దిశ దశ, హైదరాబాద్:
ప్రత్యర్థి చేసిన యాగం ఫలించినట్టా..? తాను చేసిన యాగం విఫలం అయినట్టా అన్నదే అంతు చిక్కకుండా పోయింది బీఆర్ఎస్ అధినేతకు. అట్టహాసంగా రాజశ్యామల యాగం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోవడం ఏంటన్నది అంతు చిక్కడం లేదు. శత్రు పతనం కోసం చేసిన సుబ్రమణ్య యాగం కూడా ఫలించకపోవడమూ మింగుడు పడకుండా పోయింది.
మొదట కేసీఆర్…
రాజ్యాధికారం కోసం రాజ శ్యామల యాగం చేయడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. 2014 ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయిత చండీ యాగంతో పాటు రాజ శ్యామల యాగం నిర్వహించారు. 2018 ఎన్నికల్లో తిరిగి అధికారం చేజిక్కించుకోవడంలో సఫలం అయిన సంగతి తెలిసిందే. అయితే తాజా ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో ప్రత్యేకంగా రాజశ్యామల, సుబ్రమణ్య యాగాలు నిర్వహించారు. రాజశ్యామల యాగంతో తిరిగి అధికారంలోకి రావాలని, సుబ్యమణ్య యాగంతో శత్రువు పతనం అవుతాడని పండితులు చెప్తున్నారు. తమిళనాడులో సుబ్రమణ్య యాగం చేయడానికి అతి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఇదే లక్ష్యంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ యాగం నిర్వహించి ఉంటాడని భావించి ఉంటారని అయితే అంచనాలు తలకిందులు చేస్తూ తెలంగాణ ప్రజలు తీర్పు ఇవ్వడమే ఎలా జరిగింది అన్నదే మిస్టరీగా మారింది. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైన కొద్దిరోజులకే కేసీఆర్ ఈ యాగాలు నిర్వహించారు. అయినప్పటికీ ఆయన తిరిగి ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయలేకపోయారు.
చివరి సమయంలో రేవంత్ రెడ్డి…
పోలింగ్ సమీపిస్తున్న క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజశ్యామల యాగం నిర్వహించారు. రాష్ట్రంలో అధికారం చేపట్టాలన్న తలంపుతో రేవంత్ రెడ్డి కూడా ఈ యాగం నిర్వహించారు. ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు కూడా రాజ శ్యామల యాగంతో పాటు చండీ హోమాలు నిర్వహించారు. వీరిలో చాలామంది కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నికైనప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోయింది.
ప్రజా వ్యతిరేకతను…
అయితే రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను మాత్రం యాగాలు అధిగమించలేకపోయాయన్నది వాస్తవం. ప్రజా క్షేత్రంలో వైఫల్యం చెంది యాగాలతో అధికారం వస్తుందని భావించడమే అసలు తప్పిదమన్న వాదనలు వినిపిస్తున్నాయి. పబ్లిక్ పల్స్ ను గుర్తించడంలో విఫలం కావడం… దీనిని కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మల్చుకోవడంలో సక్సెస్ అయింది. అయితే ప్రజలకు తమపై సానుకూలత ఉందన్న భ్రమల్లో తిరగడం వల్లే అధికారాన్ని కోల్పోయారన్నది వాస్తవం.