షెల్టర్ ను మరిపిస్తున్న బస్ స్టాండ్
దిశ దశ, హుజురాబాద్:
అది మారుమూల ప్రాంతంలో ఉన్న బస్ స్టాండ్ కాదు. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రాష్ట్రీయ రహదారి నుండి జాతీయ రహదారిగా అప్ గ్రేడ్ అయిన రోడ్డు పక్కనే ఉంది. ఇంతకాలం బస్సులు అటు వైపు కన్నెత్తి కూడా చూడకపోగా ఇటీవలెనే దాని నిర్మాణపు లక్ష్యాల అందుకుంది. కానీ అందులో సౌకర్యాలు మాత్రం ఆర్టీసీ అధికారుల పనితీరును ఎత్తి చూపుతున్నాయి. కారణమేదైనా అక్కడున్న సౌకర్యాలు మాత్రం సంస్కరణల బాట పట్టిన ఆర్టీసీ వైఫల్యానికి నిలువుటద్దంగా సాక్షత్కరిస్తోంది.
ఎక్కడ ఇది..?
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఉన్న ఈ బస్ స్టాండ్ పరిస్థితి చూస్తే ప్రయాణీకులకు ఎంతమేర సౌకర్యాలు ఉన్నాయే ఇట్టే అర్థం అవుతుంది. వాష్ రూమ్స్ నుండి మొదలు ఫాన్ల వరకు ఎవీ ఇక్కడ కనిపించడం లేదు. గతంలో ఎల్కతుర్తి క్రాస్ రోడ్ పై బస్సులు ఆగుతుండేవి. ఇటీవల కాలంలో బస్ స్టాండ్ లోకి బస్సులు వెళ్లాల్సిందేనని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఆదరణ కరువైన ఈ బస్ స్టేషన్ల ఆవరణలో బస్సుల రాకపోకలు, హారన్ల మోతలు ప్రారంభం అయ్యాయి. దీంతో ప్రయాణీకులు కూడా రోడ్లపై బస్సుల కోసం ఎదురు చూడకుండా బస్ స్టాండ్ లోకి వెల్లి వెయిట్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఓ వైపున సిద్దిపేట, మరో వైపున కరీంనగర్, ఇంకో వైపున వరంగల్ ప్రధాన రహదారులకు జంక్షన్ లా ఉన్న ఎల్కతుర్తి బస్ స్టేషన్ లో ప్రయాణీకులు కూర్చేనేందుకు కుర్చీలు లేక పోగా ఫ్యాన్లు కూడా అధికారులు తీసుకెళ్లడం గమనార్హం. బస్ స్టాండ్ లో కనీసం తాగు నీటి సౌకర్యం కూడా లేకపోవడం విస్మయం కల్గిస్తోందని ప్రయాణీకులు వాపోతున్నారు. నిత్యం వందల సంఖ్యలో ఎల్కతుర్తి మీదుగా ఆర్టీసీ బస్సులు వెల్తున్నా సౌకర్యాల గురించి పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఇక్కడకు వచ్చే వాహనదారుల నుండి పార్కింగ్ ఫీజు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ద ప్రయాణీకుల సౌకర్యాలు పట్టించుకోకపోవడంపై లేకపోవడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కరీంనగర్ జిల్లాలో ఎల్కతుర్తి ఉండేది కానీ నూతన జిల్లాల ఆవిర్భావం తరువాత హన్మకొండ జిల్లాలో చేర్చారు. అయితే ఎల్కతుర్తి బస్ స్టాండ్ లోని ఫ్యాన్లు, ఇతరాత్రాలను తాము తీసుకెళ్లింది వాస్తవమేనని, రెండు మూడు రోజుల్లో వీటిని తిరగి బిగిస్తామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. వాటిని సంరక్షించేందుకు ఎవరూ లేకపోవడం వల్లే వాటిని తీసుకెళ్లామని కూడా అంటున్నారు. ఈ లెక్కన ఈ బస్ స్టాండ్ లో కంట్రోలర్ తో పాటు ఇతర సిబ్బంది కూడా లేరని స్పష్టం అవుతోంది. మరో వైపున సీసీ కెమెరాలు కూడా లేవని తెలుస్తోంది. దోమలతో సహవాసం చేస్తూ ప్రయాణీకులు బస్సు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. సంస్కరణల విషయంలో ఎన్నో కార్యక్రామలకు శ్రీకారం చుట్టిన ఈ సమయంలో కూడా ఎల్కతుర్తి బస్ స్టాండ్ ఇలాంటి దుస్థితిలో కొట్టమిట్టాడం దారుణం. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ బస్ స్టేషన్ లో సౌకర్యాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రయాణీకులు కోరుతున్నారు.