విఫలం అయిందెక్కడా..? ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ ఓటమి తీరు…

దిశ దశ, కరీంనగర్:

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి ఓటమికి కారణమేంటీ..? చివరి క్షణం వరకూ ఉత్కంఠంగా సాగిన కౌంటింగ్ ప్రక్రియలో వెనకబడిపోవడం వల్లే ఈ ఓటమికి మూల కారణం అయింది. అయితే సుదీర్ఘంగా సాగిన ప్రచార పర్వంలో కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్ మెంట్ పై అంతగా దృష్టి సారించనట్టుగా స్పష్టం అవుతోంది. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఇలాకాలో అంచనాలకు మించి ఓట్లు పోల్ కాగా ఇదే పరిస్థితి ఇతర నియోజకవర్గాల్లో కనిపించలేదు.

వ్యతిరేకత నుండి…

అల్ఫోర్స్ విద్యా సంస్థలు నిర్వహిస్తున్న వి నరేందర్ రెడ్డి మొదట వ్యతిరేకతను చవి చూడాల్సి వచ్చింది. విద్యా సంస్థల్లో జాయిన్ అయిన వారి పట్ల ఆయన వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఒక దశలో నరేందర్ రెడ్డి ఘోరంగా ఓడిపోవడం ఖాయమన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో ఆయన పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా కొనసాగించారు. ఇదే సమయంలో ఆయనపై వ్యతిరేకత ప్రదర్శిస్తున్న శక్తులను కూడా తనకు అనుకూలంగా మల్చుకోవడంలో సఫలం అయ్యారు. అయినప్పటికీ ఆయనపై జరిగిన వ్యతిరేక ప్రచారంతో పోటీ బీజేపీ, బీఎస్పీల మధ్యే ఉంటుందా అన్న చర్చ కూడా సాగింది. కానీ చివరి వారం రోజుల్లో నరేందర్ రెడ్డి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తన వ్యూహాలకు పదును పెట్టారు. తన విద్యా సంస్థల కోసం ఏర్పాటు చేసుకున్న నెట్ వర్క్ సాయంతో క్షేత్ర స్థాయిలో ప్రచారం కొనసాగించారు. ఎవరూ ఊహించని విధంగా నరేందర్ రెడ్డి ఓట్లను సాధించుకోవడంలో సఫలం అయ్యారనే చెప్పాలి. ప్రత్యర్థుల అంచనాలకు కూడా దొరకకుండా నరేందర్ రెడ్డి వేసిన ఎత్తులతో సానుకూల వాతావరణాన్ని తయారు చేసుకున్నారు. తమకు పోటీయే కాదని అనుకున్న ప్రత్యర్థులు కూడా నరేందర్ రెడ్డి సాధించుకున్న ఓట్లను గమనించి ఆయన వేసిే ఎత్తుల గురించి చర్చించుకున్నారంటే ఆయన ఎలా ముందుకు సాగారో అర్థం చేసుకోవచ్చు. విజయం బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని వరించినప్పటికీ రెండో స్థానంలో నరేందర్ రెడ్డి కొనసాగడం, తొలి రౌండ్ నుండి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకున్న తీరు చాలామందిని ఆశ్చర్యపరిచింది.

వైఫల్యం ఎక్కడా..?

గతంలో ఏనాడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రచారం కొనసాగించిన తీరు కొంతమేర ప్రతికూలతను తెచ్చిపెట్టిందన్నది వాస్తవం.ఒక వర్గం ఓటర్లు ఇంతా ఆర్భాటాలు చేస్తున్నారేంటీ అన్న అంశం గురించి చర్చలు జరిపారు. అయితే నియోజకవర్గ ఇంఛార్జీలు తమతమ ప్రాంతాల్లో ప్రచార పర్వాన్ని బలంగా కొనసాగించడంలో పూర్తి స్థాయిలో విఫలం అయ్యారన్న వాదనలు కూడా ఉన్నాయి. ఈ కారణంగానే 42 అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలో మెజార్టీ రాకపోవడానికి ప్రధాన కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్య నాయకులు మినహాయిస్తే చాలామంది నరేందర్ రెడ్డి గెలుపు బాధ్యతలను తమ భుజాలపై వేసుకోలేదన్న అభిప్రాయాలయితే వ్యక్తం అవుతున్నాయి. టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పార్టీ మెయిన్ క్యాడర్ క్రీయాశీలకంగా వ్యవహరిస్తే నరేందర్ రెడ్డి తొలి స్థానంలో నిలిచేవారు. చివరి సమయంలో ఇతర అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతున్న ఓటర్లను గుర్తించిన నరేందర్ రెడ్డి వారితో వ్యక్తిగత సమాలోచనలు జరిపారు. తొలి ప్రాధాన్యత కాకున్నా కనీసం రెండో ప్రాధాన్యత ఓటు అయినా వేయాలని ఆయన ప్రాంతాల వారిగా బాధ్యులను పంపించి వారిద్వారా చర్చలు చేయించారు. దీనివల్ల ఆయనకు కొంతమేర అనుకూలత వచ్చినప్పటికీ చాలా చోట్ల పార్టీ శ్రేణులు నిర్లక్ష్యం ప్రదర్శించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరో రెండు మూడు నియోజకవర్గాల్లో అయినా లీడ్ తీసుకొచ్చుకున్నట్టయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కాంగ్రెస్ పార్టీ చేతిలో సుస్థిరంగా ఉండేదని అంటున్న వారూ లేకపోలేదు. ప్రత్యక్ష్య రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని నరేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు లోటు పాట్లను గుర్తించి వాటిని సవరించుకున్నట్టుగా ఇతర ప్రాంతాల నాయకులు కూడా చొరవ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా గెలిచేవారేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. వివిధ ప్రొఫెషన్లలో స్థిరపడిన ఓటర్లలో వ్యతిరేకత ఉందన్న విషయాన్ని కూడా తెలుసుకున్న మంత్రులు కూడా ఆయా వర్గాల వారితో చర్చలు జరిపి సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో సఫలం అయ్యారు. ఇలాంటి వ్యూహాలే ఇతర ప్రాంత నాయకులు అమలు చేసినట్టయితే నరేందర్ రెడ్డి గెలుపు నల్లేరుపై నడకలా మారేదని ఫలితాల తీరు స్పష్టం చేస్తోంది.

You cannot copy content of this page