేవలం మూడేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేసుకున్నామని ఢంకా బజాయించి చెప్పింది సర్కారు. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో ఇటీవల కాలంలో ఎదురవుతున్న సమస్యలు కూడా అదే స్థాయిలో సంచలనంగా మారిపోయాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో డొల్లతనం బయటపడుతోందని ప్రతిపక్షాలు అందిపుచ్చుకుని విమర్శిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో జరిగిన లోపాలు ఏంటీ అన్న విషయాన్ని విస్మరిస్తున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు. కానీ ఆ లోపాలను సవరించే బాధ్యత మన ప్రభుత్వంపై లేదని, సదరు సంస్థలే ఇందుకు బాధ్యత వహిస్తాయని ప్రకటిస్తున్నారు. కానీ అసలా పరిస్థితి ఎదురు కావడానికి కారణాలు ఏంటీ అన్న విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదన్నదే అసలు ప్రశ్ర.
నాడు పంప్ హౌజులు
గతంలో వచ్చిన వరదలు గోదావరి పరివాహక ప్రాంతాలను అతలా కుతలం చేశాయి. నదులన్ని కూడా పొంగిపొర్లడంతో తెలంగాణ అంతా కూడా వరదల మయంగా మారిపోయింది. ఈ సమయంలో గోదావరి నది సమీపంలోని నిర్మించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌజ్, పెద్దపల్లి జిల్లా సిరిపురం వద్ద నిర్మించిన అన్నారం సరస్వతి పంప్ హౌజ్ లు కూడా నీట మునిగిపోయాయి. ఇప్పటికీ ఈ రెండు చోట్ల కూడా మోటార్ల మరమ్మత్తులు నడుస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌజ్ లో 11 మోటర్లకు గాను 6 మోటార్లు మాత్రమే బాగయ్యాయని మిగతా మోటార్లను పునరుద్దరించే పనిలో నిమగ్నం అయ్యారన్న ప్రచారం జరుతోంది. భారీగా వచ్చిన ఈ వరదల్లో జరిగిన నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని మెయింటెనెన్స్ బాధ్యతలు తీసుకున్నసదరు కంపెనీయే వీటిని బాగు చేస్తుందని ప్రకటించారు. క్రౌడ్ బ్రస్ట్ కావడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందన్న ప్రచారం కూడా చేశారు. కానీ భారీ ఎత్తున గతంలో కనివినీ ఎరగని రీతిలో వరదలు ముంచెత్తినట్టయితే మోటార్ల పరిస్థితి ఎలా అన్నదే అంతుచిక్కకుండా పోయింది. కానీ ఈ అంశం గురించి పట్టించుకునే వారే లేకుండా పోయారన్న వాదనలు ఉన్నాయి.
నేడు మేడిగడ్డ…
ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్. ఇక్కడ బ్యారేజ్ తో పాటు వంతెన నిర్మాణం కూడా చేపట్టారు. అయితే తాజాగా 20వ నెంబర్ పిల్లర్ కుంగిపోవడంతో దీంతో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద సమస్య ఏర్పడిందని ఇరిగేషన్ ఇంజనీర్లు ప్రకటించారు. అయితే కుంగిపోయిన బ్యారేజ్ పిల్లర్ కు సంబంధించి ఎదురైన సమస్యను పరిష్కరించేందుకు ఎల్ అండ్ టి బాధ్యత తీసుకుంది. దీని నిర్మాణం చేపట్టిన సంస్థ మెయింటెనెన్స్ లోనే ఉన్నందున ఎల్ అండ్ టి వారే కుంగిపోయిన ప్రాంతాన్ని సెట్ చేస్తారని ఇరిగేషన్ అదికారులు చెప్తుండడంతో పాటు ఆ సంస్థ ప్రతినిధులు కూడా ఇదే అంశాన్ని వివరిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న అసలు విషయం మరుగునపడేయడం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 1.632 కి.మీ. పొడవైన లక్ష్మీ బ్యారేజ్ నిర్మాణ జరగగా, గత వంద సంవత్సరాల వరదలను అంచనా వేసి అతి ఎక్కువగా అంటే 28.25 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునే విధంగా బ్యారేజ్ పిల్లర్లను నిర్మించామని అధికారులు తెలిపారు. గత సంవత్సరం భారీ వరదల్లో దాదాపు 29 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా బ్యారేజ్ తట్టుకుందని వివరించారు. అయితే అంత భారీ ఎత్తున వరద వచ్చినప్పుడు కూడా పిల్లర్లు తట్టుకున్నప్పుడు ఇప్పుడు కుంగిపోవడానికి కారణాలు ఏంటన్నదే అంతుచిక్కకుండా పోతోంది. ప్రధానంగా నిత్యం వరద నీటిలో ఉండే ఇలాంటి బ్యారేజీలు కానీ వంతెనలు కానీ నిర్మించినప్పుడు ప్రతి పిల్లర్ కు సంబంధించిన సాయిల్ టెస్ట్ చేయించి ఏ పిల్లర్ ను ఎంత సామర్థ్యంతో నిర్మిచాలి అన్న అంశంపై నిర్దారణకు వస్తారు ఇంజనీర్లు. నిర్మాణ సమయంలో కూడా సాయిల్ టెస్ట్ రిపోర్టులను ఆధారం చేసుకుని అంతకు మించిన సామర్థ్యంతో నిర్మించి అవంతరాలను తట్టుకునేందుకు అవసరమైన మేర కాంక్రీట్ తో నిర్మాణం జరపడం ఆనవాయితీ. అయితే మేడిగడ్డ బ్యారేజ్ విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తలే తీసుకున్నా 20వ పిల్లర్ ఒక్కటే కుంగిపోవడం వెనక కారణాలు ఏంటన్నదే మిస్టరీగా మారింది. ఆదివారం వరకు 5 ఫీట్ల మేర పిల్లర్ కుంగిపోగా శనివారం మరో 12 నుండి 18 ఇంచుల వరకు కుంగిపోయినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అంతేకాకుండా బ్యారేజ్ గేట్ల వద్ద కూడా కొంతమేర పగుళ్లు తేలినట్టు కూడా ఇంజనీరింగ్ వర్గాలు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అయితే సాయిల్ టెస్ట్ చేసిన మరీ పిల్లర్ల నిర్మాణం జరిపినప్పుడు 20వ నెంబర్ పిల్లర్ కూరుకపోవడం వెనక అసలు ఏం జరిగిందోనన్న విషయాన్ని ఇంజనీర్లు గుర్తించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా గతంలో సామర్థ్యానికి మించి వరదలు వచ్చినా బ్యారేజ్ తట్టుకుందని అధికారులు చెప్తున్నారు. అయితే అంచనాలకన్నా ఎక్కువగా వచ్చిన వరదల వల్ల గ్రౌండ్ లెవల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయా..? కాంక్రీట్ బెడ్ పరిస్థితి ఏంటీ..? పిల్లర్లకు సంబంధించిన ఏరియాలో డ్యామేజ్ జరిగిందా అన్న విషయాలపై ఇంజనీరింగ్ అధికారులు ఆరా తీసే ప్రయత్నం చేశారా అన్నది తెలియడం లేదు. అలాంటి సమస్య ఏదీ ఎదురు కాలేదని గుర్తించినట్టయితే ఉన్నట్టుండి పిల్లర్ ఎందుకు కుంగిపోయిందన్న విషయంపై సమగ్రంగా ఆరా తీయాల్సిన అవసరం ఉంది. పిల్లర్ వేసినప్పుడు కాంక్రీట్ మిక్సింగ్ సరిగా జరగలేదా..? లేక ఇతరాత్రా కారణం ఏమైనా ఉందా అన్న విషయంపై క్లారిటీ రావల్సిన అవసరం ఉంది. నిర్మాణ సమయంలో కూడా ఓ పిల్లర్ విషయంలో ఇంజనీర్లు ఇబ్బందులు పడ్డారని… ఆ అటంకాన్ని అధిగమించేందుకు నిపుణుల బృందం సమీక్షలు జరిపి నిర్మాణం చేసేందుకు సాహసించినట్టుగా కూడా ప్రచారంలో ఉంది. అప్పుడు డెప్త్ విషయంలో ఇబ్బంది కల్గించిన పిల్లర్, ఈ పిల్లర్ ఒకటేనా ఇది మరో పిల్లరా అన్నది కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే పిల్లర్ వద్దే మళ్లీ సమస్య ఉత్పన్న అయినట్టయితే మళ్లీ సమస్య ఎదురు కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది. మరో పిల్లర్ అయితే ఇతర పిల్లర్ల పరిస్థితి గురించి కూడా నిపుణులు అంచనా వేసి బ్యారేజ్ డ్యామేజ్ కాకుండా జాగ్రత్త పడాల్సిన ఆవశ్యకత అయితే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.