తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైఫల్యంపై జరుగుతున్న ట్రోల్స్… సెటైరికల్ పోస్టుల పరంపర అంతా ఇంతాకాదు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన తీరుపై ఏకిపారేస్తున్నారు బాధితులు. తాజాగా హైదరాబాద్ టీఎస్పీఎస్సీ ఆఫీసు సమీమంలోనే వెలిసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని పరీక్షలు రద్దు చేసి టీఎస్పీఎస్సీ కమిటీని మాత్రం అలాగే కొనసాగిస్తోందని అందులో ముద్రించారు. నాంపల్లి టీఎస్పీఎస్సీ కార్యాలయం సమీపంలో వెలిసిన ఈ ఫ్లెక్సీల్లో టీఎస్పీఎస్సీ జిరాక్స్ సెంటర్ ఇచ్చట అన్ని రకముల ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశ పత్రములు లభించును అని రాసిన వాల్ పోస్టర్లు ప్రత్యక్ష్యం కావడం గమనార్హం. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత రాక రాక వచ్చిన జాబ్ నోటీఫికేషన్ తో ఉద్యోగం పొంది తీపి కబురు అందుకుంటామని కలలు కంటే లీకేజీ ఘనులు చేసిన తీరు మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లేసింది. ఎంతో కష్టపడి డిగ్రీలు పొందినా పొట్ట నింపుకోవడం కోసం ఇంతకాలం వారు పడ్డ కష్టాలు అన్ని ఇన్నీ కావు. కుటుంబానికి భారమై కొందరు, కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యతలు తమ భుజస్కందాలపై వేసుకుని మరికొందరు ఉన్నత చదువులు చదివినా కొలువులు వచ్చే పరిస్థితి లేక నరకయాతన పడ్డారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నియామకాల జాతర ప్రారంభించడంతో ఎదో ఒక ఉద్యోగం పొందాలని ఆశించిన నిరుద్యోగులకు లీకేజీ వ్యవహారం ఆశనిపాతంగా మారిపోయింది. దీంతో తిరిగి ఉద్యోగం కోసం ఎంత కష్టపడాలి ఎలా ప్రిపేర్ కావాలి అన్న ఆందోళనతో నిరుద్యోగులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పేపర్ లీకేజీకి కారకులైన వారి దుర్మార్గపు ఆలోచనల వల్ల అన్నెం పున్నెం ఎరగని తమ జీవితాలతో చెలగాటమాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నాంపల్లి టీఎస్పీపీఎస్సీ సమీపంలో వెలిసిన ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు కూడా నిరుద్యోగుల ఆక్రోషాన్ని ప్రదర్శిస్తున్నాయి.