అభ్యర్థుల ఖరారుకు పితృ పక్షాల ఎఫెక్ట్

దిశ దశ, న్యూ ఢిల్లీ:

రెండు జాతీయ పార్టీలను దుర్ముహూర్తం వెంటాడుతోంది. అభ్యర్థుల ఖరారు విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోకముందే నోటిఫికేషన్ వెలువడడంతో ఆ రెండు పార్టీలు అభ్యర్థుల జాబితా ఫైనల్ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉంటుందని భావించినప్పటికీ ముహూర్తం అనుకూలత లేకపోవడంతో మరో వారం రోజుల పాటు ఆగక తప్పని పరిస్థితి ఏర్పడింది.

పితురుల అమావాస్య ఎఫెక్ట్…

ఈ నెల 14న పితృ అమవాస్య ఉండడంతో అప్పటి వరకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో మరో వారం రోజుల పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్ధులను ప్రకటించే అవకాశం లేవని తేటతెల్లం అవుతోంది. ఈ అమవాస్యకు ముందు పితృ తర్పణాలు చేసే ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ సమయంలో శుభ కార్యాలను జరుపుకునే అవకాశాలు ఉండవు. దీంతో వచ్చే సోమవారం తరువాతే కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

అప్పుడే దరఖాస్తులు…

అయితే కాంగ్రెస్ పార్టీ రూ. 50 డిమాండ్ డ్రాఫ్ట్ తో పాటు తమ దరఖాస్తును అందించాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు 119 నియోజకవర్గాల్లోని అశావాహులు తమతమ దరఖాస్తులు చేసుకున్నారు. బీజేపీ కూడా టికెట్లు ఆశిస్తున్న నాయకులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించడంతో ఆ పార్టీ నాయకులు కూడా ఈ మేరకు అప్లికేషన్లను సమర్పించారు. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచూతూచి అడుగు వేస్తుండడంతో రెండు పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంతవరకు పూర్తి కాలేదు. కులాలు, మతాల సమీకరణాల వారిగా జాబితాను తయారు చేసే ఆలోచనలో రెండు పార్టీల అధినాయకత్వం ఉన్నందునే ఆలస్యం జరిగినట్టుగా తెలుస్తోంది. తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయడంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీల అగ్రనేతలు జాబితా విడుదల చేసే పనిలో నిమగ్నం అయ్యాయి. ఈ రెండు పార్టీలు కూడా తొలి జాబితాను ఈ నెల 16 తరువాతే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది.

You cannot copy content of this page