ఇంటికి చేరలేదేమీ..?
దిశ దశ, హైదరాబాద్:
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పాత్ర, సూత్రధారి అయిన ఆ పోలీసు అధికారి సొంతింటికి వస్తారా… రారా..? ఈ కేసులో ఆయన పేరు వెలుగులోకి రాగానే వస్తున్నాడంటూ జరిగిన ప్రచారం అంతా వట్టిదేనా..? ఇంతకీ ఆయన ఎక్కడున్నారు..? అమెరికాలోనే ఉన్నారా మరో దేశానికి వెళ్లారా..? ఇప్పుడిదే చర్చ పోలీసు వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ప్రభాకర్ రావు కోసం…
ఎస్ఐబీ చీఫ్ గా వ్యవహరించిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇండియాకు ఎప్పుడొస్తారన్నదే అంతుచిక్కకుండాపోయింది. ఈ కేసులో అందుబాటులో ఉన్న పోలీసు అధికారులను విచారిస్తున్న ఇన్వెస్టిగేషన్ టీమ్ తమవంత భాగస్వామ్యం ఉన్నవారిని అరెస్ట్ చేస్తోంది. ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఒక్కొక్కరిని విచారిస్తున్న దర్యాప్తు బృందం ఆధారాల సేకరణలో నిమగ్నం అయింది. ఎస్ఐబీ, టాస్క్ ఫోర్స్, ఇంటలీజెన్స్ తదితర విబాగాల్లో పనిచేసిన వారిలో ట్యాపింగ్ కు సంబంధించి ఎవరెవరి ప్రమేయం ఉంది అన్న వివరాలు సేకరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల కన్ఫెషన్ రిపోర్ట్ లను గమనిస్తే అందరి వేళ్లూ రిటైర్డ్ ఆఫీసర్ ప్రభాకర్ రావు వైపే చూపిస్తున్నాయి. దీంతో ఆయనను అరెస్ట్ చేయడం ఖాయం అనుకున్నప్పటికీ ఆరోగ్య సమస్యల దృష్ట్యా ప్రభాకర్ రావు అమెరికా వెల్లినట్టుగా వెల్లడైంది. చికాగోలో ఉన్నట్టుగా కూడా గుర్తించినప్పటికీ ఆయన ఇండియాకు వస్తే మాత్రం వెంటనే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు. ఆయన కోసం లుక్ ఔట్ సర్క్యూలర్ (ఎల్ఓసీ) కూడా జారీ చేశారు. దీంతో ప్రభాకర్ రావు ఇండియాలో ఏ ఏయిర్ పోర్టులో దిగినా హైదరాబాద్ పోలీసులకు సమాచారం రానుంది. ఇదే క్రమంలో పోలీసు అధికారుల అరెస్టులో భాగంగా ప్రభాకర్ రావు ఇంట్లో కూడా సోదాలు చేశారు దర్యాప్తు అధికారులు.
వస్తాడని ప్రచారం…
ఎల్ఓసీ జారీ అయిన తరువాత ప్రభాకర్ రావు కూడా రాష్ట్రంలోని ఓ పోలీసు అధికారితో వాట్సప్ కాల్ మాట్లడినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఆయన చెప్పిన విషయాలన్ని కూడా అఫిషియల్ మెయిల్ ద్వారా పంపించాలని ఆ అధికారి సూచించినట్టు కూడా పోలీసు వర్గాల్లో చర్చ జరిగింది. ఆ తరువాత ప్రభాకర్ రావు ఇండియాకు నేడో రేపో వస్తున్నారని పుకార్లు షికార్లు చేశాయి. చికాగో నుండి ఇండియాకు వస్తారని భావించినప్పటికీ ఆయన మాత్రం ఇంటిముఖం వైపు రావడం లేదు. ప్రధానంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ప్రభాకర్ రావు ఆపరేషన్ కోసం అమెరికాకు వెళ్లానని పోలీసు అధికారులకు చెప్పినట్టు సమాచారం. అయితే ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత అమెరికా వెల్లారన్న ప్రచారం కూడా తప్పేనని అంతకుముందే ఆయన టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయి ఉందని విచారణలో తేలింది. అమెరికాకు టికెట్లు కూడా ఎన్నికలకు ముందే బుక్ చేసుకున్నారని గుర్తించారు పోలీసు అదికారులు. కూతురు వద్ద ఉన్న ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చి వాంగ్మూలం ఇస్తే తప్ప ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. దీంతో ఆయన రాకకోసం ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎదురు చూస్తోంది.
బెయిల్ కోసమా..?
తాజాగా మరో అంశంపై పోలీసు విభాగంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అనారోగ్య కారణాలతో పాటు వయోభారం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించేందుకు కసరత్తులు చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్న తరువాతే ఇంటికి చేరుకునే విధంగా ఆయన సన్నిహితులు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు కొందరు. మరోవైపున ఆయన అమెరికాలోని చికాగో నుండి ఇతర దేశానికి వెల్లిపోయినట్టుగా కూడా పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. చికిత్సలో భాగంగా వేరే దేశానికి వెళ్లారా లేకా మరేదైనా కారణమా అన్న విషయం తేలాల్సి ఉంది. కానీ ప్రభాకర్ రావు మాత్రం అమెరికాలోనే ఉన్నారని ఆపరేషన్ పూర్తయిన తరువాతే వస్తారని కూడా అంటున్నవారూ లేకపోలేదు. గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్ పోలీసు వర్గాల్లో జరుగుతున్న చర్చ మాత్రం ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. లేదంటే ఎల్ ఓసీ రద్దు కోసం కూడా కోర్టును ఆశ్రయిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రభాకర్ రావు విషయంపై స్ఫష్టత రావాలంటే మాత్రం ఆయన అత్యంత సన్నిహితుల నుండి రావల్సిందే తప్ప మరో దారి లేదు.