గరియాబంద్ ఎన్ కౌంటర్ చనిపోయిందెవరూ..?

దిశ దశ, దండకారణ్యం:

చత్తీస్ గడ్, ఒడిషా సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో మరణించిన నక్సలైట్ల పూర్తి వివరాలు ఇంకా తెలియరావడం లేదు. ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారన్న విషయంపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. పోలీసు వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి మాత్రం ఇంకా నక్సల్స్ ఏరివేత కార్యక్రమం కొనసాగుతోందని తెలుస్తోంది.

అనుమానాలేనా..?

ఒడిషాలోని నువాసాడా జిల్లా సరిహధ్దులను ఆనుకుని ఉన్న కీకారణ్యాలు, చత్తీస్ గడ్ లోని గరియాబంద్ జిల్లా పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతంలో మావోయిస్టు బడా నాయకులతో పాటు భారీ సంఖ్యలో షెల్టర్ తీసుకున్నారన్న సమాచారం అందుకున్న బలగాలు పెద్ద సంఖ్యలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. 19వ తేదిన రంగంలోకి దిగిన బలగాల చేతిలో 20న ఇద్దరు మహిళా నక్సల్స్ ను ఎన్ కౌంటర్ లో మరణించగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుండి వెనుదిరిగని బలగాలు సెర్చింగ్ ఆఫరేషన్ యథావిధిగా కొనసాగించగా 21వ తేది అర్థరాత్రి నుండి తెల్లవారు జామున జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు మరణించారు. ఈ ఘటనలో కొంతమంది జవాన్లు కూడా గాయపడినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో మొదట 10 మంది అని ఆ తరువాత 12 మంది అని మద్యాహ్నం కల్లా 20 మంది అని, రాత్రి ఈ సంఖ్య 28కి చేరుకుందని పోలీసు వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్ కౌంటర్ ఘటన స్థలంలో మరణించిన నక్సల్స్ ఫోటోలు కూడా బయటకు వచ్చినప్పటికీ పోలీసులు మాత్రం ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందనే చెప్తున్నారు.

కీలక నేతలా..?

అయితే ఈ ఘటనలో కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రా రెడ్డి అలియాస్ జయరాం అలియాస్ చలపతి మరణించాడని పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఘటనా స్థలంలో ఆయన లేకపోయి ఉండవచ్చని తెలుస్తోంది. మరో వైపున ఒడిషా రాష్ట్ర కార్యదర్శి కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ అలియాస్ బాలన్న అలియాస్ భాస్కర్ అలియాస్ మనోజ్ అలియాస్ రామయందర్ చనిపోయినట్టుగా అనుమానించారు. ఇతనితో పాటు ఒడిషా స్టేట్ కమిటీ మెంబర్ గుడ్డు అలియాస్ జయరాం ఉన్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. అయితే అధికారికంగా మాత్రం చనిపోయిన వారిని ఇంకా గుర్తించనట్టుగా తెలుస్తోంది. అయితే బాలకృష్ణ అలియాస్ మనోజ్ ఎన్ కౌంటర్ లో లేడని పోలీసు వర్గాలు నిర్దారించినట్టుగా విశ్వనీయంగా తెలుస్తోంది. మరో వైపున నల్గొండ జిల్లా పుల్లెంలా గ్రామానికి చెందిన పాక హనుమంతు ఉన్నాడని మంగళవారం సాయంత్రం పోలీసు వర్గాల నుండి సమాచారం అందింది. ఈ మేరకు ఆయన స్వస్థలానికి కూడా సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. ఉదయం నుండి కూడా చనిపోయిన నక్సల్స్ పూర్తి వివరాలపై స్పష్టత లేకపోవడంతో ఎవరు మరణించారన్న విషయం తెలియరావడం లేదు. అయితే ఘటనా స్థలం నుండి ఎన్ కౌంటర్ లో చనిపోయిన మృతదేహాలను బయటకు తీసుకరాలేదు. అయితే ఎన్ కౌంటర్ లో మరణించిన నక్సల్స్ కు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులు బుధవారం వెల్లడించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఏకపక్ష కాల్పులు

దేశంలోని సహజవనురులను అంబాని, అదానీలకు దోచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నరమేధానికి పూనుకుందని అఖిలభారతకార్మిక సంఘాలసమాఖ్య (AIFTU ) రాష్ట్ర నాయకులు మాతంగి రాయమల్లు మేకల పోచమల్లు, రైతుకూలీ సంఘం(RCS) రాష్ట్రప్రధాన కార్యదర్శి వెల్తురు సదానందం, రాష్ట్రసహాయ కార్యదర్శి తుటిచెర్ల రత్నకుమార్ లు ఒక ప్రకటనలో ఆరోపించారు. ఆ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకోలేదని, ఏకపక్ష కాల్పులు మాత్రమే జరిగాయని అన్నారు. ఈ ఘటనలో అమరులైన చలపతి, మనోజ్ తో పాటు మిగత వారికి జోహర్లు అర్పిస్తున్నామని పేర్కొన్నారు.

You cannot copy content of this page