ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తీరుపై లెక్కలు…
ట్రయాంగిల్ ఫైట్ అంటున్న విశ్లేషకులు
దిశ దశ, కరీంనగర్:
చరిత్ర తిరగ రాసిన పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నాడి ఎలా ఉందో అంచనా వేయడం ఇబ్బందికరంగా మారినట్టుగా ఉంది. గతంలో ఏనాడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచార పర్వం ప్రభంజనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు సాధారణ ఎన్నికలను మరిపించే విధంగా క్యాంపెయిన్ నిర్వహించారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఒంటరి పోరాటం చేసినప్పటికీ టఫ్ ఫైట్ ఇచ్చారు. దీంతో కరీంనగర్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ సాగినట్టుగా స్పష్టం అవుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెజార్టీ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి స్థానికత అంశంతో ఎక్కువ ఓట్లు సాధించారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుండగా నిజామాబాద్ జిల్లాలో బీసీ నినాదం, బీజేపీ వాదం వినిపించినట్టుగా చెప్తున్నారు. ఆదిలాబాద్ పశ్చిమ ప్రాంతంలో బీజేపీ, తూర్పున కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీలు ఓట్లు రాబట్టుకోవడంలో సఫలం అయ్యారని ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ జిల్లాలో బీసీ కార్డుతో హరికృష్ణకు అనుకూలంగా చాలా ప్రాంతాల్లో ఓట్లు పడినట్టుగా తెలుస్తోంది. అయితే రెండు మూడు రోజుల క్రితం వరకు సొంత జిల్లాలలో అంతగా పట్టు నిలుపుకోలేకపోయిన కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి కూడా అనూహ్యంగా తెరపైకి రాగా, బీజేపీ కూడా ఓట్లు చీల్చుకున్నట్టుగానే కనిపిస్తోంది. ఇదంతా కూడా ప్రజా క్షేత్రంలో జరుగుతున్న చర్చల ఆదారంగా మాత్రమే ఓ అంచనా వేస్తున్నప్పటికీ ఆయా పార్టీల అభ్యర్థులు మాత్రం ఎవరికి వారు తమ గెలుపు ఖాయం అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ వాదన ఇలా…
ఓటర్లను నమోదు చేయడంలో తామే టాప్ లో ఉన్నామన్న ధీమా కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డిలో కనిపిస్తోంది. లక్షా 30 వేల వరకు ఓటర్లను నమోదు చేయించామని, అందులో 70 శాతం వరకు ఓటర్లు తమకు అనుకూలంగా వేసి ఉంటారని బావిస్తున్నారు. అలాగే మైనార్టీలు, దళిత ఓటర్లతో పాటు తన కాలేజీలో చదువుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా తమకు మద్దతుగా నిలిచారని అంచనా వేస్తున్నారు. అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో చదివి దేశ, విదేశాల్లో స్థిరపడిన వారంతా కూడా కాంటాక్టులోకి వచ్చి నరేందర్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేశారన్న వాదనలు వినిపిస్తున్నారు. అంతేకాకుండా నాలుగైదు నెలలుగా నియోజకవర్గంలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తూ ఓటర్లను నేరుగా కలిసే ప్రయత్నం చేసిన విషయం కూడా అనుకూలంగా మారుతుందని, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా గెలుపునకు కృషి చేయడం వల్ల సానుకూల పలితాలు వస్తాయని నరేందర్ రెడ్డి లెక్కలు వేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా ప్రచారంలో పాల్గొంటునే గ్రౌండ్ వర్క్ చేసేందుకు తనకు పీఆర్వో వ్యవస్థ కూడా బలంగా ఉండడం ప్లస్ అయిందని, క్షేత్ర స్థాయిలో ప్రతి ఓటరును కూడా వ్యక్తిగతంగా కలిసేందుకు తాను ఏర్పాటు చేసుకున్న టీమ్ కృషి చేసిందని అంటున్నారు. ప్రధానంగా తన ప్రత్యర్థులకు ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు వేసేందుకు సుముఖత వ్యక్తం చేసిన ఓటర్లతో సంప్రదింపులు జరిపి రెండో ప్రాధాన్యత ఓటు వేసేందుకు ఒప్పించుకోవడంలో సఫలం అయ్యానని నమ్ముతున్నారు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. కరీంనగర్, పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న తన పూర్వ విద్యార్థులు కూడా ఓటర్లను కలవడం కూడా కలిసివచ్చే అంశమని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రొఫెషనల్స్ తో ప్రత్యేకంగా సమీకరణాలు జరపడం కూడా ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు.
బీజేపీ అంచనాలు…
భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి కూడా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని చెప్తున్నారు. ప్రధానంగా ప్రధాని మోడీ మానియా, రూ. 12 లక్షల వరకు ఐటీ మినహాయింపు, ఢిల్లీలో విజయం వంటి అంశాలు తీవ్రమైన ప్రబావాన్ని చూపాయని, యువత అంతా కూడా బీజేపీ వైపు మొగ్గు చూపడం కూడా లాబించే విషయంగా చెప్పుకొస్తున్నారు. సొంత జిల్లా అయిన మెదక్ అంతటా కూడా స్థానికత అంశం తీవ్రమైన ప్రభావాన్ని చూపిందని దీనివల్ల ప్రత్యర్థులకు అందనంత ఓటు తనకు వచ్చిందన్న నమ్మకంతో ఉన్నారు అంజిరెడ్డి. ఇదే సమయంలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో కూడా బీజేపీకి అనుకూలంగా ఓటర్లు ఉండడం అత్యంత బలాన్ని చేకూరుస్తుందని ఆశిస్తున్నారు.
బీసీ వాదం…
బలహీన వర్గాల నినాదం చాలా బలంగా పనిచేస్తుందని బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ నమ్ముతున్నారు. సైలెంట్ గా ప్రచారం చేసుకుంటూ వెళ్లిన ఆయన క్యాడర్ లేని పార్టీ తరుపున పోటీ చేసి ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలం అయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. బలం, బలగం అంతగా లేకున్నప్పటికీ హరికృష్ణ గురించి మౌత్ టు మౌత్ పబ్లిసిటీ విపరీతంగా జరిగిందని, బీసీ కార్డు కూడా ప్లే అయిందని బలంగా విశ్వసిస్తున్నారు. చివరి సమయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా తనకు మద్దతు ప్రకటించడం కూడా కలిసివచ్చిన అంశమని చెప్తున్నారు. బీసీ సామాజిక వర్గాలు ఖచ్చితంగా తనను బల పర్చాయన్న అభిప్రాయంతో ఉన్న హరికృష్ణ వ్యక్తిగత ఇమేజ్ అయితే విస్తృత స్థాయిలో పెంచుకోవడం లాభించడం ఖాయమని భావిస్తున్నారు. సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెల్లిన హరికృష్ణ పట్ల అన్ని వర్గాల్లోనూ సానుకూలత కనిపించిందని, తన శిక్షణలో సుశిక్షుతులయిన అభ్యర్థులు కూడా ఊరువాడా కలియ తిరగడం చాలా వరకు లాభిస్తోందని అనుకుంటున్నారు.
రెండో ప్రాధాన్యత…
ట్రయాంగిల్ ఫైట్ కారణంగా 50 శాతానికి మించి తొలి ప్రాధాన్యత ఓట్లు ఏ ఒక్క అభ్యర్థికి రానట్టయితే రెండో ప్రాధాన్యత ఓట్లు అనేవి కలిసి వస్తాయని ముగ్గురు అభ్యర్థులు నమ్ముతున్నారు. హరికృష్ణకు ఫస్ట్ ప్రయారిటీ వేసిన ఓటర్లు తనకు రెండో ప్రాధాన్యత కింద ఓటు వేసి ఉంటారని అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, అంజిరెడ్డిల శిబిరాలు అంచనా వేసుకుంటున్నాయి. అయితే వీరిద్దరికి ఫస్ట్ ప్రయారిటీ వేసిన ఓటర్లంతా కూడా తనకే రెండో ప్రాధాన్యత ఓట్లు వేశారని విశ్వసిస్తున్నారు ప్రసన్న హరికృష్ణ. దీంతో ఈ సారి కౌంటింగ్ లో ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతో స్పష్టత వచ్చే అవకాశం లేదని ప్రధాన అభ్యర్థులు గుర్తించినట్టుగా స్పష్టం అవుతోంది.
సైలెంట్ ఓటింగ్…
అయితే ఓటర్లు పోలింగ్ బూతుల నుండి బయటకు వచ్చిన తరువాత ఫలానా వారికి అనుకూలంగా ఓటు వేశామన్న సంకేతాలు ఇవ్వడంతో అంచనాలు వేస్తున్నప్పటికీ 10 శాతం వరకు సైలెంట్ ఓటింగ్ కూడా పడింది. తటస్థులుగా ఉన్న ఓటర్లు నిశ్శబ్దంగా ఓటు వేయడంతో వారు ఎటు వైపు మొగ్గు చూపారోనన్నదే అంతు చిక్కకుండా పోతోంది. సైలెంట్ ఓటింగ్ గెలుపోటములను శాసించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా కరీంనగర్ పట్ట భద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం అన్ని వర్గాలను ఫలితాలు వచ్చే వరకూ కూడా ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయన్నది మాత్రం వాస్తవం.