కాంగ్రెస్ పార్టీలో చేరికలకు చెక్ పెడుతున్నారా..?

మైనార్టీ నాయకుని జాయినింగ్ కు దూరంగా వివేక్…

గ్రూప్ పాలిటిక్స్ స్టార్ట్ అయినట్టేనా…

దిశ దశ, చెన్నూరు:

చెన్నూరు కాంగ్రెస్ పార్టీలో సరికొత్త రాజకీయాలు తెరపైకి వచ్చాయి. కొత్తగా పార్టీలో చేరే వారి విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. తన కొడుకును లోకసభకు పంపించాలని ఉవ్విళ్లూరుతున్న సమయంలో అనుకోని పరిణామం చోటు చేసుకోవడం ఇబ్బందికరంగా మారింది. మైనార్టీ నేతతో పాటు పలువురు పార్టీలో చేరే విషయంలో అంటీముట్టనట్టుగా ఉన్న తీరు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

గ్రూప్ పాలిటిక్స్ స్టార్టా..?

అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇతర పార్టీలకు చెందిన వారిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్పించుకునేది లేదని కుండబద్దలు కొట్టారు చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అండతో కేసులు పెట్టించడంతో కాంగ్రెస్ నాయకులు ఇబ్బందుల పాలయ్యారని కూడా పదే పదే వ్యాఖ్యానించారయన. ఎన్నికలకు ముందు తమతో కలిసి నడిచిన వారి వల్లే గెలిచినందున కొత్తవారు తమకు అవసరం లేదని స్ఫష్టం చేశారు. దీంతో ఇదే విధానం కొనసాగుతోందని, కొత్తవారికి ఎంట్రీ ఇచ్చే అవకాశమే లేదన్న ధీమాతో వివేక్ అనుచరులు ఉన్నారు. అయితే అనూహ్యంగా బీఆర్ఎస్ నేత జుల్ఫెకార్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ కావడంతో ఆయన నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన తన అనుచరులను పార్టీలో చేర్పించేందుకు తరలించారు. అయితే ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వివేక్ వస్తారని ఆశించినప్పటికీ చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్టుగా ప్రచారాం జరుగుతోంది. దీంతో జుల్ఫెకార్ ఆహ్మద్ తన అనుచరులకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో చేరే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం కావాలనే తమ కార్యక్రమానికి వివేక్ ను రానివ్వకుండా అడ్డుకున్నారంటూ జుల్ఫెకార్ అహ్మద్ అనచరులు ఆరోపిస్తున్నారు.

మైనార్టీ నేత…

అయితే ఓ వైపున రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలను మచ్చిక చేసుకునే పనిలో కాంగ్రెస్ అధిష్టానం నిమగ్నం అయింది. అసెంబ్లీ ఎన్నికలప్పటి నుండే మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ వైపు చూడడం కూడా మొదలైంది. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాలో ఇమేజ్ ఉన్న జుల్ఫెకార్ అహ్మద్ జాయినింగ్ విషయంలో స్థానిక ఎమ్మెల్యే వివేక్ అంటీముట్టనట్టుగా వ్యవహరించడం సంచలనంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టున్న నేత జాయినింగ్ విషయంలో వివేక్ దూరంగా ఉండడం వెనక కారణం ఏంటన్న తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఓ నాయకుడి ఒత్తిడి కారణంగానే ఆయన పార్టీలో చేర్పించుకునే ప్రక్రియకు హాజరు కాలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నారు.

తనయుడి ఎన్నికల వేళ…

అయితే చెన్నూరు ఎమ్మెల్యే వివేకానంద తనయుడే పెద్దపల్లి ఎంపీగా బరిలో నిలిచారు. కొడుకు గడ్డం వంశీ కృష్ణ ఫస్ట్ ఎంట్రీతోనే సక్సెస్ కావాలని భావించిన వివేక్ ఏడు సెగ్మెంట్లలో కూడా ఇందుకు అనుకూలంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే సొంత పార్టీకి చెందిన అసమ్మతి నాయకులను అస్మదీయులుగా మార్చుకున్న వివేక్ ఇప్పుడు సొంత ఇలాకా నుండి ఎదురైన సవాల్ ను ఎలా అధిగమించబోతారోనన్న చర్చ కూడా సాగుతోంది. గంప గుత్తగా ఓట్లు పడే మైనార్టీ వర్గం నాయకుడి చేరిక విషయంలో మరో వర్గం నేత అభ్యంతరం కారణంగా వివేక్ దూరంగా ఉండడం ఎటు వైపు దారీ తీస్తుందోనన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా మొదట్లో ఇతర పార్టీల నాయకులను పార్టీలో చేర్పించుకునే విషయంలో ఆచూతూచి అడుగేసినప్పటికీ ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారికి కండువాలు కప్పుతున్నారని… చెన్నూరులో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించడం సరైంది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తన కొడుకు గెలుపును నల్లేరు మీద నడకలా సాగించాలనుకుంటున్న వివేక్ కు జుల్ఫేకార్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంలో వ్యవహరించిన తీరుపై మైనార్టీ వర్గాల నుండి ఎలాంటి స్పందన వస్తుందోనన్నదే అంతుచిక్కకుండా పోతోంది.

You cannot copy content of this page