ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్యతో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అంశం గొత్తి కోయలు. వీరు మన రాష్ట్రానికి వలస వచ్చిన వారని మన రాష్ట్ర పౌరులే కాదని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. అసలు వీరెవరూ..? ఎప్పుడు ఇక్కడకు వలస వచ్చారు అన్న విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ సాగుతోంది.
వలస జీవులు…
గొత్తి కోయలు తెలంగాణ రాష్ట్రంలోకి వలస వచ్చారు. వీరు చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దండకారణ్య అటవీ ప్రాంతంలో అడవుల నడుమ నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. వారి కుటుంబ అవసరాలకు సరిపడ ఆహార పదార్థాలు పండించుకునేందుకు అడువలను చదును చేసుకుని ఆధునిక సాంకేతికత దూరంగా వ్యవసాయం చేసుకుంటారు. భూమిలో విత్తనాలు నాటడం నుండి కోత వరకూ కొడవలి సాయంతోనే వీరు వ్యవసాయం చేసుకుంటారు. పోడు సాగు విధానంపై ఆధారపడి జీవించే గొత్తికోయలు చత్తీస్ ఘడ్ లోని బస్తర్, దంతెవాడ, బీజాపూర్, నారాయణపూర్, కంకేర్ తదితర జిల్లాల్లోని కీకారణ్యలో నివాసం ఉండే వారు. అయితే అభూజామడ్ అటవీ ప్రాంతంగా పిలవబడే ఈ ప్రాంతంలో పీపుల్స్ వార్ పట్టు బిగిస్తూ క్రాంతీకారి జనతన్ సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వం నడిపిస్తోంది. గుట్టలు, అడవులు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించిన తరువాత నక్సల్స్ తిరుగులేని ఆదిపత్యం సాధించారు. అయితే దండకారణ్య అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఏరివేత కోసం అక్కడి బలగాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ఇదే క్రమంలో నక్సల్స్ వ్యతిరేకంగా సల్వా జుడుం పేరిట ప్రత్యామ్నాయ పోరాట పంథాతో ప్రభుత్వ అనుకూలంగా కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించింది. మహేంద్ర కర్మ నేతృత్వంలో ఏర్పడిన సల్వా జుడుం కూడా అడవుల్లోకి చొరబడి అన్నలపై ప్రత్యక్ష పోరాటం చేయడం ఆరంభించింది. దీంతో అక్కడి అడవుల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న గొత్తి కోయల్లో కొన్ని కుటుంబాలు సమిధలుగా మారిపోతామన్న ఆందోళనతో తెలంగాణ అడవుల్లోకి వచ్చాయి. 2005 ప్రాంతం నుండి గొత్తి కోయ కుటుంబాలు నెమ్మదిగా తెలంగాణాలోకి రావడం ఆరంభించాయి. జనాలతో సంబంధం లేకుండా వనాల నడుమ జీవనం సాగించే గొత్తి కోయలు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని తెలంగాణ అడవుల్లోకి వసల వచ్చి స్థిర నివాసలు ఏర్పాటు చేసుకున్నారు. భూపాలపల్లి జిల్లా నుండి భద్రాద్రి కొత్త గూడెం జిల్లా వరకు దాదాపు 1200 కుటుంబాలు ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాయి. అనాదిగా వస్తున్న ఆచారలను పాటించే గొత్తి కోయలను పరివాహక ప్రాంత ప్రజలు ఆదరించి వారికి చేదోడుగా నిలిచారు. కొన్నాళ్లుగా ఆయా ప్రాంతాల్లోనే నివాసం ఏర్పాటు చేసుకున్న వీరిని స్థానిక పౌరులుగా గుర్తించడంతో పాటు ఆధార్, ఓటరు ఐడీ కార్డులు కూడా ఇచ్చారు. తెలంగాణ పౌరులకు వస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలు వీరికి అందుతున్నాయి. ఒక్క రైతు బంధు, రైతు భీమా పథకాలు మినహా అన్నీ రకాలా సర్కారు సేవలను అందుకుంటున్నారు. 17 ఏళ్ల క్రితం తెలంగాణాలోకి వచ్చిన వీరి భాష, జీవన విధానంలో మార్పు లేకపోయినప్పటకీ తెలంగాణ వాసులగా మాత్రం గుర్తించబడ్డారు. పరివాహక జిల్లాల్లో ఇప్పుడు గొత్తి కోయల జనాభా 2 లక్షల వరకూ ఉంటుందని ఓ అంచనా.
పోలీసుల నజర్..
అయితే చత్తీస్ ఘడ్ నుండి తెలంగాణాకు వలస వచ్చిన గొత్తి కోయలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మావోయిస్టు పార్టీ సానుభూతి పరులా లేక నిజంగానే అక్కడి పరిస్థితుల్లో ఇమడ లేక ఇక్కడకు వచ్చారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే దండకారణ్య అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీల గురించి అంతగా అవగాహన లేకపోవడం వల్ల ఓ నిర్దారణకు మాత్రం రాలేకపోయారు. అయితే పోలీసు అధికారులు మాత్రం గొత్తి కోయలపై ఓ కన్నేసీ ఉంచాలని ఆదేశించడంతో వారి కదలికపై నిఘా పెట్టారు. మవోయిస్టు పార్టీ నాయకులు తెలంగాణాలోకి వచ్చారన్న సమాచారం అందుకున్నప్పుడు గొత్తి కోయల గూడెల్లా తనిఖీలు చేపట్టడం రివాజుగా మారిపోయింది. ఇటీవల పోలీసు ఉన్నతాధికారులు కూడా మావోయిస్టుల రాష్ట్రంలోకి వస్తున్నారని అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో పాటు గొత్తికోయల నివాస ప్రాంతాలతో పాటు వారి కదలికపై దృష్టి సారించాలని ఆదేశించారు.
గతంలో ఆందోళనలు…
ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట ప్రాంతాల్లో షెల్టర్ ఏర్పాటు చేసుకున్న గొత్తి కోయలను అడవులను తరలించాలని అటవీ అధికారులు పలుమార్లు ప్రయత్నించారు. ఆ సమయంలో వారిన బలవంతంగా తిప్పుపపుతున్నారని, వారిని చెట్లకు కట్టేసి మరీ హింసిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత కూడా పలు చోట్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా నిత్యకృత్యంగా మారడంతో ఈ అంశాన్ని అంతగా సీరియస్ తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం హరిత హారం కార్యక్రమం చేపట్టినప్పటి నుండి అటవీ అధికారులకు గొత్తి కోయలకు మధ్య వార్ మళ్లీ స్టార్ట్ అయింది. మొక్కల పెంపకం కోసం అడువులు వదిలేయాలని అటవీ అధికారులు, తాము వదిలి వెల్లమని గొత్తి కోయలు తేల్చి చెప్పడం, అటవీ అధికారులు వారి నివాసాలను తొలగించడం, ఈ సమయంలో గొడవలు జరగడం కూడా రివాజుగా మారిపోయింది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు పరిధిలోని ఎర్రబోడులో గొత్తి కోయలు ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ రావు హత్యతో మరోసారి వీరి అంశం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ వారే కాదు…
గొత్తి కోయలు తెలంగాణకు చెందిన వారు కాదని వారు వలస వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నారని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బెండలపాడు గ్రామ సభలో గొత్తి కోయలను గ్రామం నుండి బహిష్కరిస్తూ తీర్మానం చేయడం గమనార్హం, వారిని చత్తీస్ ఘడ్ కు తిప్పి పంపాలని, వారితో ప్రాణ హానీ ఉందని కూడా సభ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో గొత్తి కోయలు ఇక్కడే ఉంటారా లేక వెల్లిపోతారా అన్నదే మిస్టరీగా మారి పోయింది.