నినాదాలకు దగ్గరగా… ఆచరణకు దూరంగా… యువత భవితపై నిర్లక్ష్యమేలా..?

దిశ దశ, హైదరాబాద్:

యువకులు దేశానికి  పట్టుగొమ్మలు… యువతతోనే మనుగడ సాధ్యం… అంటూ ప్రసంగాలు చేసే పాలకులు వారిని పట్టించుకోవడం లేదు. యువతను ఆకట్టుకునేందుకు చేస్తున్న ప్రకటనలకు ఆ తర్వాత   వ్యవహరిస్తున్న తీరుకు పొంతన లేకుండా పోతోంది. యువకుల కేంద్రీకృతంగానే సమీకరణాలు చేస్తున్న రాజకీయ పార్టీలు వారిపై చూపుతున్న శ్రద్ద చేతల్లో కానరావడం లేదు.

విధానమేది..?

స్వరాష్ట్ర కల సాకారం కోసం చదువులు మానేసి ఉద్యమంలో కీలక భూమిక పోషించింది యువతే. తమతో పాటు భావితరాల భవిష్యత్తు బాగుపడాలంటే తెలంగాణ ఆవిర్భవమే పెద్ద దిక్కని గుర్తించిన ఆ నాటి యువకులు రోడ్లెక్కి ఆందోళనలు చేసి అరెస్ట్ అయ్యారు. కేసుల పాలైనా సరే… మా భవిష్యత్తు నాశనం అయినా సరే… భావి తరాలు బాగుపడ్తాయన్న కలలు కని ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే స్వరాష్ట్ర ఏర్పడి… స్వ పరిపాలన మొదలై దశాబ్దం కావస్తున్న యువత సంక్షేమాన్ని పట్టించుకునే విషయంలో పాలకులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. కేవలం ఓటు బ్యాంకు కోసం యువతను వాడుకుంటున్నారే తప్ప వారి సంక్షేమం కో్సం విధి విధానలను అమలు చేసే విషయాన్ని విస్మరిస్తున్నారు. నూతన యువజన విధానాన్ని అమలు చేయకపోవడమే ఇందుకు ప్రత్యక్ష్య ఉదాహారణగా చెప్పవచ్చు. యువకులను అన్నింటా ప్రొత్సహించేందుకు యత్ పాలసీని అమలు చేయడంతో పాటు ప్రత్యేకంగా కార్పోరేషన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన మాత్రం తెరపైకి రావడం లేదు. కులాల వారిగా, వర్గాల వారిగా కార్పోరేషన్లు ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకుంటున్న ప్రభుత్వం యువత భవిత కోసం మాత్రం ఆ దిశగా అడుగులు వేయకపోవడం విస్మయపరుస్తోంది. జనాభాలో 35 శాతం మంది ఉన్న యువకులకు సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఉమ్మడి రాష్ట్రంలో యువజన సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించడం, ప్రత్యేకంగా కమిషనర్లను ఏర్పాటు చేసినప్పటికీ స్వరాష్ట్ర సిద్దించిన తరువాత అలాంటి చర్యలు మాత్రం తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రత్యేకంగా యువజన విధానాన్ని రూపొందించేందుకు 2016 ఫిబ్రవరిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం అయింది. కానీ ఇంత వరకు యువజన విధానం ఏర్పాటు చేయకపోవడం విడ్డూరం. కొత్తగా ఏర్పాటయిన కాంగ్రెస్ ప్రభుత్వం యువజన విధానంపై ఓ నిర్ణయం తీసుకున్నట్టయితే రాష్ట్రంలోని యువతరాన్ని అన్నింటా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల గ్రామీణ స్థాయి నుండి పట్టణ ప్రాంతాల వరకు కూడా యువత ప్రభుత్వానికి చేదోడుగా నిలిచే అకవాశం కూడా ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వ పథకాలపై కూడా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించేందుకు మార్గం సుగమం కానుంది. యువతరాన్ని ప్రోత్సహిస్తూ వారిని సద్వినియోగం చేసుకున్నట్టయితే ప్రభుత్వానికి అన్నింటా లాభదాయకమేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అత్యున్నత సేవలందించి అవార్డులు అందుకున్న వారి భాగస్వామ్యంతో నూతన యువజన పాలసీని తయారు చేసి అమలు చేసినట్టయితే బావుంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు స్పోర్ట్స్ , యూత్ వింగ్ వ్యవహారాలను ఒకే గొడుగు కిందకు చేర్చడం వల్ల కూడా యువత భాగస్వామ్యానికి వినియోగించుకోలేకపోతున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి. యువజన సర్వీసులకు సంబంధించిన వ్యవహారాలను చక్కబెట్టేందుకు ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తే లక్ష్యం నీరుగారదని యువతరం అంటోంది.

You cannot copy content of this page