దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. బుధవారం రాత్రి అంబేద్కర్ స్టేడియం కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ వైఖరిని దుయ్యబట్టారు. ఈవీఎంల ద్వారానే కాకుండా బ్యాలెట్ ద్వారా కూడా బీజేపీ గెలిచి తీరుతుందని చెప్పడానికి కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అన్నారు. సొమ్ము ఒకరిది… సోకు ఒకరిది… అన్న చందంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు చోట్ల బహిరంగ సభలు నిర్వహించినా, మంత్రులు పర్యటించినా కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రులు మాత్రం బీజేపీికి అనుకూలమని తేల్చేశారన్నారు. తెలంగాణాలో 70శాతం బీజేపీకి అనుకూలంగా మారిందని 30 శాతం అనుకూలం కావడం పక్కా అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ప్రతి ఎన్నికలోనూ బీజేపీ విజయం సాధించి తీరుతుందని స్పష్టం చేశారు. ఇది బీజేపీ కార్యకర్తల శ్రమ వల్ల సాధించుకున్న విజయమని వారికి హట్సప్ చెప్తున్నానన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఏకమైనా పట్టభద్రులు బీజేపీకి పట్టం కట్టారన్న విషయం గుర్తు పెట్టుకోవాలని సంజయ్ అన్నారు. రెండో స్థానంలో నిలవాల్సిన బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చి ఆయన విజయంలో తన క్రెడిట్ దక్కించుకోవాలని చూసింది కానీ వారి ప్రయత్నాలు బెడిసి కొట్టాయన్నారు. హరికృష్ణ మూడో స్థానానికి పడిపోవడానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతే కారణమని, ఆయన గెలిస్తే గంపకింద పెట్టుకోవాలన్న ఆకాంక్షతో బీఆర్ఎస్ పార్టీ స్కెచ్ వేసినప్పటికీ ఫలించలేదని చెప్పుకొచ్చారు. టీచర్స్ నియోజకవర్గంలో కూడా బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో చేతల్లో చూపించారని కామెంట్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాయి.