రేవంత్ విషయంలో లైన్ క్లియర్…
పొర్టుపోలియోలే అసలు సమస్య
దిశ దశ, హైదరాబాద్:
రాష్ట్రంలో కొలువు తీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో అసలేం జరుగుతోంది..? పార్టీలో అంతర్గతంగా నెలకొన్న పరిణామాలు ఏంటీ అన్నదే ఇప్పుడు అంతా హాట్ టాపిక్ గా మారింది. దశాబ్ద కాలానికి అధికారంలోకి వచ్చినప్పటికీ ఎమ్మెల్యేలు తమతమ డిమాండ్లకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్న ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. అంతేకాకుండా క్యాబినెట్ కూర్పు జరిగిన తరువాతే ప్రమాణ స్వీకారం జరపాలన్న ఆదేశాలు అధిష్టానం నుండి రావడంతోనే గురువారం నాటికి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. సీఎల్పీ భేటీలో నేత విషయంలో రేవంత్ రెడ్డికి అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ స్పీకర్ పదవి ఎవరికి కట్టబెటాలోనన్న విషయంతో పాటు డిప్యూటీ సీఎం విషయంలో వచ్చిన అభ్యంతరాలను కూడా రెండు రోజుల్లో సర్దుబాటు చేయాలని ఏఐసీసీ పెద్దలు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అయితే స్పీకర్ పదవి విషయంలో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకరికి కట్టబెట్టాలన్న ప్రతిపాదన అదిష్టానం నుండి రాగానే ఆ ఇద్దరు కూడా తమకు క్యాబినెట్ లోనే అవకాశం ఇవ్వాలన్నట్టుగా తెలుస్తోంది. దీంతో స్పీకర్ గా ఎవరిని పెడితే బావుంటుంది అన్న అంశంపై చర్చలు సాగుతున్నాయి. అలాగే తమకు కెటాయించే శాఖలు ప్రాధాన్యత ఉన్నవే ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్నట్టుగా సమాచారం. దీంతో ఎవరికి ఏఏ పోర్టుపోలియోలు అలాట్ చేయాలన్న అంశం కూడా ఏఐసీసీ ముఖ్య నాయకులే తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మరోవైపున డిప్యూటీ సీఎం పదవిలో ఒక్కరే ఉండాలని ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని కూడా తేల్చి చెప్పనట్టుగా సమాచారం అంతేకాకుండా డిప్యూటీ సీఎంగా తాను బాధ్యతలు తీసుకోవలంటే కీలకమైన శాఖలు తనకు అప్పగించాలన్న ప్రతిపాదనను అధిష్టానం ముందు ఉంచినట్టుగా సమాచారం. దీంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డికె శివ కుమార్ ఎమ్మెల్యేల అభిప్రాయాలన్నింటిని క్రోడీకరించి ఏఐసీసీ ముఖ్య నేతలకు వివరించేందుకు ఢిల్లీకి బయలుదేరారు. ఏఐసీసీ ముఖ్య నేతలు ఫైనల్ చేసిన జాబితాను డికె శివకుమార్ తిరిగి తీసుకొచ్చిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరనుంది.
ముహూర్త బలం…
అయితే సోమవారం బాధ్యతలు తీసుకునేందుకు సప్తమి మంచి రోజు కావడంతో డిప్యూటీ సీఎంతో పాటు మరో ఇద్దరు ప్రమాణా స్వీకారం చేయాలని భావించినప్పటికీ క్యాబినెట్ కూర్పు విషయంలో కొలిక్కివచ్చిన తరువాత ఒకేసారి ప్రమాణ స్వీకారోత్సవం చేస్తే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో మంగళ, బుధవారాలు అష్టమి, నవమి అవుతుండడంతో గురువారం దశమి రోజున కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీంతో తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు గురువారం వరకు వాయిదా పడినట్టేనని స్పష్టం అవుతోంది.