తరలిపోతున్న ఎస్సారెస్పీ మట్టి… అనుమతులు ఎవరిచ్చారో మరి..?

దిశ దశ, వర్దన్నపేట:

సర్కారు నిబంధనలు అమలు చేసే విషయంలో ప్రభుత్వ యంత్రాంగమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందా..? సామాన్యుడు మట్టి తవ్వకాలు జరిపితే చట్టాలకు పనిచెప్పే అధికారులు దర్జాగా తవ్వకాలు జరుపుతున్నా పట్టించుకోకపోవడానికి కారణం ఏంటీ..? వరంగల్ జిల్లా వర్దన్నపేట ఎస్సారెస్పీ కెనాల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మట్టి తరలింపు విషయంలో అసలేం జరుగుతోంది..?

బాజాప్తాగా…

జిల్లాలోని వర్దన్నపేట మీదుగా ఖమ్మం జిల్లాకు నీటిని తరలించేందుకు నిర్మించిన ఎస్సారెస్పీ స్టేజ్ 2 కెనాల్ పరిసర ప్రాంతాల్లో మట్టి నిల్వలు ఉన్నాయి. ఈ మట్టిని కొంతమంది దర్జాగా తవ్వుకుంటూ తీసుకెల్తున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. జేసీబీలు పెట్టి, భారీ వాహనాల్లో తరలిపోతున్న మట్టి విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో ఈ ప్రాంతంలోనే ఎస్పారెస్పి కెనాల్ సమీపంలోని మట్టిని తరలించుకుపోయిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన ఇరిగేషన్ అధికారులు తాజా పరిణామాలపై ఎందుకు మిన్నకుండిపోతున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది.

అభివృద్ది పేరిట… 

స్థానికంగా ఉన్న తండాలో అభివృద్ది పనుల కోసం ఈ మట్టిని తరలించుకపోతున్నామని ప్రభుత్వ అవసరాల కోసమేనన్న బూచిని చూపుతున్న అధికారులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇరిగేషన్ విభాగం పరిధిలో ఉంటే ఈ మట్టిని తీసుకెళ్లేందుకు నిబంధనలు అనుమతించవని తెలుస్తోంది. అయినప్పటికీ ఇక్కడి నుండి మట్టిని తరలించుకపోతుండడం స్థానికులను విస్మయపరుస్తోంది. ఒక వేళ అభివృద్ది పనుల కోసమే మట్టిని తరలించుకపోయేందుకు నిబంధనలు అనుకూలించినట్టయితే ఇందుకు సంబంధించిన పర్మిషన్ ఎవరు ఇవ్వవలిసి ఉంటుంది..? అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయా అన్నది కూడా తేలాల్సి ఉంది.

అవసరం ఎంత..?

మరో వైపున ఎస్సారెస్పీ కెనాల్ సమీపంలోని మట్టి తరలించుకపోతున్న విషయంలో పర్యవేక్షణ అంతగా లేనట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. తండాలో జరుగుతున్న అభివృద్దికి ఎంతమేర మట్టి అవసరం ఉంటుంది..? అంతకు మించి తవ్వకాలు జరిపి తీసుకెల్తున్న మట్టి ఎక్కడికి వెల్తోంది అన్న విషయంపై స్థానికంగా చర్చ సాగుతోంది. తండాలో జరిపే అభివృద్ది పనుల కోసం రోజుల తరబడి పదుల సంఖ్యలో లారీలు మట్టి రవాణా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. లక్షలాది క్యూబిక్ మీటర్ల మట్టితో ఆ తండాలో చేపట్టిన అభివృద్ది పనులకు అవసరం ఉంటుందా లేదా అన్న విషయంపై కూడా ఉన్నతాధికారులు ఆరా తీయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కెనాల్ సమీపంలో నిలువ ఉంచిన మట్టిని ఇతర అవసరాలకు వినియోగించడమే నిబంధనలకు విరుద్దమని తెలుస్తుండగా, లెక్కకు మించిన లారీల్లో మట్టి రవాణా అవుతుండడంపై కూడా స్థానికంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page