అంబూలెన్స్ వాలాల ఆదిపత్యమా..? ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యమా..?

దిశ దశ, మంచిర్యాల:

సరిగ్గా నాలుగు క్రితం ఓ అంబూలెన్స్ డ్రైవర్ వ్యవహరించిన తీరు వల్లే ఓ ప్రాణం కోల్పోయిందని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన ఆసుపత్రికి కాకుండా మరో ఆసుపత్రికి పేషెంట్‌ను తీసుకెళ్లారని వారు ఫిర్యాదు చేశారు. దీంతో మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసి అంబూలెన్స్ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.  శెట్ పల్లికి చెందిన రేవెల్లి శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా అతన్ని చికిత్స కోసం తరలించే విషయంలో అంబులెన్స్ వాలాలే ఫలానా ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. చివరకు బాధిత కుటుంబం మరో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందేనని చెప్పడంతో చేసేదేమి లేక వారు ఆ దవాఖానకు తీసుకెళ్లారు. అయితే రెవెల్లి శ్రీకాంత్ కూడా జిల్లా  కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ థియుటర్ అసిస్టెంట్ గా చేస్తున్నందున ఆయన భార్య చెప్పినట్టుగా నడుచుకోక తప్పలేదు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం శ్రీకాంత్ ను కరీంనగర్ లోని భద్రకాళి న్యూరో ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీకాంత్ పరిస్థితి గురించి ఆందోళనతో ఉన్న అతని భార్యకు అంబులెన్స్ వాలాలు సూర్య ఆసుపత్రి పేరు చెప్పి కరీంనగర్ కు తీసుకెళ్లారు. అక్కడకు చేరుకున్న తరువాత కెల్విన్ ఆసుపత్రిలో చేర్చారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన శ్రీకాంత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అతనికి మెదడుకు గాయం అయిందని డాక్టర్లు చెప్పిన తరువాత కూడా న్యూరో వైద్యునిచే  చికిత్స  అందించేందుకు ప్రత్యేకంగా ఉన్న భద్రకాళి ఆసుపత్రికి కాకుండా మరో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఎందుకు సాహసించారన్నదే అంతు చిక్కకుండా పోతోంది. శ్రీకాంత్ భార్య స్వప్న, బావమరది చెప్తున్న కథనం ప్రకారం అయితే కెల్విన్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందిస్తారని అంబులెన్స్ వాలాలు నచ్చజెప్పారని స్ఫష్టం అవుతోంది. అక్కడి నుండి వెల్తున్నప్పుడు బిల్లు చెల్లించాల్సిందేనని పట్టుబట్టి మరీ వసూలు చేశారని కూడా బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. కరీంనగర్ లోని కెల్విన్ ఆసుపత్రిలో శ్రీకాంత్ ను జాయిన్ చేసుకున్న తరువాత గంటల పాటు వెయిట్ చేయించుకుని న్యూరో స్పెషలిస్టుచే కాకుండా ఎంబీబీఎస్ డాక్టర్ చే వైద్యం చేయించారని కూడా ఆరోపిస్తున్నారు. ఆ తరువాత హైదరాబాద్‌కు తీసుకెళ్తున్న క్రమంలో కామినేని ఆసుపత్రి నుండి నేరుగా శ్రీకాంత్ భార్యకు ఫోన్ రావడం విచిత్రంగా ఉంది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న  శ్రీకాంత్‌ను కాపాడుకునేందుకు వారి కుటుంబ సభ్యులు ఏ ఆసుపత్రికి తీసుకెళ్లాలో నిర్ణయించుకునే పరిస్థితి లేరన్న విషయం గమనించి కామినేని ఆసుపత్రి మేనేజ్ మెంట్ కు సమాచారం చేరవేసింది ఎవరన్నదే అంతుచిక్కకుండా పోతోంది. ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తామని కూడా కామినేని ఆసుపత్రి నుండి ఫోన్ చేసిన వారు చెప్పారని కూడా వివరించారు.

శెట్ పల్లికి గ్రామానికి చెందిన శ్రీకాంత్ కుటుంబ సభ్యులు

భారీ నెట్ వర్క్..?

మంచిర్యాలలో తాజాగా జరిగిన ఈ ఘటనలో శ్రీకాంత్ పరిస్థితి మరీ దారుణంగా ఉందని రెండు రోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు అతని ఆర్గాన్స్ డొనేట్  చేయాలని సలహా కూడా ఇచ్చారు. ఆ తరువాత శ్రీకాంత్ కు సంబంధించిన ఆర్గాన్స్ తీసుకున్న ఆసుపత్రి ప్రతినిధులు రూ. 3 లక్షలు ఇచ్చారని స్వప్న వివరించారు. అయితే ఇక్కడ కీలకంగా చోటు చేసుకున్న పరిణామాలపై వైద్య ఆరోగ్య శాఖ, ప్రభుత్వంలోని పెద్దలు ప్రత్యేకంగా విచారించాల్సిన అవసరం ఉంది. అద్దె తీసుకుంటూ పేషెంట్లను గమ్యస్థానాలకు చేర్చాల్సిన అంబూలెన్స్ డ్రైవర్లే ఫలానా ఆసుపత్రికి వెళ్లాలని చెప్పడానికి కారణం ఏంటి..?  పేషెంట్‌కు కావాల్సిన స్పెషలిస్టు ఆసుపత్రిలో వైద్యం అందించే అవకాశం ఉన్నా బాధిత కుటుంబాన్ని మిస్ గైడ్ చేయడానికి కారణం ఏంటన్న విషయంపై ఆరా తీయాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు వీరికి కమీషన్లు ఎరగా వేయడం వల్లే పేషెంట్లను మిస్ గైడ్ చేస్తున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మరో వైపున ఆయా ఆసుపత్రుల మేనేజ్‌మెంట్ మెంట్ కూడా వీరిని ఆశ్రయించి తమ ఆసుపత్రికి పేషెంట్లను రప్పించుకునే ప్రయత్నం చేయడం వెనక దాగి ఉన్న మరో రహస్యాన్ని భగ్నం చేయాల్సిన అవసరం కూడా ఉంది.

అవయవ దానం…

అయితే తాజాగా జైపూర్ మండలం శెట్ పల్లికి చెందిన శ్రీకాంత్ విషయంలో మరో కొత్తకోణం కూడా వెలుగులోకి వచ్చింది. బ్రెయిన్ డెడ్ అయిన శ్రీకాంత్ ఆర్గాన్స్ డొనెట్ కోసం అతని కుటుంబ సభ్యులు సుముఖత వ్యక్తం చేసిన వెంటనే అంబులెన్స్ వాలాలు అతనికి నివాళులు అర్పిస్తూ వాట్సప్ స్టేటస్ కూడా పెట్టుకున్నారని స్వప్న ఆరోపిస్తోంది. బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ ఆర్గాన్స్ డొనెట్ చేస్తామని అతని కుటుంబ సభ్యులు చెప్పగానే అంబులెన్స్ వాలాలు ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించారనే ప్రశ్న తలెత్తుతోంది. బాధిత కుటుంబం చెప్పిన విషయాలను. పరిశీలించినట్టయితే ఓ భారీ స్థాయి నెట్ వర్క్  మానిటరింగ్ అవుతుందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page