పొడిగిస్తారా… బ్రేకేస్తారా..?

ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్

ముగిసిన పదవి కాలం

దిశ దశ, హుజురాబాద్:

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు స్కీం అమలుతో పాటు దళితుల ఆర్థిక పురోభివృద్ది కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పోరేషన్ కు కొత్త ఛైర్మన్ ను నియమిస్తారే పాత వారినే కంటిన్యూ చేస్తారా అన్న చర్చ సాగుతోంది. ఇటీవలే ఛైర్మన్ పదవి కాలం ముగిసినందున ఆ స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు అధినేత మొగ్గు చూపుతున్నారా లేక పాత ఛైర్మన్ నే కొనసాగిస్తారా అన్నదే అంతు చిక్కకుండా పోతోంది. హుజురాబాద్ ముఖచిత్రాన మారిన సమీకరణాల నేపథ్యంలో ఇక్కడి నాయకులకే అధిష్టానం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. హుజురాబాద్ బై పోల్స్ సమయంలోనే దళిత బంధు స్కీంను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో పాటు హుజురాబాద్ కు చెందిన బండ శ్రీనివాస్ ను ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ గా నియమించారు. మొదటి సారి రెండేళ్ల పాటు కమిటీ పదవి కాలం పూర్తి కాగానే బండ శ్రీనివాస్ కు మరో ఏడాది పాటు ఛైర్మన్ గా అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే రెండో సారి ఇచ్చిన పీరియడ్ కూడా ముగియడంతో మళ్లీ ఆయనకే అవకాశం ఇస్తారా లేదా అన్న విషయంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో కొత్త వారికి అవకాశం ఇచ్చి ఆ ప్రాంతంలో ప్రభావితం చేసేందుకు ముఖ్యమంత్రి ఆసక్తి చూపుతారా లేక… హుజురాబాద్ కే మరో సారి ఛాన్స్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతారా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే హుజురాబాద్ ప్రాంత వాసులకు ఎక్కువ నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టినా సానుకూల ఫలితాలు రాలేదన్న విషయం అధిష్టానం మదిలో ఉంది. వచ్చే ఎన్నికల్లో ఈటల ప్రాభావాన్ని గణనీయంగా తగ్గించాలన్న ఎత్తులతో ముందుకు సాగుతున్న అధిష్టానం మరో అవకాశం కూడా ఇక్కడి బలమైన దళిత నేతకు ఇచ్చి రాజేందర్ పై పై చేయి సాధించేందుకు వ్యూహం రచిస్తుందా అన్న కోణంలో కూడా చర్చలు సాగుతున్నాయి. ఇతర ప్రాంతాల్లోని దళితుల నాయకులకు కూడా ప్రాధాన్యత ఇవ్వనట్టయితే వారూ ఫీలయ్యే అవకాశాలు ఉంటాయని గమనించి అక్కడి నాయకులు ఎస్సీ కార్పోరేషన్ పదవి కట్టబెడ్తారా లేక ఎన్నికలు ముగిసే వరకు ఇలాగో హోల్డ్ లో పెట్టి ఆ తరువాత కొత్త ఛైర్మన్ ను నియమిస్తారా అన్న కోణంలోనూ చర్చలు సాగుతున్నాయి.

You cannot copy content of this page