దిశ దశ, కరీంనగర్:
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ వీడడం లేదు… ఆశావాహులు తమ వంతు ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నా అభ్యర్థిని ప్రకటించే విషయంలో అధిష్టానం ఓ స్పష్టతకు రాలేదు. దీంతో కరీంనగర్ క్యాండెట్ ఫైనల్ విషయం హోల్డ్ లో ఉన్నట్టయింది. కరీంనగర్ విషయంలో సామాజిక వర్గాల సమీకరణాల కారణంగానే అభ్యర్థి ఎంపిక చేయలేకపోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడి నుండి టికెట్ ఆశించిన వారితో పాటు తాజాగా తీన్మార్ మల్లన్న పేరు కూడా తెరపైకి రావడంతో తాజా సీఈసీ భేటీలో కూడా అభ్యర్థిని ప్రకటించలేకపోయినట్టుగా సమాచారం.
బీసీ కార్డ్..?
అయితే ఇక్కడి నుండి పోటీ చేస్తున్న వారిలో టఫ్ ఫైట్ ఇస్తున్న ఇద్దరు నాయకులు కూడా అగ్రవర్ణాలకు చెందిన వారే కాబట్టి బీసీ అయితే ఎలా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్టుగా సమాచారం. ఈ కారణంగానే చివరి నిమిషంలో తీన్మార్ మల్లన్న పేరును ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా కరీంనగర్ లో బీసీ కార్డ్ నినాదం ఇక్కడ సక్సెస్ అవుతోందన్న యోచనలో తీన్మార్ మల్లన్న అయితే ఎలా ఉంటుందని అధిష్టానం యోచిస్తున్నట్టుగా సమాచారం.
నాన్ లోకల్…
కరీంనగర్ లో లోకల్ నాన్ లోకల్ అన్న నినాదం బలంగా వినిపిస్తోంది. గత కొంతకాలంగా సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ లోకల్ నాన్ లోకల్ అన్న నినాదాన్ని తెరపైకి తీసుకవచ్చి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను డిఫెన్స్ లో పడేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తాను కరీంనగర్ బిడ్డనేనని, ఇక్కడి మిషన్ దవాఖానాలోనే జన్మించానంటూ పదే పదే చెప్పుకునే పరిస్థితిని తీసుకొచ్చాయి బీజేపీ శ్రేణులు. ఓ వైపు మోడి మానియా మరో వైపు స్థానికత అంశాన్ని ప్రధాన ప్రచారస్త్రంగా ముందుకు సాగుతున్న బీజేపీ… కాంగ్రెస్ పార్టీకి చెందిన నాన్ లోకల్ అభ్యర్థిని ఎంపికి చేసినట్టయితే మరింత లాభం చేకూరే ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికంగా బలమైన నాయకులు లేకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ స్థానికేతరులను తీసుకొచ్చిందంటూ విమర్శలు చేసేందుకు ఆస్కారం ఇచ్చినట్టు అవుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. మరో వైపున తీన్మార్ మల్లన్న రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులను ఏకి పారేయడంలో ఏ మాత్రం వెనకాడరన్న బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. కానీ కొంతమంది నాయకుల అంశాన్ని మాత్రం విస్మరిస్తారని అందులో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఒకరన్న అభిప్రాయాలు ఉన్నాయి. బీసీ కార్డులో భాగంగానే సంజయ్ అంశాన్ని ఆయన లేవనెత్తకుండా జాగ్రత్త పడతారా లేక ఆయన కష్ట కాలంలో సంజయ్ అండగా నిలిచారన్న కారణమో తెలియదు కానీ ఆయన గురించి మాత్రం మల్లన్న ఘాటుగా స్పందించిన సందర్బాలు చాలా తక్కువేనని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్న అభ్యర్థిగా బరిలో నిలిచినట్టయితే సంజయ్ పై కౌంటర్ అటాక్ చేసే అవకాశాలు ఉంటాయా లేవా అన్న తర్జనభర్జనలు కూడా సాగుతున్నాయి.
మీనా మేషాలెందుకు..?
అయితే కరీంనగర్ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా మీనామేషాలు లెక్కించడం పట్ల స్థానికంగా విస్మయం వ్యక్తం అవుతోంది. ఇరుగు పొరుగు నియోజకవర్గాలపై తీవ్రమైన ప్రభావం చూపించే కరీంనగర్ నియోజకవర్గ అభ్యర్థిని ఫైనల్ చేసే విషయంలో అధిష్టానం కాలయాపన చేస్తుండడం సరికాదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఆలస్యంగా అభ్యర్థిని ఎంపిక చేయడం కూడా పార్టీకి తీరని నష్టాన్ని చూపిస్తోందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏడు సెగ్మెంట్లలో క్యాడర్ ను బలోపేతం చేసుకోవడం… పార్టీ ప్రచారాన్ని కార్యక్షేత్రంలోకి తీసుకెళ్లడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని… అభ్యర్థిని ప్రకటిస్తే ఆయన తన వ్యూహాలతో ప్రజల్లో వెల్లే అవకాశం ఉంటుంది. కానీ అభ్యర్థిని ప్రకటించే విషయంలో తాత్సరం చేస్తుండడం వల్ల క్యాడర్ తో పాటు లీడర్ కూడా నైరాశ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ ఢీలా పడిపోయి… ప్రత్యర్థి పార్టీలో బలపడుతాయన్న విషయాన్ని అదిష్టానం గుర్తుంచుకోవల్సిన అవసరం ఉంది.