మామ్నూర్ బెటరా… రామగుండం బెటరా..?

ఎయిర్ పోర్టుల నిర్మాణంపై సరికొత్త చర్చ…

దిశ దశ, పాలకుర్తి:

తెలంగాణ ప్రజలకు గగన ప్రయాణం గగనంలానే మారిపోయింది. రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న హైదరాబాద్ మినహాయిస్తే ఎక్కడ కూడా ఎయిర్ పోర్టులు లేవు. నిజాం కాలంలో ఏర్పాటు చేసిన మామ్నూరు ఎయిర్ పోర్టు సేవలు అర్థాంతరంగా నిలిచిపోవడంతో గాలి మోటారు ఎక్కే భాగ్యం దక్కాలంటే భాగ్యనగరం వెళ్లాల్సిందే తప్ప మరో గత్యంతరం అయితే లేదు. ఉత్తర, దక్షిణ భారతానికి అనుసంధానం చేసే రైల్వే లైన్ ఉత్తర తెలంగాణ మీదుగా వెల్తున్నప్పటికీ విమానయాన సేవలు మాత్రం అందకుండా పోయాయి. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెల్లాలన్న, ఉన్నత చదువులు చదివేందుకు యూఎస్, యూకె, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లాలన్న శంషాబాద్ వెల్లాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా మామ్నూరు ఎయిర్ పోర్టుకు ట్రై పార్టీ అగ్రిమెంట్ సడలింపునకు క్లియరెన్స్ రావడంతో వరంగల్ లోని మామ్నూరు ఎయిర్ పోర్టు నిర్మాణానికి తొలి అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం, ఎయిర్ పోర్టు అథారిటీ, జీఎంఆర్ సంస్థ 5.2 క్లాజ్ సవరణకు ఓకే చెప్పడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 150 కిలో మీటర్ల లోపున ఉన్న మామ్నూరు విషయంలో భారీ ఊరట లభించినట్టయింది. అయితే ఇక్కడ భూసేకర అంశాలతో పాటు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఫిజుబులిటీ సర్టిఫికెట్ వంటి ఆంశాలు అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు పెద్ద మొత్తంలో కెటాయించడంతో పాటు ఇతరాత్ర సమస్యలను అధిగమించేందుకు ప్రత్యేకంగా కసరత్తులు చేయాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ తరువాత వరంగల్ నగరాన్నే అభివృద్ది చేయాలన్న సంకల్పంతో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతీయ కార్యాలయాలు కూడా వరంగల్ కేంద్రంగా నిర్వహించాయి అప్పటి ప్రభుత్వాలు. వరంగల్ నగరంపైనే ప్రత్యేక దృష్టి సారిస్తే అన్ని విధాలుగా సముచితం అన్న భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈ కారణంగానే మామ్నూరు ఎయిర్ పోర్టుకు క్లాజ్ సవరణ చేసే విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

బసంత్ నగర్ అయితే..?

అయితే పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రత్యేకంగా మినీ ఎయిర్ పోర్టును నిర్వహిస్తోంది. ఈ ఎయిర్ పోర్టు సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వచ్చినప్పుడు ఛాపర్ ల్యాండ్ అయ్యేందుకు ఉపయోగించుకునే వారు. ఈ ఎయిర్ పోర్టును అభివృద్ది చేసినట్టయితే అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని భావించారు అధికారులు. అయితే ఇక్కడ ఎయిర్ పోర్టు నిర్మాణంతో ఆటంకాలు ఉన్నాయని గుర్తించారు. బసంత్ నగర్ సమీపంలోనే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉండడం, ఈ ప్రాంతం మీదుగా హై టెన్షన్ వైర్లు వెల్తుండడంతో ఫ్లైట్స్ టేకాఫ్, టేకాన్ కు ఆటంకం ఏర్పడుతుందని తేల్చారు. ఉడాన్ స్కీంలో భాగంగా బసంత్ నగర్ ఎయిర్ పోర్టును తీర్చిదిద్దాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. హై టెన్షన్ వైర్లతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని గుర్తించిన అధికారులు వాటిని తొలగించే అవకాశం ఉంటుందా అన్న యోచన కూడా చేశారు. అప్పుడు ఎన్టీపీసీ యాజమాన్యం కూడా ఇందుకు సానుకూలంగానే స్పందించినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో భూ సేకరణకు అంతగా ఆర్థిక భారం పడే అవకాశాలు లేనప్పటికీ దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా చేసే విద్యుత్ సరఫరా చేస్తున్న హై టెన్షన్ వైర్లను తొలగించి వేరే ప్రాంతం మీదుగా లైన్ వేయాలంటే ఆర్థిక భారం కూడా బారీగానే పడుతుందని గుర్తించినట్టుగా తెలుస్తోంది. దీంతో బసంత్ నగర్ ఎయిర్ పోర్టు అంశంపై కేంద్రం ఆసక్తి చూపనట్టుగా సమాచారం.

మరో ప్రతిపాదన…

తాజాగా బసంత్ నగర్ ఎయిర్ పోర్టుకు ప్రత్యామ్నాయంగా రామగుండం పరిసర ప్రాంతంలో భూమి లభ్యం అయ్యే అవకాశం ఉందా అన్న అంశంపై ఆరా తీశారు అధికారులు. ఒకప్పుడు టెక్స్ టైల్స్ రంగానికి ఊతమిచ్చిన అంతర్గాం పరిశ్రమకు సంబంధించిన భూములు ఉన్నాయని గుర్తించి ఈ మేరకు సర్వే కూడా జరిపారు. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉన్నతాధికారులు అడిగిన వెంటనే అంతర్గాం భూములకు సంబంధించిన సమగ్ర వివరాలను పంపించారు. కానీ మామ్నూరు ఎయిర్ పోర్టు నిర్మాణం వైపే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గు చూపడంతో అంతర్గాం ఎయిర్ పోర్టు నిర్మాణం అంశం పక్కన పడినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఇక్కడ భూ సేకరణ జరపాలన్నా కూడా మామ్నూరు వద్ద జరిపే భూ సేకరణ కోసం వెచ్చించాల్సన నిధుల కన్నా తక్కువే అవుతాయని స్థానికులు చెప్తున్నారు. మహానగరంగా అభివృద్ది చెందిన వరంగల్ లో భూసేకరణ జరపడానికి ఎదురయ్యే అవాంతరాలు అంతర్గాం విషయంలో ఎదురయ్యే అవకాశం అయితే లేదని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతం కావడంతో పాటు పునరావాసం కల్పించడం వల్ల అంతగా భారం పడే అవకాశం కూడా ఉండదు. కానీ అంతర్గాం టెక్స్ టైల్ పరిశ్రమ భూములు సరిపోతాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక్కడైతే..?

అంతర్గాం వద్ద కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణం వల్ల ఎన్నో సానుకూల వాతావరణాలు ఉన్నాయన్నది వాస్తవం. తెలంగాణ రాష్ట్రంలో రెండో పారిశ్రామిక ప్రాంతంగా భాసిల్లుతున్నది రామగుడం ఏరియా. అయితే హైదారాబాద్ సమీపంలోని పఠాన్ చెరూ, బీహెచ్ఈఎల్ తో పాటు కొత్తగా నిర్మితమవుతున్న సిటీలలో ప్రైవేటు రంగ సంస్థల భాగస్వామ్యంతో నడుస్తున్నాయి. కానీ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలో ఉన్న సంస్థలు కొనసాగుతున్నాయన్న విషయం గమనించాల్సిన అవసరం ఉంది. రామగుండం NTPCలో దాదాపు 4,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా మరో 2,400 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఏర్పాట్లు జరుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ కూడా కొనసాగుతోంది. దేశంలో తొలిసారిగా ఫ్లోటింగ్ వాటర్ పై సోలార్ పవర్ ఉత్పత్తి విధానం ద్వారా 100 మెగాయూనిట్లు, భూమిపై 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అలాగే మంచిర్యాల జిల్లా జైపూర్ లో కూడా 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్ర నడుస్తోంది. రామగుండం ఫెర్టిటలైజర్స్ కంపెనీ లిమిటెడ్ (RFCL) ద్వారా నెలకు లక్ష మెట్రిక్ టన్నులకు పైగా యూరియా ఉత్పత్తి అవుతోంది. సింగరేణి సంస్థ ద్వారా రామగుండం రీజియన్ లో 4 ఓపెన్ కాస్ట్ బావులు, భూగర్భ గనులు 6 నడుస్తున్నాయి. బసంత్ నగర్ తో పాటు మంచిర్యాల సమీపంలో సిమెంటు పరిశ్రమలు కూడా నడుస్తుండగా మంచిర్యాల, మందమర్రి, బెల్లంలపల్లిల ఐబీ తాండూరులలో కూడా సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా, మంథని సమీపంలోని తాడిచర్లలో ఏఎమ్మార్ కంపెనీ ద్వారా భూపాలపల్లి థర్మల్ పవర్ ప్లాంటుకు అవసరమైన బొగ్గు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. అంతర్గాం నుండి గోదావరి నదిపై వంతెన నిర్మించినట్టయితే 5 నుండి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే మంచిర్యాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మార్గాన్నే ఎంచుకున్నా 40 నుండి 45 కిలో మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. దేశ, విదేశాల నుండి వచ్చే ప్రతినిధులు, నిపుణులు ఎక్కువగా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికే వస్తుంటారు. అంతర్జాతీయ సాంకేతికతను అందిపుచ్చుకుని కూడా ఇక్కడ బొగ్గు ఉత్పత్తి జరుగుతున్న నేపథ్యంలో ఆయా దేశాలకు చెందిన నిపుణులు ఇక్కడకు రాకపోకలు సాగిస్తుంటారు. రాష్ట్రంలోనే రోండో పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న రామగుండం సమీపంలోని అంతర్గాంలో ఎయిర్ పోర్టు నిర్మాణం జరపడం వల్ల అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకునే అవకాశం ఉండడంతో పాటు ఆర్థికపరమైన భారం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అంతర్గాం ఎయిర్ పోర్టు కు 5.2 క్లాజ్ సవరణ చేయాల్సిన అవసరం కూడా ఉండదని, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 200 కిలో మీటర్లకు పైగా దూరం ఉంటుందని కూడా తెలుస్తోంది. మామ్నూరు ఎయిర్ పోర్టును భవిష్యత్తులు విస్తరించాలన్నా కూడా భూసేకరణకు ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదు. కానీ గ్రామీణ ప్రాంతంగా ఉన్న అంతర్గాంలో అయితే భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని భూసేకరణ జరిపినట్టయితే అన్నింటా ఉపయోగకరంగా మారనుంది. మరోవైపున రామగుండం మీదుగానే దక్షిణాది నుండి ఉత్తరాదికి వెల్లే రైలు మార్గం కూడా ఉన్నందున అన్ని విధాలుగా రాకపోకలు సాగించేందుకు మెరుగైన సౌకర్యాలు ఉంటాయని స్థానికులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మామ్నూరు ఎయిర్ పోర్టును నిర్మించాలని కృత నిశ్చయంతో ఉండడంతో అంతర్గాం కానీ బసంత్ నగర్ ఎయిర్ పోర్టుల ఏర్పాటు అసాధ్యమనే చెప్పవచ్చు. కానీ ఈ ప్రాంతంలో ఎయిర్ పోర్టు నిర్మిస్తే మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అన్నింటా లాభదాయకంగా ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఈ ప్రాంతానికి జాతీయ రహదారులు కూడా అనుసంధానం చేసేందుకు తక్కువ ఖర్చు వెచ్చిస్తే సరిపోనుండగా, సమీప ప్రాంతాల్లో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఆలయాలు కూడా ఉండడం, గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో టూరిజం పరంగా కూడా అభివృద్ది చేసుకునేందుకు సులువుగా ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

You cannot copy content of this page