మొక్కజొన్న కొనేదెప్పుడు…?

దళారుల ఇంట పంట

దిశ దశ, మానకొండూరు:

ఓ వైపున ప్రకృతి బీభత్సం మరో వైపున అధికారుల తాత్సర్యంతో మొక్క జొన్న రైతులు విలవిలలాడిపోతున్నారు. సర్కారు కొనుగోలు చేయాలని ఆదేశించినా ఆచరణలో పెట్టకపోవడంతో దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే వరి ధాన్యం వర్షార్పణం కావడంతో మొక్కజొన్న కూడా ఇదే పరిస్థితి తయారైతే ఎలా అన్న ఆందోళనతో రైతాంగం తక్కువ ధరకు దళారులకు అమ్ముకుంటున్నారు. లేనట్టయితే వాతావరణ ప్రభావంతో చేతికొచ్చిన మొక్కజొన్న కూడా నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు.

దళారుల ఇంట పంట…

రాష్ట్ర ప్రభుత్వం మే 1 నుండే రాష్ట్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. నేటికీ కూడా కొనుగోలు కేంద్రాలను స్టార్ట్ చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో వరసగా కురుస్తున్న వడగండ్ల వర్షంతో అల్లాడిపోతున్న నేపథ్యంలో ఎండిపోయిన మొక్కజొన్న కూడా నాశనం అవుతుందన్న ఆందోళన రైతాంగాన్ని వెంటాడుతోంది. దీంతో రైతులు తమ పంటను అమ్ముకునేందుకు మొగ్గు చూపుతున్నారు. రైతుల బలహీనత, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా దళారులు తమకు నచ్చిన ధరకు మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. క్వింటాలుకు రూ. 1650 నుండి రూ. 1750 చెల్లించి మొక్క జొన్న కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది దళారులు డబ్బులు వెంటనే చెల్లించమని తెగేసి చెప్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అయినప్పటికీ రైతులు దళారులకు మొక్కజొన్న అమ్మేందుకే మొగ్గు చూపుతున్నారు. లేనట్టయితే తమ పంట ప్రకృతి బీభత్సానికి మొత్తం నాశనం అవుతుందన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఈ కారణంగానే రైతులు తమ పంటలను అమ్ముకునేందుకు దళారులను ఆశ్రయిస్తున్నారని తెలుస్తోంది.

సర్కారు తీరిలా…

మొక్క జొన్న కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసి వారం రోజులు గడుస్తున్న కొనుగోలు కేంద్రాల ఊసే లేకుండా పోయింది. మద్దతు ధర మాత్రం రూ. 1962గా ప్రకటించినప్పటికీ మార్క్ ఫెడ్ మాత్రం కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో మొక్కజొన్న కోనుగోళ్లపై నీలి నీడలు అలుముకున్నాయి. శనివారం అధికారులు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకుని సోమవారం నుండి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. రైతుల వద్ద ఉన్న మొక్కజొన్న అంతా కూడా దళారులు గోదాముల్లోకి చేరిపోయిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం వల్ల ఎవరికి లాభం జరుగుతుందో అధికారులకే తెలియాలి. బినామీల పేరిట దళారులు ఈ కేంద్రాల్లో ఎంఎస్పీ ధరకు మొక్కజొన్న అమ్ముకుని సొమ్ముచేసుకునే అవకాశం ఉంది తప్ప నేరుగా రైతాంగానికి లాభం జరిగే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. రైతుల వద్ద ఉన్న దాదాపు 80 శాతం మొక్కజొన్న పంట అంతా కూడా దళారుల వద్దకు చేరుకున్న తరువాత కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడం విస్మయం కల్గిస్తోంది. దీనివల్ల క్వింటాలు మొక్కజొన్నకు రూ. 200 వరకు నష్టపోయారని తెలుస్తోంది. ఏది ఏమైనా అధికార యంత్రాంగం తీరుపై మాత్రం రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

You cannot copy content of this page