అరన్‌పూర్ అప్పుడేం జరిగింది..?
దిశ దశ, దండకారణ్యం:
చత్తీస్ గడ్ అటవీ ప్రాంతంలో మందుపాతరకు ఎప్పుడు జరిగింది…? పేల్చివేత తరువాత బలగాలు ఏం చేశాయి..? ప్రాథమికంగా పోలీసులు నిర్దారణకు వచ్చిన అంశాలివే… బుధవారం రాత్రి అరన్‌పూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు షెల్టర్ తీసుకుని ఉన్నారన్న సమాచారం అందడంతో డీఈర్జీ, సీఏఎఫ్ క్యాంప్ నకు చెందిన బలగాలు జాయింట్ ఆఫరేషన్ కు శ్రీకారం చుట్టాయి. 26వ తేది బుధవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఘటన జరిగినట్టుగా చత్తీస్ గడ్ పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. అరన్‌పూర్ కు 2 కిలోమీటర్ల ఉన్న ఈస్ట్ పెడ్కా చౌక్ వద్ద డీఆర్జీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చేశారు. ఈ ఘటనలో 10 మంది జవాన్లు, ఒక డ్రైవర్ చనిపోయాడు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన తరువాత చత్తీస్ గడ్ పోలీసులు వెల్లడించిన వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి. అరన్‌పూర్ అటవీ ప్రాంతంలోని రహదారుల్లో నిత్యం బలగాలు డీ మైనింగ్ చేస్తున్నాప్పటికీ గురువారం పేల్చిన మందుపాతరలను గుర్తించలేకపోయాయని పోలీసు అధికారులు నిర్దారించారు. దీనిని బట్టి ఈ మందుపాతర భూమికి మరింత లోతున ఉండడమే కారణమని తెలుస్తోంది. ఫ్యాక్స్ హోల్ మెకానిజం ద్వారా మందుపాతర అమర్చి ఉంటారని, దీనికి అనుగుణంగా కందకం తవ్వి అందులోంచి బ్లాస్టింగ్ మెటిరియల్ రోడ్డుకు కింది భాగంలో మావోయిస్టులు అమర్చి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనికి లింక్ చేసిన వైర్ ను భూమికి 2 నుండి 3 ఇంచుల లోతున ఉంచి 150 మీటర్ల దూరం నుండి పేల్చివేతకు పాల్పడినట్టు భావిస్తున్నారు. అయితే ఘటనపై లోతుగా అధ్యయనం చేసేందుకు చత్తీస్ గడ్ పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటి వరకు మాత్రం తాజాగా పేల్చిన ఈ మందుపాతరను 45 రోజుల నుండి 60 రోజుల క్రితం అమర్చి ఉంటారని అంచనా వేస్తున్నారు.
ఉపా యాక్టుపై కేసులు..
ఈ ఘటనపై అరన్‌పూర్, భద్వీ పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 147, 148, 149, 307, 25, 27 ఆయుధాల చట్టం 13(1), 38(2), 39(2),UAPA యాక్టు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైం నెంబర్ 4/2023లో మావోయిస్టు పార్టీకి చెందిన దర్బా డివిజన్ కమిటీ ప్రతినిధులు జగదీష్, లఖే, లింగే, సోమడు, మహేష్, హిడ్మా, ఉమేష్, దేవే, నంద్ కుమార్, లఖ్మాచ, కోసా, ముఖేష్ తదితరులపై కేసు నమోదు చేశారు. 5/2023 క్రైం నెంబర్ సెక్షన్ 147, 148, 149, 307, 302, ఉపా యాక్టు 25,27, ఆయుథ వినియోగ చట్టం 13(1), 38(2), 39(2)లలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్బా డివిజన్‌కు చెందిన చైతు, దేవా, మంగతు, రాంసాయి, జైలాల్, బమన్ లతో పాటు మరికొంతమంది పేర్లను చేర్చారు.
ఎదురు కాల్పులు…
మందుపాతర పేల్చివేసిన తరువాత కొద్ది సేపు ఎదురు కాల్పులు కూడా జరిగాయి. కాల్పుల అనంతరం ఘటన స్థలంలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించగా సుక్మా జిల్లా జాగర్గుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాకిన్ పొరొక్కడికి చెందిన కోసా, లఖ్మా కవాసిలను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు కూడా మావోయిస్టు మిలిషియా సభ్యులుగా గుర్తించగా కోసా అలియాస్ సన్నా తొడ, మోచేతికి కాల్పుల గాయాలు అయ్యాయి. ఇతనికి చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించారు. నక్సల్స్ సాహిత్యం, నిత్వసర వస్తువులు, ఇతరాత్ర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పీఎల్జీఏ పనే: దర్భా ఏరియా కమిటీ
అయితే అరన్‌పూర్ ఘటనకు పాల్పడింది మాత్రం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీయేనని దర్భా ఏరియా కమిటీ కార్యదర్శి సాయినాథ్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ దాడికి అరన్‌పూర్ దాడి సమాధానం చెప్పిందన్నారు.
కావాలనే లీక్ చేశారా..?
ఏడాదిన్నర క్రితం కూడా బస్తర్ అటవీ ప్రాంతంలోని తెర్రం, జీనాగూడలో కూంబింగ్ బలగాలను మట్టుపెట్టేందుకు వ్యూహాత్మకంగా మావోయిస్టులు వ్యవహరించారు. కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నబలగాలే లక్ష్యంగా పార్టీ మిలటరీ కమాండర్ హిడ్మా సొంత గ్రామంలో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసుల చుట్టూ ఉచ్చు బిగించి ముప్పేట దాడికి పాల్పడగా భారీగా బలగాలు ప్రాణాలు కోల్పోయాయి. ఆ తరువాత జరిగిన భారీ నష్టం గురువారం ఉద్యం పెడ్కా ఏరియాలో జరిగిన మందుపాతర వల్లే కావడం గమనార్హం. ఈ ఘటనకు ముందు మావోయిస్టులే తమ ఉనికిని లీక్ చేసి ఉన్నట్టుగా ఘటనను బట్టి స్పష్టమవుతోంది. తమ కదలికల గురించి సమాచారం లీక్ చేస్తే తామంతా సేఫ్ జోన్ లో ఉండి బలగాలను మట్టుబెట్టే అవకాశం ఉంటుందని భావించి కావాలనే లీక్ చేసి ఉంటుందన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ సమచారం అందుకున్న బలగాలు హుటాహుటిన అటవీ ప్రాంతానికి చేరుకునేందుకు వాహనాల్లో వస్తారని వాటిని మందుపాతరలతో పేల్చి ఆధిపత్యం చెలాయించవచ్చన్న అంచనాతోనే ఈ వ్యూహానికి ఒడిగట్టి ఉంటుందని అనుమానిస్తున్నారు.