వేములవాడ ప్లాట్ల వెనక అసలేం జరిగింది…?
దిశ దశ, వేములవాడ:
వేములవాడ మండల కేంద్రంలో జర్నలిస్టులకు కెటాయించిన ప్లాట్ల వెనక అసలేం జరిగింది..? మొదట కెటాయించిన జాబితాతో సంబంధం లేకుండా కొత్త పేర్లు ఎలా చేరాయి..? స్థానిక జర్నలిస్టులతో సంబంధం లేకుండా ప్లాట్లు ఎలా అలాట్ చేశారు..? స్థానికంగా దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని విస్మరించి కేవలం నాలుగైదు నెలల పాటు పని చేసిన వారికి ప్లాట్ కెటాయించడం వెనక ఉన్న మతలబు ఎంటీ..? ఇప్పుడిదే చర్చ రాష్ట్ర జర్నలిస్టు వర్గాల్లో సాగుతోంది.
పట్టా ఎలా…?
2018లో స్థానిక జర్నలిస్టులకు నివేశన స్థలాలు కెటాయించిన అధికారులు అప్పటి ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు బీపీఎల్ కోటాలో ఇవ్వాలని నిర్ణయించారు. దశాబ్దాలుగా జర్నలిస్టులుగా కొనసాగుతున్న వారి కుటుంబాలకు నిలువ నీడ దొరుకుంతుందన్న కారణంతో ఇందుకు ప్రతి ఒక్కరూ కూడా మద్దతు ఇచ్చారు. దీంతో జర్నలిస్టులకు కెటాయంచిన ఈ భూముల్లో 33వ నంబర్ ప్లాట్ ఎ వెంకటరమణ పేరిట కెటాయిస్తున్నట్టుగా పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో క్రైం రిపోర్టర్ గా పనిచేస్తున్న ఆసరి మహేష్ జిల్లా కేంద్రంలో తనకు కెటాయించిన ప్లాట్ నిరాకరించి తనకు వేములవాడలో ఇప్పించాలని అభ్యర్థించాడు. స్థానికుడు అయిన మహేష్ విషయంలో వేములవాడ జర్నలిస్టులు కూడా సానుకూలంగానే వ్యవహరించారు. అయితే మొదట అలాట్ చేసినప్పుడు మూడు ప్లాట్లు కెటాయించకుండా అప్పటి రెవెన్యూ అధికారులు వదిలేశారు. అందులో ప్లాట్ నంబర్ 1 కాగా ప్రస్తుతం ఈ ప్లాట్ అసరి మహేష్ పేరిట అలాట్ అయినట్టుగా ఉంది. అయితే ఇందులో 33వ ప్లాట్ ఎ వెకంటరమణకు కెటాయించే విషయంలో తమకు ఏ మాత్రం తెలియకుండానే జరిగిందని స్థానిక జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లోనే బదిలీ అయిన ఆర్డీఓ జారీ చేసినట్టుగా ఉన్న ఈ పట్టా పేపర్ పై సంతకం ఆయనే చేశారా లేక ఫోర్జరీ చేశారా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. జర్నలిస్టులకు వేములవాడలో ప్లాట్లు అలాట్ చేసిన తరువాత బదిలీ అయిన ఆర్డీఓ నిజంగానే పట్టాపై సంతకం చేసినట్టయితే ఆయన సొంత నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది. స్థానిక ప్రెస్ క్లబ్, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో సంబంధం లేకుండా స్థానికేతరులకు పట్టా ఇవ్వడం సరైంది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వెంకట రమణకు సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన అక్రిడేషన్ కార్డు ఉన్నప్పటికీ ప్లాట్ల కెటాయింపు సమయంలో ఆయన ఇతర జిల్లాలో పనిచేస్తున్నాడని అలాంటప్పుడు ఆయనకు ఎలా కెటాయిస్తారని స్థానిక జర్నలిస్టులు మండిపడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాక్షి పత్రిక యాజమాన్యం ట్రైనీ స్టాఫ్ రిపోర్టర్ ను నియమిచంగా ఆయన దాదాపు రెండేళ్ల కాలం పాటు పనిచేసినట్టుగా తెలుస్తోంది. అలాంటప్పుడు ఇతర జిల్లాలో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్ కు అక్రిడేషన్ కార్డును యథావిధిగా కొనసాగించడం కూడా సరైంది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో సంస్థ ప్రతినిధులు కూడా చొరవ తీసుకోకపోడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటన్నదే మిస్టరీగా మారింది.
విక్రయించవచ్చా..?
వేములవాడ జర్నలిస్టులకు కెటాయించిన ప్లాట్లలో నిబంధనలకు విరుద్దంగా క్రయవిక్రయాలు సాగుతున్నాయన్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. స్థానికేతర జర్నలిస్టుకు ప్లాట్ కెటాయించిన విషయం వెలుగులోకి రాగానే క్రయ విక్రయాల జరిగాయన్న విషయం బయటపడింది. జర్నలిస్టులకు కెటాయించిన ఈ ప్లాట్లలో ఇండ్లను నిర్మించుకోవల్సి ఉంటుంది తప్ప అమ్మకాలు జరపడం రెవెన్యూ నిబంధనలకు విరుద్దమేనని తెలుస్తోంది. నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లలో క్రయ విక్రయ ఒప్పంద నామ పత్రాలు రాయించుకుని సర్కారు దృష్టిలో పడకండా అసైన్ ల్యాండ్ లో పాగా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనివల్ల ప్రభుత్వం నివేశన స్థలాల కెటాయింపు వెనక ఆన్న ఆశయానికి తూట్లు పొడిచినట్టే అవుతుందని రెవెన్యూ అధికారవర్గాలు చెప్తున్నాయి. రెవెన్యూ నిబంధనల ప్రకారం నిరుపేదలకు కెటాయించిన భూములను అమ్మిన వారిపై కొనుగోలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. వేములవాడ జర్నలిస్టులకు ప్లాట్లు కెటాయించిన విషయంలో సమగ్ర విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, స్థానికేతర జర్నలిస్టులకు కూడా కెటాయించిన విషయాలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్ హౌజింగ్ సొసైటీ ద్వారా జర్నలిస్టులకు ప్లాట్లు కెటాయించినప్పుడే రిజిస్ట్రేషన్ డాక్యూమెంట్లలో 15 ఏళ్ల పాటు క్రయవిక్రయాలు జరపవద్దన్న కండిషన్ కూడా పెట్టారు. ప్రభుత్వానికి మార్కెట్ వాల్యూ చెల్లించిన భూములు విక్రయించవద్దన్న నిబంధనను అమలు చేసినప్పుడు నిరుపేదలకు ఇచ్చిన ప్లాట్ల విషయంలో క్రయివిక్రయాలు జరపకూడదన్న నిబంధన ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుందన్న విషయం కూడా గుర్తు పెట్టుకోవల్సిన అవసరం ఉంది.
ఒకే వ్యక్తికి…
2006లో కరీంనగర్ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీలో పలువురికి ప్లాట్లు కెటాయించారు. ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధరను చెల్లించిన జర్నలిస్టులకు సొసైటీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఈ ప్లాట్లలో ఎ వెంకట రమణకు కూడా అలాట్ అయిందన్నది బహిరంగ రహస్యమే. తిరిగి ఇదే వెంకట రమణకు 2018లో వేములవాడలో బీపీఎల్ కోటాలో ప్లాట్ ఎలా కెటాయించారన్నదే మిస్టరీగా మారింది. ప్రభుత్వం నుండి లాభోక్తుడిగా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడే ఉన్న వ్యక్తికి నూతన జిల్లాల ఆవిర్భావం తరువాత మరో జిల్లాలో ప్రభుత్వం నివేశన స్థలం కెటాయించడం నిబంధనల మేరకే సాగిందా లేదా అన్న విషయంపై కూడా రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.