వ్యూహంలో భాగమా..?
దిశ దశ, హుజురాబాద్:
ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెల్చిన ఆయన ఇటీవల మౌనమే నా భాష అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో క్రీయాశీలక నేతల్లో ఒకరైన ఆయన పిన్ డ్రాప్ సైల్ంట్ అన్నట్టుగా ఎందుకుంటున్నారు..? సొంత నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి వెల్తున్న ఆయన వ్యూహం వెనక ఉన్న కారణం ఏంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది.
ఈటలా… ఏమిటిలా…?
హుజురాబాద్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈటల రాజేందర్ ఇటీవల కాలంలో మౌనంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఏకి పారేసే ఈటల సడన్ గా సైలెంట్ అయ్యారెందుకోనన్నదే అంతుచిక్కకుండా పోయింది. స్టేట్ పాలిటిక్స్ తో పాటు తన సొంత సెగ్మెంట్ లో యాక్టివ్ గా ఉండే ఆయన కొద్ది రోజులుగా అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎందుకిలా వ్యవహరిస్తున్నారు అన్న విషయం అటు అనుచరులకు అంతు చిక్కక ఇటు పార్టీ వర్గాలకు అర్థం కాక అయోమయం నెలకొందనే చెప్పాలి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టుండి ఈటలను పొగడ్తలతో ముంచెత్తిన తరువాత ఈటల పుర్వాశ్రమానికి చేరుకుంటారన్న ప్రచారం జరిగినప్పటికీ ఆయన మాత్రం ససేమిరా అన్నారు. ఆ తరువాత నుండి మౌనంగా ఉండడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న రాజేందర్ ఎందుకిలా తన స్టాండ్ మార్చుకున్నారోనన్నదే చర్చకు దారి తీస్తోంది. బీజేపీ ముఖ్య నాయకులతో ఎప్పుడూ టచ్ లో ఉండే ఈటల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో దిట్ట అని చెప్పక తప్పదు. విధానపరమైన నిర్ణయాల్లో లోపాలను ఎత్తి చూపుతూ రాజేందర్ తెలంగాణ సర్కార్ ను నిలదీస్తారు. అయితే సొంత నియోజకవర్గంలో మాత్రం ఆయన నోట విమర్శల ఝడివాన కురవకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఆ విషయంలోనూ…
రాజేందర్ తన ఇలాకా విషయంలో కూడా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కురిసిన వడగండ్ల వాన బీభత్సం కారణంగా పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో రాజేందర్ పర్యటించారు. పంట నష్టంపై ఆరా తీసిన ఈటల మీడియాతో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. అంతేకాకుండా మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ ప్రాధాన్యం తన సొంత నియోజకవర్గానికి ఇచ్చే వారు. కానీ ఇటీవల హుజురాబాద్ కు అడపాదడపా వచ్చి వెల్తున్నారు కానీ గతంలో వ్యవహరించిన తీరును కనబర్చడం లేదు. దీంతో రాజేందర్ వ్యవహారం శైలి ఎందుకిలా మార్చుకున్నారు అన్నదే హాట్ టాపిక్ గా మారింది.