ఈడీ ఆరా తీసేదిదేనా…
వంద కోట్ల లిక్కర్ స్కాం వ్యవహారంలో ఉన్న స్పిరిట్ ఎవరిది… ఇండో స్పిరిట్ కంపెనీలో లావాదేవీలు ఏంటీ అన్న విషయాలపై ఈడీ కులంకశంగా కవితను విచారించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. శనివారం విచారణకు హాజరవుతానని ఈడీకి కవిత లేఖ రాసినప్పటికీ అధికారుల నుండి ఇంకా స్పందన రాలేదు. గురువారం మద్యాహ్నం వరకు కవిత విచారణ విషయంలో ఈడీ నుండి స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే లిక్కర్ స్కాం విషయంలో ఈడీ ఏఏ అంశాల్లో కవితను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయన్న విషయంపై చర్చలు సాగుతున్నాయి. రూ. 100 కోట్ల వ్యవహారంతో పాటు అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు, అభిషేక్ సహా పలువురు లిక్కర్ కేసు నిందితులతో కవితకు ఉన్న సంబంధాల గురించి ఈడీ ఆరా తీయనున్నట్టు సమాచారం. ఇండో స్పిరిట్ కంపెనీలో వాటాలు, లిక్కర్ పాలసీ ఎలా ఉండాలోనన్న విషయంపై జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారా లేదా అని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ముడుపులు చేతులు ఎలా మారాయి, ఫోన్లు మార్చడం, ఫేస్ టైంలో మాట్లాడిన అంశాలు, సౌత్ గ్రూపుతో కలిసి ఎన్నిసార్లు సమావేశాలు అయ్యారు, ఎక్కడ ఎక్కడ కలిశారు..? తదితర అంశాల గురించి కూడా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ కు రూ. కోటి, ఇండియా ఏ హెడ్ సంస్థకు రూ. 70 లక్షలు బదిలీ చేసిసి విషయం గురించి, ప్రైవేట్ చాపర్స్ లో ప్రయాణాలు ఇలా విభిన్న కోణాల్లో ఈడీ విచారణ చేయనున్నట్టు సమాచారం. అసలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి ముఖ్య కారకులు ఎవరు..? ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి ఎలా తెలిసింది, మీరు ఎందుకు ఈ వ్యవహారంతో సంబంధాలు పెట్టుకోవల్సి వచ్చింది అన్న వివరాలపై ఈడీ దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. సౌత్ గ్రూప్ గుట్టు విప్పేందుకు ఈడీ శతవిధాల ప్రయత్నించే అవకాశాలే ఉన్నాయని, ఇప్పటికే ఖచ్చితమైన ఎవిడెన్స్ లు సేకరించిన ఈడీ ఆమెను విచారించే విషయంలో పకడ్భందీగా వ్యవహరించనున్నట్టు సమాచారం.
సీబీఐ టు.. ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో మొదట సీబీఐ కేసు నమోదు చేసింది. 2022 ఆగస్టు 17న సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ 177/a120/b, 7 of pc act కింద ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు మొత్తం 11 మంది అరెస్ట్ కాగా సౌత్ గ్రూప్ కు చెందిన అభిషేక్ బోయినపల్లి, మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, ముత్తా గౌతమ్, గోరంట్ల బుచ్చి బాబు, అరుణ్ రామచంత్ర పిళ్లైలు అరెస్ట్ అయ్యారు. బుధవారం నాడు ఈడీ సెక్షన్ 50 ఆఫ్ పీఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం నోటీసులు ఇవ్వగా మనీ ల్యాండరింగ్ గురించి విచారించనుంది. అయితే ముందుగా పిళ్లైని, కవితను వేర్వేరేగా విచారించే ఈడీ ఆ తరువాత ఇద్దరిని ముఖాముఖిగా కూడా ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఒక వేళ కవితను ఈడీ అరెస్ట్ చేసినట్టయితే మళ్లీ కస్టడీకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే ఈడీ ఎపిసోడ్ కొనసాగుతున్న క్రమంలోనే సీబీఐ కూడా తాను నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఉటంకిస్తూ కస్టడీకి ఇవ్వాలని కోరుతు పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. అటు ఈడీ, ఇటు సీబీఐ రెండు జాతీయ దర్యాప్తు సంస్థలు వేర్వేరుగా విచారించి ఆ నివేదికలను కోర్టుకు సమర్పించనున్నాయి.