దిశ దశ, కరీంనగర్:
రౌడీ షీటర్ల మధ్య నెలకొన్న భూ వివాదం కాస్తా హత్యకు దారి తీసిన నేపథ్యంలో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఈ భూమి విషయంలో నెలకొన్న వివాదం పరిష్కరించేందుకు జానీ భాయిని వెంకటష్ కు పరిచయం ఎవరు చేశారన్నదే హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని ఓ మీడియా సంస్థలో కెమెరా మెన్ గా పనిచేస్తున్న వెంకటేష్ కు, నన్నేవేని రమేష్ అలియాస్ జానీ భాయ్ ను ల్యాండ్ డీలింగ్ విషయంలో పరిచయం చేయడం వల్లే కక్షలు పెరిగి హత్యకు దారి తీసింది. రౌడీ షీటర్ గా ఉన్న నన్నేవేని రమేష్ అలియాస్ జానీ భాయికి హైదరాబాద్ లో ఉన్న వెంకటేష్ కు మధ్య రాయబారం నడిపి వీరిద్దరూ మిలాఖత్ అయ్యేలా వ్యవహరించిన తరువాతే ఈ తతంగం అంతా జరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏ1 నిందితుడు జానీభాయి, వెంకటేష్ ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చెందిన వారే అయినప్పటికీ మొదట్లో అంతగా పరిచయం లేదని, ఈ భూమి విషయంలో వీరిద్దరిని పరిచయం చేడయం వల్లే జానీ జోక్యం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
అక్టోపస్ ను మించి…
నీటిలో ఉండే అక్టోపస్ ఎక్కడికైనా వెల్లగలుగుతుందన్నట్టుగానే ఉంది ఏ1 నిందితుని తీరు. వివిధ రకాల ప్రొఫెషనల్స్ తో సాన్నిహిత్యం పెంచుకున్న జానీ భాయి ఏం చేసినా చెల్లుతుందన్న ధీమాతోనే హత్య చేసి ఉంటాడన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వివిధ రంగాల్లో ఉన్న వారితో టచ్ లో ఉంటూ హత్యకు స్కెచ్ వేసిన రమేష్ కు ఆయా రంగాల్లో ఉన్న పరిచయాలను గమనించిన మిగతా గ్యాంగ్ మొంబర్లు హత్య చేసేందుకు తమవంతు సహకారం అందించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
భాయి బయటకు వస్తే…
ఓ వైపున హత్య కేసులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నప్పటికీ రమేష్ కు వ్యతిరేకంగా ఉన్న వారికి హెచ్చరికలు వెల్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు అతనితో స్నేహంగా ఉన్న వారు వివిధ వర్గాల వారిని బెదిరిస్తూ బయటకు రాగానే నిన్ను మళ్లీ వేసేస్తాడని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. భాయి వచ్చిన తరువాత నీ అంతు చూస్తాడని… కొంతమంది జర్నలిస్టులకు కూడా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి తయారైందంటే జానీ భాయికి ఏ స్ధాయి నెట్ వర్క్ ఉందో అర్థం చేసుకోవచ్చు. పచ్చునూరు గ్రామానికి చెందిన కొందరిలో ఇదే రకమైన భయాన్ని జొప్పించినట్టుగా ప్రచారం జరుగుతోంది. వాహనాంతో యాక్సిడెంట్ చేసి చంపేస్తాడంటూ ఒకరిద్దరు వ్యాఖ్యానించారంటే రమేష్ అనుచరుల ధైర్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు.