అదే ఆ నేతకు మైనస్ అయిందా..?

దిశ దశ, జగిత్యాల:

రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతల్లో ఒకరాయన. కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్నారాయన. ప్రత్యక్ష్య రాజకీయాల్లో వైవిద్యతను కనబర్చే ఆ కురు వృద్దుడు ఓటమి చవి చూస్తున్న తీరు అభిమానులకు మింగుడు పడకుండా తయారైంది. జగిత్యాలకు చెందిన తాటిపర్తి జీవన్ రెడ్డి ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది.

ఎమ్మెల్యేగా…

1983లో తొలిసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. గెలుస్తూ ఓడుతూ ముందుకు సాగుతున్నా ఏనాడు కూడా జగిత్యాలను మాత్రం వదిలి పెట్టలేదు. 1989లో గెలిచినప్పుడు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఏకతాటిపై నడిచి ఆయనను ఒంటరి చేసినా కాంగ్రెస్ పార్టీలో తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కరీంనగర్ లోకసభకు జరిగిన రెండు ఉప ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేసేందుకు సాహసించారు. రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిన జీవన్ రెడ్డికి మరో బ్రాండ్ కూడా ఉంది. జగిత్యాల అంటేనే జీవన్ రెడ్డి… జీవన్ రెడ్డి అంటేనే జగిత్యాల అన్న పేరు పడిపోయింది. తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో గులాభి ప్రభంజనాన్ని తట్టుకుని అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయితే 2019, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన జీవన్ రెడ్డి తాజాగా నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లోనూ గెలుపును అందుకోలేక పోయారు. ప్రస్తుతం పట్ట భద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆయన నాలుగు జిల్లాల నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే జీవన్ రెడ్డి విషయంలో ఓ సెంటిమెంట్ కూడా స్ఫష్టం అవుతున్నట్టుగా ఉంది. గతంలో కరీంనగర్ లోకసభ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే పోటీ చేసి ఓటమి పాలు కాగా… తాజాగా ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

సక్సెస్ కాలేదెందుకో..?

గ్రాడ్యూయేట్స్ ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్ రెడ్డి నాలుగు ఉమ్మడి జిల్లాల్లోనూ పట్టు బిగించాల్సి ఉంది. కానీ ఆయన తన లక్ష్యం జగిత్యాల ఎమ్మెల్యే కావడమే అన్న రీతిలో ఎక్కువ సమయం సొంత నియోజకవర్గానికే కెటాయించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా నాలుగు జిల్లాల్లో పర్యటించినట్టయితే ఆయన గురించి ఆయా ప్రాంత ప్రజల్లో  సంపూర్ణ అవగాహన వచ్చేది. దీనివల్ల తాజా లోకసభ ఎన్నికల్లో ఆయనకు లాభించేంది. నాలుగు జిల్లాల్లో తరుచూ తిరుగుతూ అక్కడ నెలకొన్న సమస్యలను లేవనెత్తడంతో ఆయా జిల్లాల ప్రజల్లో తనదైన ముద్ర వేసుకునే వారు. సీనియర్ నేతగా గుర్తింపు ఉన్నప్పటికీ తన విజన్ ఏంటి అన్నది ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్సీ పదవిని అందిపుచ్చుకున్నట్టయితే తాజా ఎన్నికల్లో లాభించే అవకాశం ఉండేది. మరో వైపున నిజామాబాద్ జిల్లాల్లో అత్యంత ప్రభావితం చేసేది రైతాంగమేనన్నది అందరికీ తెలిసిందే. ఇక్కడి పసుపు రైతులు చేసిన ఉద్యమ ప్రభావం ఏకంగా ముఖ్యమంత్రి కూతురినే ఓడించింది. ముఖ్యంగా రైతాంగ సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ హొదాలో జగిత్యాలతోనే సరిపెట్టుకుండా తన పరిధిలోని అన్ని జిల్లాల్లో తిరుగుతూ ఆయా ప్రాంత పరిస్థితులను వెలుగులోకి తెచ్చినట్టయితే లోకసభ ఎన్నికల్లో ఆయనకు కలిసి వచ్చేది. చక్కెర కర్మాగారాలను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం చేతల్లో చూపించినప్పటికీ ప్రభావం చూపించలేకపోయింది. అయితే జీవన్ రెడ్డి అప్పటికే క్షేత్ర స్థాయిలో పట్టు బిగించినట్టయితే టఫ్ ఫైట్ ఇచ్చేవారన్న వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నాలుగు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక నేతల్లో ఒకరిగా ఎదిగిన జీవన్ రెడ్డి వరస ఓటములు మాత్రం ఆయన అభిమానులకు నిరాశను మిలుస్తోంది.

You cannot copy content of this page