ఆరెపల్లి అలక…

అధిష్టానం పిలుస్తుందా..?

దిశ దశ, కరీంనగర్:

సీనియర్ నేత, న్యాయవాది ఆరెపల్లి మోహన్ అలక బూనారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం తెంచుకుని మరీ గులాభి జెండా నీడన చేరినప్పటికీ తనకు గుర్తింపు రావడం లేదని కలత చెందుతున్నారు. అధినేత కేసీఆర్ తనకు అవకాశం ఇస్తారా లేదా అన్న విషయంలో తర్జనభర్జన పడిపోతున్న ఆరెపల్లి మోహన్ వేరే దారి చూసుకుంటారా లేక… బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా అన్న చర్చ సాగుతోంది. తాజాగా ఆయన తన హితులతో ప్రత్యేకంగా సమావేశాలు జరుపుతూ భవిష్యత్ కార్యాచరణపై కసరత్తులు అయితే చేస్తున్నారు.

సీనియర్ కాంగ్రెస్ నేత…

మానకొండూరు సర్పంచ్ గా, న్యాయవాదిగా పనిచేస్తున్న ఆరెపల్లి మోహన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొట్టమొదటి ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షులుగా పనిచేశారు. జడ్పీ ఛైర్మన్ గా, ఎమ్మెల్యేగా కూడా పని చేసిన ఆయన రాజకీయాల్లోకి రాకముందు మూడు నాలుగు గెజిటెడ్ అధికారి గా నియామకం అయి వాటిని వదులుకున్నారు. ఆ కాలంలోనే ఉన్నత చదవులు చదివిన ఆయన ఎమ్మెల్యేగా చట్టసభలో ప్రాతినిథ్యం వహించాలన్న సంకల్పంతో ముందుకు సాగారు. ఈ క్రమంలోనే ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెస్సార్ ను పాలో అయ్యారు. ఇటీవల కాలం వరకూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన ఆరెపల్లి మోహన్ గులాభి కండువా కప్పుకుని తన తలరాతను మార్చుకోవాలని భావించారు. అయితే ఆరెపల్లి మోహన్ కు ఎలాంటి బాధ్యతలు కూడా అప్పగించకపోవడంతో పాటు తాజాగా అభ్యర్థుల ప్రకటనతో ఆరెపల్లి మోహన్ కినుక వహించారు. అధికార పార్టీలో చేరిన తరువాత కనీసం నామినెటెడ్ పదవి అయినా వస్తుందని ఆశించినప్పటికీ లాభం లేకపోవడంతో ఆయన వెయిట్ అండ్ సీ అన్న ధోరణితో ఉన్నారు. అయితే అటు ఆయన అభిమానులు కూడా కలిసినప్పుడు ఎదో ఒక నిర్ణయం తీసుకుంటే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పార్టీ వైపు అడుగులు వేస్తేనే మంచిదంటున్న వారే ఎక్కవ కావడంతో మోహన్ అడుగులు ఎటువైపు వేస్తారన్నదే చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటి వరకైతే తుది నిర్ణయం తీసుకోలేదు కానీ… ఆయన్ని అధిష్టానం పిలిపించి మాట్లాడితే నిర్ణయం మార్చుకునే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నవారూ లేకపోలేదు. ప్రత్యామ్నాయ పార్టీలోకి వెల్లినా టికెట్ పోటీ చేస్తే నియోజకవర్గంలో సానుకూలత ఉన్న దృష్ట్య ఫలితం అనుకూలంగా వస్తుందని ఆయన అనుచరులు చెప్తున్నట్టుగా సమాచారం. మానకొండూరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లోనూ వ్యక్తిగత పరిచయాలు ఉండడంతో పాటు అన్యాయం జరిగిందన్న సానుభూతి కూడా కలిసివస్తుందని ఆయన అనుచరులు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరినా కవ్వంపల్లి అభ్యర్థిత్వాన్ని కాదని ఆరెపల్లికి ఇస్తారా లేదా అన్న విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అలాగే ఇతర పార్టీల్లోకి వెల్తే ఎలా ఉంటుంది అన్న విషయంలోనూ సమాలోచనలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బరిలో నిలవాలన్న ఒత్తిళ్లయితే ఆరెపల్లి మోహన్ పై పడుతున్నట్టుగా స్పష్టం అవుతోంది.

ఏఐఎఫ్ బి ఆహ్వానం…

ఆరెపల్లి మోహన్ తమ పార్టీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం కరీంనగర్ లోని ఆరెపల్లి నివాసానికి వెళ్లిన ఆయన తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవాలని కూడా జోజిరెడ్డి కోరారు.

You cannot copy content of this page