దిశ దశ, పలిమెల:
పాషా దొర భూముల వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకోవడంతో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకునే పరిస్థితి తయారైంది. పలిమెల భూముల రిజిస్ట్రేషన్ కు మీ పార్టీ వారే కారణమంటే మీ పార్టీ వారే కారణమంటూ విమర్శలు చేసుకుంటున్నారు. అయితే అన్ని పార్టీలకు చెందిన వారి భాగస్వామ్యం ఈ వ్యవహారంలో ఉండడంతో అసలు విషయం నెమ్మదిగా ట్రాక్ తప్పించేలా కనిపిస్తోంది. 2008లో పాషా దొర వారసునిగా చెప్పుకున్న వ్యక్తి పలిమెల భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తుండగా, బీఆర్ఎస్ పార్టీ వారి బాగస్వామ్యం కూడా ఉందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. బీజేపీ నాయకులు కూడా పలిమెల రైతులకు బాసటగా నిలుస్తున్నారు.
బిగ్ ట్విస్ట్…
దశాబ్దాలుగా పాషాదొర భూములు దున్నుకుంటున్న దళిత, గిరిజనులతో సంబంధం లేకుండా రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారులు మారిపోయారు. రైతు బంధు వస్తోందని, ధరణీ పాసు బుక్కులు ఉన్నాయని చెప్పి ఇతర ప్రాంతాల వారికి విక్రయించారు కొందరు. అయితే ఇందులో 102 ఎకరాల భూములు డెక్కన్ సిమెంట్ కంపెనీ పేరిట యాజామాన్య హక్కులు మారడంతో మంథని నియోజకవర్గంలో మాటల యుద్దం మొదలైంది. ఈ భూముల పాపం మీదేనంటే మీదేనని రాజకీయ పార్టీల నాయకులు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే కబ్జాలో ఉన్న రైతులకు, అసలు పట్టాదారులకు సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు ఎలా అయ్యాయన్నదే అంతు చిక్కకుండా పోతోందని పలిమెల ప్రాంత వాసులు అంటున్నారు. అయితే ఈ భూముల లావాదేవీల్లో ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్న వారంతా పార్టీలు ఫిరాయించడంతో ఇప్పుడా మసి అన్ని పార్టీలకు అంటుకున్నట్టుగా అయింది. ఆయా పార్టీల నాయకులు విమర్శలు చేసుకుంటున్నప్పటికీ తమ పార్టీలో ఉన్న వారిని కవర్ చేయలేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ముఖ్య నేతలకు ఎదురవుతోంది. ఇంతకాలం గుంభనంగా ఉన్న పలిమెల భూముల వ్యవహారం డెక్కన్ సిమెంట్స్ ఎంట్రీతో రచ్చ రచ్చ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 102 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ చేయగా మరి కొంత భూమి పట్టాదారుల పేర్లను మార్చేందుకు రికార్డుల్లో ఉన్న వారు స్లాట్స్ బుక్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే తొలి అడుగులోనే అసలు విషయం వెలుగులోకి రాగానే బీఆర్ఎస్ మంథని ఇంఛార్జీ, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు రంగంలోకి మంత్రి శ్రీధర్ బాబను టార్గెట్ చేసి ఆరోపణలకు దిగారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కౌంటర్ అటాక్ చేసి పలిమెల భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారని ప్రతి విమర్శలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఆ భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఇప్పుడు మా పార్టీలో చేరినంత మాత్రాన తమకు సంబంధం లేదని బీఆర్ఎస్ నాయకులు వాదిస్తున్నారు. మరోవైపున బీజేపీ నాయకుడు సునీల్ రెడ్డి కూడా పలిమెల సందర్శించిన సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులపై విమర్శలు చేశారు. అయితే ఈ మూడు పార్టీలకు సంబంధించిన నాయకుల పేర్లు పలిమెల భూముల లావాదేవీల్లో వినిపిస్తుండడం గమనార్హం.
ఇతర జిల్లాలు…
ఇకపోతే ఎక్కడో మారుమూలన ఉన్న పలిమెల భూముల వ్యవహారం కేవలం మంథని ప్రాంతానికే పరిమితం కాలేదని తెలుస్తోంది. పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన ముఖ్య నాయకుల అనుచరులు కూడా ఈ లావాదేవీలలో భాగస్వాములుగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. గతంలోనే కరీంనగర్ కు చెందిన ఓ వ్యక్తి ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు వెల్లగా కబ్జాలో ఉన్న రైతులు అడ్డుకుని అతన్ని వెల్లగొట్టారు. ఈ ప్రాంతానికి చెందిన సాధారణ వ్యక్తుల ద్వారా ఈ భూముల సమస్యను పరిష్కరించుకునేందుకు కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది. చివరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ నాయకులకు సన్నిహితంగా ఉండే వారి వద్దకు వెల్లింది. వారు కూడా పలిమెల ప్రాంత రైతులతో మాట్లాడాలని భావించి ఇదే మండలానికి చెందిన ఓ బీఆర్ఎస్ నాయకున్ని సంప్రదించగా అతను విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో ఓ ఎన్ఆర్ఐ నేరుగా డెక్కన్ సిమెంట్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి ఈ భూములను విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే డెక్కన్ సిమెంట్ ప్రతినిధులు భూములను కొనుగోలు చేసిన తరువాత స్థానిక తహసీల్దార్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకునే విషయంలో ఎవరి ద్వారా రాయబారం నడిపారోనన్న విషయంపై స్థానికంగా చర్చ సాగుతోంది. ఏది ఏమైనా పలిమెల పాషా దొరకు సంబంధించిన ఈ భూముల వ్యవహారాన్ని అధికారులు ఎలా పరిష్కరిస్తారు..? దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న దళిత, గిరిజన రైతులకు న్యాయం చేకూరుస్తారా లేదా అన్నది తేలాల్సిన అవసరం ఉంది.