సిమెంట్ ఉత్పత్తికి అవసరమని తేల్చిందెవరూ…
పలిమెల భూముల వెనక అసలేం జరిగింది..?
దిశ దశ, పలిమెల:
పలిమెల మండలంలోని భూస్వాములకు చెందిన వ్యవసాయ భూముల్లో సాగు చేస్తున్నది ఎవరూ..? రికార్డుల ఆధారంగా సంపాదించేందుకు పన్నాగం పన్నిందెవరూ..? స్థానికేతరులను తీసుకొచ్చి మరి భూములు విక్రయించడానికి కారణమేంటీ..?
దొర భూముల్లో…
పాషా దొర పట్నానికి వెల్లిపోయినప్పుడు ఈ భూములు మీవే… మీరే దున్నుకుని జీవనం సాగించండని చెప్పాడని స్థానికులు చెప్తున్నారు. తమ తాతలకు ఈ విషయం చెప్పి వెల్లిన పాషాదొర ఇప్పటి వరకు ఈ భూముల వైపు కన్నెత్తి కూడా చూడలేదని అంటున్నారు. దీంతో ఇవి తమ సొంత భూములన్న భావనతోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని పలిమెల మండలానికి చెందిన రైతులు అంటున్నారు. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం తమకు యాజమాన్య హక్కులు కల్పించకపోవడం వల్ల ఈ ప్రాంతానికి సంబంధం లేని వారి పేర్లు రికార్డుల్లోకి చేరాయని రైతులు ఆరోపిస్తున్నారు. పలిమెల ప్రాంత రైతుల పేర్లు లేవన్న విషయం బయటకు ఎలా పొక్కిందన్నదే అంతు చిక్కకుండా పోయింది. రెవెన్యూ అధికారులు ఫిజికల్ వెరిఫికేషన్ అనే విషయాన్ని మరుగున పడేసి రికార్డుల్లో పట్టాదారులు పేర్లు ఉన్నాయన్న విషయం లీక్ చేయడంతో కొంతమంది సిండికేట్ గా ఏర్పడి భూములు అప్పనంగా అమ్మేశారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో దందా కొనసాగించిన సిండికేట్ మాఫియా ఇతర ప్రాంతాల్లోని వారికి ఈ భూములు కట్టబెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. కరీంనగర్, పెద్దపల్లి, ఆసిఫాబాద్ తదితర ప్రాంతాల వారికి ఈ భూములను విక్రయించి రికార్డుల్లో యాజమాన్య హక్కులు కల్పిస్తూ సరికొత్త వ్యాపారానికి తెరలేపినట్టుగా స్పష్టం అవుతోంది. పాషా దొర భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నది స్థానిక దళిత, గిరిజన రైతులు అయితే, రికార్డుల్లో మాత్రం స్థానికేతరుల పేర్లు చేరడం గమనార్హం.
సిమెంట్ అవసరాలకు..?
అయితే గోదావరి తీరం, కీకారణ్యం విస్తరించిన ఈ ప్రాంతంలో ఖనిజ సంపద కూడా విస్తారంగా ఉంది. అయితే ఇంత కాలం పలిమెల ప్రాంత భూముల్లో వనరులు ఉన్నాయన్న విషయం అంతగా ఎవరికి తెలియదు. కానీ ఉన్నట్టుండి ఇక్కడి భూముల్లో సిమెంట్ ఉత్తత్తికి అవసరమైన ముడి సరుకు ఉందన్న విషయాన్ని గుర్తించింది ఎవరన్న చర్చ మొదలైంది. ఏఏ ప్రాంతాల్లో వనరులు ఉన్నాయన్న విషయాలను వివరించే రికార్డులు తప్ప ఇటీవల కాలంలో మాత్రం ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా పరీక్షలు మాత్రం ఎవరూ చేయనట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ ఇక్కడి భూముల్లో సిమెంట్ ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకు నిలువలు ఉన్నాయన్న విషయం తెలుసుకుని డెక్కన్ సిమెంట్ కంపెనీకి అమ్మడం గమనార్హం. సహజ వనరులు ఉన్న విషయాన్ని గుర్తించింది ఎవరూ..? ఈ ప్రాంతంపై సర్వే ఏమైనా చేశారా..? కంపెనీ ప్రతినిధులు కూడా పరీక్షలు చేయకుండానే ఈ భూములు కొంటారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిమెంట్ ఇండస్ట్రీకి పలిమెల భూములు అనువైనవి అన్న విషయాన్ని గుర్తించకుండానే కంపెనీ పెద్ద మొత్తంలో భూములు కొనే అవకాశం అయితే లేదన్నది వాస్తవం. వ్యాపార థృక్ఫథంతో ముందుకు సాగే పరిశ్రమల యాజమాన్యాలు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకునే పలిమెల భూములు కొని ఉంటుందని, అయితే ఈ భూములు సిమెంట్ కంపెనీ అవసరాలను తీర్చుతాయన్న విషయంపై వారికి స్పష్టత ఎలా వచ్చిందన్న విషయం కూడా తేలాల్సిన అవసరం ఉంది. పలిమెల ప్రాంతంలో సున్నపు రాయి నిలువలు పెద్ద ఎత్తున ఉన్నాయన్న విషయం వాస్తవమే అయినప్పటికీ ఈ భూముల్లో దొరుకుతున్న ముడి సరుకులో ఎంత శాతం ఖనిజాలు ఉన్నాయి అవి ఎంత మేర ఉపయోగపడుతాయి అన్న విషయాలపై సమగ్రంగా అధ్యయనం చేసిన తరువాతే కంపెనీలు భూములు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో డోలామైట్, లాటరైట్ వంటి ఖనిజాలు కూడా ఉన్నాయని పరిశోధకులు తేల్చినప్పటికీ వాటిపై పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తరువాతే కంపెనీలు భూములు కొనుగోలు చేస్తుంటాయి. అయితే డెక్కన్ సిమెంట్ కంపెనీ ప్రతినిధులు నేరుగా వచ్చి పలిమెల భూములు కొనడానికి వెనక జరిగిన తతంగం ఏంటన్నదే మిస్టరీగా మారింది. సాధారణంగా భూములు కొనుగోలు చేసే ముందే కంపెనీల ప్రతినిధులు వాటిని పరిశీలించి డ్రిల్లింగ్ చేసి సిమెంట్ ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకు ఎంత శాతం ఉంది..? ఎంత మేర ఉంది..? భూమి లోపల ఎంత వరకు ఉంది..? ఎంత కాలం సిమెంట్ ఉత్పత్తి కోసం వినియోగించుకోవచ్చు అన్న విషయాలపై సమగ్రంగా అధ్యయనం చేయిస్తాయి. ఆ తరువాతే భూములను స్వాధీనం చేసుకునేందుకు పరిశ్రమలు ముందుకు వస్తుంటాయి… కానీ పలిమెల విషయంలో ఈ ప్రక్రియతో సంబంధం లేకుండానే కంపెనీ వందల ఎకరాల్లో భూములు కొనుగోలు చేయడం వెనక ఏదో మతలబు ఉందన్న అనుమానం అయితే వ్యక్తం అవుతోంది.