దిశ దశ, హైదరాబాద్:
రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠతకు మరికొన్ని గంటల్లో తెర పడనుంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటరు తీర్పు బాహ్య ప్రపంచానికి తెలియనుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ 8 గంటలకు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారోనన్న విషయంపై టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు. 49 కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ చేపట్టిన ఎన్నికల కమిషన్ మూడంచెల భద్రతా వ్యవస్ధను ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర బలగాల పహారా మధ్య ఈవీఎంలను తెరిచి ఓటర్ల నిర్ణయం ఎటు వైపు ఉందో తేల్చనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తరువాత ఈవీఎంలను రౌండ్ల వారిగా లెక్కించనున్నారు.
రికార్డ్ బ్రేక్ ఎవరి వంతో..?
తెలంగాణ ఓటర్ల తీర్పుతో రాజకీయ పార్టీలు సరికొత్త రికార్డ్ బ్రేక్ దిశగా సాగనున్నాయి. రాష్ట్ర ఓటర్ల నిర్ణయాన్ని బట్టి ఈ రికార్డు ఎవరి వంతో తేలనుంది. బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టినట్టయితే దక్షిణాది రాష్ట్రాల్లో హ్యాట్రిక్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘనతను గులాభి పార్టీ దక్కించుకోనుంది. సౌత్ ఇండియాలో తొలిసారి వరసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు అవకాశం కల్పించినట్టు అవుతోంది. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త రికార్డును తెలంగాణా సొంతం చేసుకునుంది. ఇక పోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే ఆ పార్టీ కూడా మరో చరిత్ర సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణాలో అతి ఎక్కువ సీట్లు దక్కించుకున్న రికార్డ్ క్రియేట్ చేయనుంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏక కాలంలో 59 సీట్లకు మించి గెల్చుకోలేకపోయింది. అయితే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఓటరు తీర్పు అలా ఉండేది కానీ… ఇప్పుడు స్వరాష్ట్రం సిద్దించిన తరువాత అప్పటి గణాంకాలు ఎలా పోల్చుతారన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారూ లేకపోలేదు. 59కి మించి సీట్లు దక్కించుకుంటే మాత్రం తొలిసారి అత్యధిక స్థానాలు గెల్చుకున్న చరిత్రను అందుకుంటుంది.
బీఆర్ఎస్ అలా…
రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తరువాత తేల్చి చెప్తున్న ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అని చెప్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ రిపోర్ట్ కూడా తెప్పించుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో అధికారం తమదేనన్న అభిప్రాయంతోనే ఉన్నారు. ఈ క్రమంలో గత అనుభవాలు దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యేలను బెంగుళూరు క్యాంపునకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేసింది. గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాభి పార్టీ పంచన చేరారన్న ప్రచారాన్ని విస్తృతంగా చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి మెజార్టీ స్థానాలను దక్కించుకున్నా బీఆర్ఎస్ పార్టీ జంప్ జిలానీలను ప్రోత్సహించే అవకాశం ఉంటుందన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో గెలిచిన అభ్యర్థులందరినీ క్యాంపునకు తరలించే పనిలో నిమగ్నం అయింది. అయితే బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం పోలింగ్ తరువాత వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్, హరీష్ రావులతో పాటు ఇతర ముఖ్య నేతలతో భేటి అయి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. తాము 70 సీట్ల వరకు గెలుస్తున్నామని కేటీఆర్ ప్రకటించడం, అధికారం తమదేనంటూ హరీష్ రావు ధీమా వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. మరోవైపున ప్రగతి భవన్ కు రంగులు వేస్తున్న ఫోటోలు వైరల్ చేసిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గుండె ఎంతో గట్టిదో చూశారా అంటూ కామెంట్స్ చేశారు. అలాగే మంత్రి కేటీఆర్ షార్ట్ వెపన్ ఎయిమ్ చేస్తూ హ్యాట్రిక్ గవర్నమెంట్ లోడ్ అవుతుంది అని కామెంట్ పోస్ట్ చేశారు. రాష్ట్రంలో ప్రీ పోల్, పోస్ట్ పోల్ సర్వేలన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నాయకులు అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేయడం వెనక కారణాలేంటన్న చర్చ సాగుతోంది. బీజేపీ కూడా మరో రికార్డు అందుకునే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో సింగిల్ డిజిట్ కే పరిమితం అయిన బీజేపీ ఈ సారి అసెంబ్లీలో డబుల్ డిజిట్ అభ్యర్థులను అసెంబ్లీకి పంపించనున్నట్టు ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పనున్నాయి.
కొన్ని గంటలే…
అయితే తెలంగాణ ఓటరు ఇచ్చే జడ్జిమెంట్ ప్రకటనకు మరికొన్ని గంటలే మిగిలింది. మద్యాహ్నం కల్లా గెలుపోటములు తేలిపోనున్న నేపథ్యంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయన్న ఉత్కంఠత అయితే అటు తెలంగాణ ప్రజల్లో ఇటు అన్ని రాజకీయ పార్టీల్లో వ్యక్తం అవుతోంది. ఈ సారి ఒక్కో ఈవీఎంను మూడు సార్లు లెక్కించాలని ఎన్నికల అధికారులు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఫలితాలు కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.