బ్రేక్ చేస్తారా.. బ్రేక్ వేస్తారా..?

ఈటల భవితవ్యంపై సర్వత్రా చర్చ

దిశ దశ, హైదరాబాద్:

ఉద్యమ పార్టీ నుండి… జాతీయవాద పార్టీలోకి అడుగు పెట్టారాయన… ఉప ఎన్నికల్లో అధికారపక్షం అంతా ఒకటైనా ఆయనవైపే మొగ్గు చూపిందా సెగ్మెంట్… సాధారణ ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకమైన తీర్పు ఇవ్వడంతో జాతీయ రాజకీయాలవైపు దృష్టి సారించారు. ఇంతకాలం అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం అయిన ఆయన లోకసభ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. రెండు దశాబ్దాల రాజకీయాల్లో ఎన్నెన్నో మలుపులు తిరిగిన ఆయన భవితవ్యం ఎలా ఉండబోతున్నదన్న చర్చే సాగుతోంది.

ఉద్యమ పార్టీ నుండి…

హుజురాబాద్, కమలాపూర్ నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఈటల రాజేందర్ అసెంబ్లీలో పార్టీ నేతగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2021లో అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఉద్యమ పార్టీని వీడి జాతీయ వాద పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో అదినేత కేసీఆర్ ఎన్నెన్నో ఎత్తులు వేసి ఈటల ఓటమిని శాసించాలని ప్రయత్నించినా హుజురాబాద్ ప్రజలు మాత్రం ఆయన్ను అక్కున చేర్చుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా ఇక్కడే మకాం వేసిన ఈటల గెలుపును మాత్రం శాసించలేకపోయారు. హుజురాబాద్ ఉప ఎన్నికలు జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారి తీశాయంటే అప్పుడు ఎలాంటి వాతావరణం నెలకొందో ఊహించుకోవచ్చు.

జనరల్ ఎలక్షన్స్ …

అయితే ఈటల రాజేందర్ సాధరణ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చే సరికి తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఇంతకాలం ఆయన్ను అక్కున చేర్చుకున్న హుజురాబాద్ తో పాటు గజ్వేల్ నుండి కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం కూడా క్లియరెన్స్ ఇవ్వడంతో ఈటల రెండు సెగ్మెంట్లలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. గజ్వేల్ లో అధినేత కేసీఆర్ చేతిలో ఓటమి చవి చూడగా, సొంత నియోజకర్గం అయిన హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి గెలిచారు. దీంతో ఈ సారి ఈటల రాజేందర్ చట్టసభకు ప్రాతినిథ్యం వహించలేకుండా పోయింది. ఈటల ఓటమిపై జరుగుతున్న విశ్లేషణలు ఎలా ఉన్నా… ఆయన ప్రజాక్షేత్రంలో మరోసారి తన భవితవ్యాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇందుకు పార్టీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈటల రాజేందర్ మల్కాజ్ గిరి నుండి ఎంపీగా పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.

సెంటిమెంట్ ఇలా…

హుజురాబాద్, కమలాపూర్ ల నుండి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన నాయకులు అప్రతిహతమైన చరిత్రను క్రియేట్ చేసుకున్నవారే. అయితే ఇక్కడి నుండి ఓడి గెలిచిన నాయకులు ఉన్నారు కానీ… గెలిచిన తరువాత ఓటమి పాలయిన వారు మాత్రం మరోసారి గెలిచిన రికార్డు అందుకోలేదు. ఎక్కువ మంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే ఉండడంతో ఈటల భవితవ్యం ఎలా ఉండబోతోందన్నదే చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి నుండి ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహించిన వారిలో వొడితెల బ్రదర్స్ మాత్రమే రాజ్యసభకు నామినేట్ అయ్యారు. కానీ ఇతర నాయకులు మాత్రం చట్ట సభల్లోకి తిరిగి అడుగుపెట్టలేకపోయారు. ఇప్పటి వరకు ఇక్కడి పరిస్థితులకు భిన్నంగా ఈటల రాజేందర్ లోకసభ ఎన్నికల బరిలో తన భవిష్యత్తును పరీక్షించుకోనున్నారు.

మిని భారత్…

వచ్చే లోక సభ ఎన్నికల్లో మిని భారత్ గా ముద్ర పడ్డ మల్కాజ్ గిరి లోకసభ నుండి పోటీ చేయబోతున్నారు. రాష్ట్రంలో 17 లోకసభ స్థానాలను గమనిస్తే మల్కాజ్ గిరి నియోజవర్గం వైవిద్యతను సంతరించుకుందని చెప్పకతప్పదు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన వారు ఈ ప్రాంతంలో నివసిస్తుంటారు. దీంతో ఇక్కడ జాతీయ రాజకీయాలు తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణ లోకసభ స్థానాలతో పోలిస్తే ఇక్కడ రెట్టింపు ఓటర్లు ఉంటారు. ఇతర లోకసభ నియోజకవర్గాల్లో 14 నుండి 16 లక్షల వరకు మాత్రమే ఓటర్లు తమ తీర్పు ఇవ్వాల్సి ఉండగా మల్కాజ్ గిరిలో మాత్రం 36 లక్షల మంది ఓటర్లను ప్రభావితం చేయాల్సి ఉంటుంది. దేశంలోనే అత్యంత ప్రత్యేకతలు ఉన్న వాటిల్లో ఒకటిగా చరిత్ర సృష్టించిన ఈ నియోజకవర్గం నుండి ఈటల బరిలో నిలుస్తుండడంతో ఆయన వ్యూహాలు… ఎత్తులు పై ఎత్తులు ఎలా ఉండనున్నాయి… ఇక్కడి ప్రజలు ఆయన్ను అక్కున చేర్చుకునే అవకాశం ఉందా…? హుజురాబాద్ సెంటిమెంట్ రికార్డ్ బ్రేక్ చేస్తారా లేక తన పొలిటికల్ లైఫ్ కు బ్రేకులు వేసుకుంటారా అన్న అంశాలపై చర్చ సాగుతోంది.

You cannot copy content of this page