మిస్సింగ్ మిస్టరీ…
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ మాతా శిశు కేంద్రం నుండి అపహరణకు గురైన పసికందు ఆచూకి దొరకబట్టేందుకు పోలీసులు కార్య రంగంలోకి దూకారు. అటు సాంకేతికత ఇటు సమాచార వ్యవస్థల ద్వారా కిడ్నాపర్ ను గుర్తించే పనిలో పడ్డారు. కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ ఆద్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఆ మహిళ ఏఏ ప్రాంతాల మీదుగా వెల్లింది ఎటువైపు వెల్లింది అన్న వివరాలు సేకరిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా సేకరించిన ప్రకారం కిడ్నాపర్ నేరుగా ఆర్టీసీ బస్ స్టేషన్ కు వెల్లగా, ఆమె ప్రయాణించిన ఆటో వాలను కూడా పోలీసులు ట్రేస్ చేశారు. ఈ మేరకు అతన్ని పిలిపించి వివరాలు సేకరించగా సదరు మహిళ తెలుగులో మాట్లాడిందని, జమ్మికుంట గురించి ఆటో డ్రైవర్ ను అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం. అయితే మహిళా కిడ్నాపర్ నిజంగానే జమ్మికుంటకు వెల్లిందా లేక… ఆటో వాలను మిస్ గైడ్ చేసేందుకు ప్రయత్నించిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
టవర్స్ డంప్…
అయితే సీసీ ఫుటేజీ ఆధారంగా ఆర్టీసీ బస్ స్టేషన్ వద్దకు చేరుకున్న ఆ కిడ్నాపర్ కరీంనగర్ వదిలి వెల్లిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. దీంతో ఆమె ఆచూకి లభ్యం అయ్యేందుకు సాంకేతిక సహకారాన్ని అందిపుచ్చుకునే పనిలో నిమగ్నం అయ్యారు పోలీసు అధికారులు. పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న టవర్ డంప్ సిస్టం ద్వారా అనుమానిత నెంబర్లను గుర్తిస్తారు. ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మహిళ మూడు రోజుల పసికందును ఎత్తుకెళ్లినట్టుగా గుర్తించిన పోలీసు అధికారులు ఆ సమయంలో మొబైల్ టవర్లకు సంబంధించిన పూర్తి డాటా సేకరించి అనుమానిత మొబైల్ నంబర్లను గుర్తిస్తారు. ఈ సమయంలో ఆ మొబైల్ నంబర్లపై స్పెషల్ అబ్జర్వేషన్ ఉంచి కిడ్నాపర్ కు సంబంధించిన సెల్ ఫోన్ నంబర్ ను కూడా గుర్తించి ఆరా తీయనున్నారు. ఆటో డ్రైవర్ ను జమ్మికుంట గురించి వాకబు చేసినందున ఆమె అటుగా వెల్లినట్టయితే 11 గంటల సమయం నుండి ట్రైన్లు జమ్మికుంట నుండి వెళ్లాయా ..? అన్న వివరాలు కూడా తెలుసుకోవడంతో పాటు రైల్వే స్టేషన్ ఆవరణలో సీసీ ఫుటేజీని కూడా సేకరించి ఆమె ఆచూకి దొరకబట్టుకునే అవకాశాలు ఉన్నాయి. మరో వైపున కరీంనగర్ లోనూ కిడ్నాపర్ ఆచూకి కోసం గాలిస్తున్నాయి స్పెషల్ టీమ్స్.
వెంటనే అయితే…
ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కిడ్నాప్ అయిన పసికందు విషయం ఆసుపత్రి వర్గాలతో పాటు శిశువు తల్లిదండ్రులు కూడా ఆలస్యంగా గుర్తించారు. దాదాపు గంటన్నర తరువాత శిశువు అపహరణకు గురైందన్న విషయాన్ని గమనించి అప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్టయితే కిడ్నాపర్ ఆచూకి సులవుగా దొరికే అవకాశం ఉండేది. కరీంనగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆరా తీస్తే ఎక్కడో ఓ చోట కిడ్నాప్ చేసిన లేడిని పట్టుకునే అవకాశం ఉండేది. కానీ ఆలస్యంగా సమాచారం అందుకోవడంతో పోలీసులు వివిధ రకాలుగా శ్రమించాల్సి వస్తోంది. ప్రధానంగా పదేళ్ల వయసు ఉన్న ఆ బాలుడు అంత మందిలో కూడా కిడ్నాప్ చేసేందుకు వచ్చిన మహిళకే శిశువును అప్పగించడానికి కారణమేంటన్నదే అంతుచిక్కకుండా పోతోంది. శిశువు తండ్రి మనోజ్ రామ్ ను ఆ బాలున్ని విచారించినప్పటికీ పోలీసులకు ఎలాంటి సమాచారం అందనట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ మహిళా కిడ్నాపర్ ఎవరూ..? శిశువును తీసుకెళ్లేందుకు ఎంసిహెచ్ వద్దకు వచ్చి ఎందుకు వెయిట్ చేసింది..? ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే అక్కడకు వచ్చిందా లేక బాలుడి వద్ద ఉన్న శిశువును చూడగానే కిడ్నాప్ చేసేందుకు అప్పటికప్పుడు వ్యూహం రచించుకుందా అన్న విషయం తేలాల్సి ఉంది. లేనట్టయితే కిడ్నాపర్ ఆసుపత్రి ఆవరణలో తచ్చాడుతూ అవకాశం చిక్కకగానే శిశువులను ఎత్తుకెళ్లేందుకు అక్కడకు చేరుకుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సెక్యూరీటీ స్టాఫ్ నిర్లక్ష్యం కూడా ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. అయితే వార్డు, ఐసీయూ, మెయిన్ ఎంట్రన్స్ తో పాటు ఇతర ప్రాంతాల్లో డ్యూటీలో ఉండాల్సిన సెక్యూరిటీ గార్డులు ఎంతమంది ఉన్నారు..? ఏజెన్సీ నియమించాల్సింది ఎంతమందిని..? తదితర వివరాలు కూడా సేకరించి బాధ్యులపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంది.