దిశ దశ, హైదరాబాద్:
మేడిగడ్డ బ్యారేజీ ప్రాథమిక నివేదికను విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ రాజీవ్ రతన్ ఆదివారం నీటి పారుదల మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేశారు. అడగడుగునా లోపాలే ఉన్నాయని విజిలెన్స్ అధికారులు తమ దర్యాప్తులో తేల్చారు. 2019లో బ్యారేజ్ ప్రారంభించగా నాలుగు నెలలకే నిర్మాణ లోపాలు వెలుగులోకి వచ్చాయని విజిలెన్స్ నివేదిక తేల్చింది. నిర్మాణం అంతా అయిపోయిన తరువాత బ్యారేజీ అంచాన విలువను అమాంతం పెంచేశారని గుర్తించారు. 2021 సెప్టెంబర్ 6న రూ. 3260 కోట్ల నుండి రూ. 4613 కోట్లకు పెంచేశారని గుర్తించారు. 330 జీఓ ద్వారా 1353 కోట్ల బడ్జెట్ ను ఒక్కసారిగా పెంచడం జరిగిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే బ్యారేజ్ పూర్తియన విషయంలో గందరగోళం నెలకొందని విజిలెన్స అధికారులు గుర్తించారు. దీంతో డిఫెక్ట్ లయాబిలిటీ పీరియడ్ పై అయోమయం నెలకొందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు విజిలెన్స్ అధికారులు. బ్యారేజ్ పూర్తయినట్టు మూడు సార్లు ధృవీకరణ పత్రాలు ఇచ్చిన అధికారులు… మరో వైపున బ్యారేజీలో టెక్నికల్ సమస్యలు ఉత్పన్నం అయ్యాయని వాటిని బాగు చేయాలంటూ నిర్మాణ సంస్థకు లేఖలు రాశారు. దీంతో బ్యారేజీ పూర్తి కాలేదని భావించాల్సి వస్తుండగా ఇంజనీరింగ్ అధికారులు మూడు సార్లు కూడా వర్క్ కంప్లీటెడ్ అంటూ సర్టిఫికెట్ జారీ చేయడం విచిత్రంగా మారిందంటున్నారు. బిల్లులు చెల్లింపు విషయంలో అయినా, పెరిగిన ధరలకు అనుగుణంగా ఎస్టిమేట్ల రివైజ్ చేయడంలో అయినా, వర్క్ పీరియడ్ ను పొడగించడమే అయినా ఇలా చాలా విషయాల్లో కూడా నిభంనదలు ఉల్లంఘించారని విజిలెన్స్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఆరు సార్లు నిర్మాణ గడువును పెంచారని కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టకపోవడంతో వాటర్ ఫ్లోటింగ్ వల్ల బ్యారేజీపై తీవ్రమైన ఒత్తిడి కూడా పడిందని కూడా తేల్చినట్టుగా సమాచారం. మేడిగడ్డ విషయంలో ఇరిగేషన్ అధికారుల తప్పిదాలు కూడాకనిపిస్తున్నాయని, ఇందుకు నిర్మాణ కంపెనీ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్న అభిప్రాయాన్ని విజిలెన్స్ చెప్పకనే చెప్పినట్టుగా తెలుస్తోంది.
ఎల్ అండ్ టి ఝలక్…
మరోవైపున మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ కంపెనీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఈ బ్యారేజీ విషయంలో తమ తప్పిదమేమి లేదని రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం గడువు కూడా ముగిసిందని గుర్తు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఎదురైన సమస్యను పరిష్కరించేందుకు అవసరమయ్యే నిధులు తాము వెచ్చించబోమని మరో సారి కుండబద్దలు కొట్టినట్టుగా తెలుస్తోంది.