తాళం వేసితిమి… ‘చేతులు’ మరిచితిమి..?

తాళాలు పని చేయడం లేదు: కలెక్టర్

ధర్మపురి కౌంటింగ్ రికార్డ్స్ వ్యవహారం

దిశ దశ, స్పెషల్ కరస్పాండెంట్:

ఎలక్షన్ పిటిషన్ వేసి ఉన్న ధర్మపురి కౌంటింగ్ రికార్డుల వ్యవహారం విషయంలో అధికారుల వైఫల్యం ఉందా…? తాళం చేతులు మాయం కావడం వెనక ఆంతర్యం ఏంటీ..? కోర్టు ఆదేశాలు వచ్చినా ముందుగా అప్రమత్తం కాలేదెందుకు..? తీరా వేళకు హడావుడి చేయడం ఏంటీ అన్న చర్చే తీవ్రంగా సాగుతోంది. జగిత్యాల జిల్లా అధికారుల తీరుపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

వివరాలు వెల్లడిస్తున్న జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా

అసలేం జరుగుతోంది..?

ఇటీవలే జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న యాస్మిన్ భాషకు ధర్మపురి కౌంటింగ్ రికార్డుల వ్యవహారం ఓ రకంగా తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికార యంత్రాంగం వైఫల్యం ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఆమె సమాధానం చెప్పాల్సిన పరిస్థితి తయారైంది. వీఆర్కే కాలేజీలో ఈపీ ఫైల్ అయి ఉన్న ధర్మపురి కౌంటింగ్ కు సంబంధించిన రికార్డులను స్టోర్ చేశారు. ప్రత్యేకంగా సీజ్ చేసి ఉంచిన ఈ గదులకు సంబంధించిన తాళం చేతులను కూడా అత్యంత భద్రంగా ఉంచాల్సి ఉన్నప్పటికీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు స్పష్టం అవుతోంది. కలెక్టర్ యాస్మిన్ భాషా మాత్రం తాళం చేతులు మాయం కాలేదని తాళాలు ఓపెన్ కావడం లేదని అంటున్నారు. అయితే ఇందులో 786051 నెంబర్ గల కీ కలెక్టర్ వద్ద లేదని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపిస్తున్నారు. అయితే సోమవారం తాళాలు ఓపెన్ కానట్టయితే బ్రేక్ చేయాలన్న ఆలోచనలో కూడా యంత్రాంగం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. లాక్స్ బ్రేక్ చేసే టెక్నికల్ వ్యక్తిని కూడా ప్రత్యేకంగా పిలిపించి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారంటే తాళం చేతులు అదృశ్యం కావడం వల్లేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐదేళ్లుగా తాళాలు తీయకపోవడం వల్ల లాక్స్ బ్రేక్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని ముందు జాగ్రత్త చర్యగా తీసుకొచ్చామని అధికారులు చెప్తున్నప్పటికీ ఇదే స్ట్రాంగ్ రూంకు సంబంధించిన వేరే లాక్స్ ఓపెన్ అయినందున అవి బాగానే ఉన్నాయని తేటతెల్లం అవుతోంది. ఆదివారం హాడావుడిగా జగిత్యాల కలెక్టరేట్ తో పాటు ఇతర మండలాలకు సంబంధించిన రెవెన్యూ కార్యాలయాల్లో కూడా తాళం చేతుల కోసం గాలించినట్టుగా ప్రచారం జరుగుతోంది. కోర్టు పరిధిలో ఉన్న అంశాల్లోనూ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటోనన్నదే మిస్టరీగా మారింది. అంతేకాకుండా మరో ఈవీఎం స్ట్రాంగ్ రూంలో కూడా ఒకటి రెండు మిషన్లు దొరకకపోవడం అప్పటి అధికారులు అదుర్దాపడి పోయారు. ఆ తరువాత అదే హాల్లో ఇతరత్ర వస్తువుల కింద దొరికినట్టు తెలుస్తోంది. అంటే ఎన్నికలకు ప్రక్రియకు సంబంధించిన ఈవీఎంల స్ట్రాంగ్ రూంల విషయంలో ఈ జిల్లాలో నిర్లక్ష్యం సాధారణమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

స్ట్రాంగ్ రూం వద్ద మీడియాతో మాట్లాడుతున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్

బాధ్యులు ఎవరు..?

తాళం చేతులు పోయినా, టెక్నికల్ సమస్యతో తాళాలు ఓపెన్ కాకపోయినా హై కోర్టుకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాత్రం జిల్లా యంత్రాంగంపైనే ఉంటుంది. కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాత్రం ఖచ్చితంగా జిల్లా అధికారుల వైఫల్యాలను ఎత్తి చూపడమే కాకుండా కీ నెంబర్లను కూడా ఊటంకిస్తూ కోర్టుకు విన్నవించే అవకాశాలు ఉన్నాయి. దీంతో అధికార యంత్రాంగం తీరును కోర్టు తప్పు పట్టే అవకాశాలు లేకపోలేదు. నిజంగానే తాళాలు పోయినట్టు రుజువు అయితే మాత్రం ఎన్నికల కమిషన్ కూడా జిల్లా అధికార యంత్రాంగానికి శ్రీముఖాలు అందజేసే అవకాశాలు లేకపోలేదు. ఈసీఐ నిభందనల ప్రకారం బాధ్యులైన వారిపై క్రమ శిక్షణా చర్యలకు సిఫార్సు చేసినట్టయితే ఉన్నతాధికారులు విధిగా వారిపై వేటు వేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన విచారణతో పాటు ఇతరాత్ర నివేదికలు కూడా తెప్పించుకుని ఈసీఐ తుది నిర్ణయం తీసుకోవడం కూడా బాధ్యులైన వారికి ఇబ్బందికరంగా మారనుంది.

You cannot copy content of this page