బీజేపీలో మాజీ మంత్రి, హూజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాషాయ పార్టీలో చక్రం తిప్పుతారని అందరూ భావించినా.. అక్కడ ఆయన ఉక్కబోతను ఎదుర్కొంటున్నారు. జాతీయ పార్టీ కావడం, బీజేపీలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి సీనియర్ నేతలు ఉండటంతో.. ఈటలకు అంత ప్రాధాన్యత దక్కడం లేదు. బీజేపీలో ఎప్పటినుంచో ఉన్న సీనియర్ల హవానే నడుస్తోంది. కొత్తగా వచ్చిన ఈటల అక్కడ ఇమడలేకపోతున్నారు. పార్టీలో ఆయనకు ఇటీవల బాగా ప్రాధాన్యత దక్కింది.
కేసీఆర్‌ను ఎదిరించి హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలవడంతో… బీజేపీలో ఆయన ప్రాధాన్యం ఒక్కసారిగా పెరిగింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థి ఆయనేనని ప్రచారం జరుగుతోంది. పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఈటల కలిశారు. దీంతో త్వరలో బీజేపీలో ఆయనకు కీలక పదవి ఏదైనా ఇస్తారేమోనని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో గత కొంతకాలంగా బీజేపీలో కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. చేరికల కమిటీ ఛైర్మన్ గా ఆయనను నియమించడం వల్ల పార్టీలో కొంతమందిని చేర్చారు.
కానీ బీజేపీలో కొంతమంది కోవర్టులు పార్టీలో చేరే నేతల పేర్లను కేసీఆర్ కు లీక్ చేస్తున్నారని, అందుకే పార్టీలో చేరడం లేదని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యల వెనుక మరో కారణం ఉందని వార్తలొస్తున్నాయి. ఈటల పార్టీ మారతారని, కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది.అందుకే బీజేపీలో ఎవరూ చేరడం లేదనే వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. బీజేపీలోని కొంతమంది నేతలతో ఈటలకు విబేధాలు ఉన్నాయని, ఈటలను ఎదగనివ్వకుండా చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
కానీ తాను మాత్రం బీజేపీని వదిలే ప్రసక్తే లేదని ఈటల చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలు తనపై సానుభూతి చూపించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. తాను కాంగ్రెస్ లో చేరే అవకావం లేదని ఈటల చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం బీజేపీలో ఈటల ఉత్కబోతను ఎదుర్కొంటున్నారు.