ఆ డీఎస్పీ ఎక్కడా..? సిరిసిల్లలో లేడా..?

దిశ దశ, హైదరాబాద్:

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాక్ష్యాలు తారుమారు చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ ప్రణిత్ రావు ఆచూకి కోసం హైదరాబాద్ సిటీ పోలీసులు రంగంలోకి దిగారు. ఆదివారం ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లలో కేసు నమోదు కాగా సోమవారం ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వర్టికల్ డీఎస్పీగా పోస్టింగులో ఉన్న ఆయన ఆ జిల్లాలో మాత్రం లేనట్టుగా తెలుస్తోంది.

సిరిసిల్లలో లేడా..?

ఎస్ఐబీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ ప్రణిత్ రావు ఎస్ఐబీ నుండి రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్టికల్ వింగ్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ బదిలీల తరువాత ఎస్ఐబీ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రణీత్ రావును సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు అనుమతి లేకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ దాటి వెల్లరాదని స్ఫస్టం చేశారు. అయితే ఆదివారం ప్రణిత్ రావుపై కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు సిరిసిల్లకు వెల్తున్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసు అధికారులకు అందిన ఓ సమాచారం బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బదిలీపై వచ్చిన ప్రణిత్ రావు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రిపోర్ట్ చేసిన తరువాత హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయాడని అప్పటి నుండి జిల్లా పోలీసు అధికారులకు టచ్ లో కూడా లేడన్న సమాచారం అందుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రణిత్ రావ్ ఎక్కడ ఉన్నాడన్న విషయంపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన కోసం సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసు బృందాలు కూడా గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇల్లు అద్దెకు..?

అయితే ప్రణిత్ రావు వర్టికల్ డీఎస్పీగా సిరిసిల్లలో లేడని అక్కడి పోలీసు అధికారులు కుండబద్దలు కొడుతుంటే… పట్టణంలో మరో అంశం వెలుగులోకి వచ్చింది. గతంలో పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో టౌన్ డీఎస్పీ అద్దెకు ఉండేవారని ఆ పోర్షన్ కు ప్రణిత్ రావు డీఎస్సీ అంటూ ఓ నేమ్ బోర్డు ఏర్పాటు చేసి ఉందని పట్టణమంతా ప్రచారం అయింది. బదిలీపై వచ్చిన అదికారి ఇక్కడ రిపోర్ట్ ఒక్క రోజులోనే తిరుగు ప్రయాణ: అయినట్టయితే ఇక్కడ అద్దె ఇల్లు తీసుకున్న విషయం ఎవరికీ తెలియకపోవడం విస్మయం కల్గిస్తోంది. అంతేకాకుండా ఆయన హెడ్ క్వార్టర్స్ దాటి పోవద్దని ఉన్నతాధికారులు స్ఫస్టంగా ఆదేశాలు ఇచ్చినప్పుడు జిల్లా పోలీసు అధికార యంత్రాంగానికి ఎలాంటి సమాచారం లేకుండానే ఇక్కడ నివాసం ఉంటున్నారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.

సస్పెన్షన్ ఆర్డర్స్ సర్వ్ అయ్యాయా..?

అయితే ప్రణీత్ రావును సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు ఆయనకు నేరుగా అందించారా పోస్టులో పంపించారా అన్న విషయం కూడా అంతుచిక్కకుండా పోతోంది. ఒకవేళ నేరుగా ప్రణిత్ రావుకు సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చినట్టయితే ఆయన ఎక్కడ ఉన్నాడన్న విషయంపై పోలీసు అధికారులకు క్లారిటీ ఉంటుంది. కానీ ఆయనను సోమవారం అరెస్ట్ చేసేందుకు సిరిసిల్లకు వెల్లాలని నిర్ణయించుకున్నారంటే ఆయన ఆచూకి గురించి పోలీసు అధికారులకు ఏమాత్రం తెలియలేదని స్ఫష్టం అవుతోంది. మరో వైపున ఆయనకు సస్పెన్షన్ ఆర్డర్స్ జారీ చేసిన తరువాత ఆయన గురించి పోలీసు ఆధికారులు కూడా తెలుసుకునేందుకు చొరవ చూపలేదా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది. ఆయన ఆఛూకి గురించి తెలిసినట్టయితే ప్రణిత్ రావును అరెస్ట్ చేసేందుకు పోలీసు బృందాలు నేరుగా అక్కడికే వెల్లే అవకాశం ఉంటుంది కానీ సిరిసిల్లకు వెల్లరన్నది వాస్తవం. అయితే సస్పెన్షన్ ఉత్తర్వులు ప్రణిత్ రావుకు అందినట్టయితే ఆయన అందులో పేర్కొన్న ఆదేశాలను అనుసరించి ఆయన సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీసు అధికారుల కనుసన్నల్లో ఉంటూ విధులు నిర్వర్తించే వారు. కానీ ప్రణిత్ రావు మాత్రం ఈ జిల్లా అధికారులకు ఏ మాత్రం టచ్ లో లేకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉండే అవకాశాలు లేవన్నది వాస్తవం. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారన్నదే మిస్టరీగా మారిపోయింది.

You cannot copy content of this page