దిశ దశ, మంచిర్యాల:
రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ అంశంతో ఎవరికి అవకాశం వరిస్తుందో అంతుచిక్కకుండా పోతోంది. రాష్ట్ర మంత్రి వర్గంలో ఇంకా బెర్తులు ఖాళీ ఉన్నందున విస్తరణ జరగక తప్పదు. అయితే ఈ దఫా జరిగే విస్తరణలో అన్నదమ్ములిద్దరిలో ఎవరిని మంత్రి పదవి వరించనుందోనన్నదే తూర్పు ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. నామినేటెడ్ పదవులతో పాటు ఇతర పదవుల పందేరం విషయంలో తుది నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన ఈ అంశాల గురించి కూడా అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో గడ్డం బ్రదర్స్ లో ఎవరూ ముందు వరసలో నిలుస్తారన్న విషయంపైనే క్లారిటీ రావల్సి ఉంది.
పోటా పోటి ప్రయత్నాలు…
మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నుండి వినోద్, చెన్నూరు నుండి వివేక్ లు ఎమ్మెల్యేలుగా గెల్చారు. మొదటి సారి జరిగిన ప్రమాణ స్వీకారం అప్పుడే వీరిద్దరిలో ఎవరో ఒకరికి మంత్రి పదవి వరిస్తుందని ఆశించినప్పటికీ ఇద్దరు కూడా వెనక్కి తగ్గకపోవడంతో ఎవరికీ బెర్త్ కనఫం చేయనట్టుగా తెలుస్తోంది. వివేక్ తనకే అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని అభ్యర్థిస్తుండగా వినోద్ కుడా తనకు ప్రాధాన్యత ఇవ్వాలని అడుగుతున్నారు. దీంతో గడ్డం సోదరులే కాంప్రమైజ్ అయి ఎవరో ఒకరి పేరు ప్రతిపాదిస్తే బావుంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గతంలో చెన్నూరు నుండి వినోద్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే లో్కసభకు వివేక్ ఎన్నికయినప్పటికీ జూనియర్ అయినందున కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం దక్కలేదు. అయితే పెద్దపల్లి లోకసభ అభ్యర్థిగా వివేక్ తనయుడు వంశీ పేరు ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కూడా విస్తృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వివేక్ తనయుడికి కూడా అవకాశం ఇస్తున్నందున మంత్రి వర్గంలో వినోద్ కు బెర్త్ ఖాయం చేస్తే బావుంటుందని స్థానిక కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వివేక్ వ్యవహరించారని ఆయనకు అవకాశం ఇస్తేనే అన్ని విధాల బావుంటుందని అంటున్నారు ఆయన అనుచరులు.
నేను సైతం…
మరో వైపున మంచిర్యాల నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రి వర్గంలో అవకాశం కల్పించాలని ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. గతంలో ఎమ్మెల్సీగా కూడా పనిచేయడంతో పాటు ముఖ్య నాయకులతో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ప్రేమ్ సాగర్ రావుకే వస్తుందన్న అభిప్రాయాలను ఆయన అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మంచిర్యాల జిల్లాలో బుగ్గ కారు ఎవరిని వరిస్తుందోనన్నదే చర్చనీయాంశంగా మారింది.