దిశ దశ, హైదరాబాద్:
అధికారంలో ఉన్న వారిని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలవడం నేరమా..? ప్రజా స్వామ్యంలో ఇదేమైనా ఘోర తప్పిదమా..? అంతర్గతంగా అనుభందాలు పెనవేసుకుని మంత్రాంగాలు నెరిపే వారికన్నా నేరుగా కలిసే వారు ద్రోహులా..? రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎవరిని వేలెత్తి చూపుతున్నాయి..? తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న ఈ విధానం రాజకీయ నాయకుల క్యారెక్టర్ ను ఏ స్థాయికి దిగజారుస్తున్నాయి..?
వైఎస్ హయాం నుండి…
రాష్ట్రంలో ప్రతి పక్ష పార్టీల ఎమ్మెల్యేలను అధికార పక్షంలోకి చేర్చుకునే సంస్కృతి వైస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాతే ఎక్కువయింది. 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడిని దానం నాగేందర్ ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా టీడీపీ నుండి గెలుపోందారు. అయితే ఆ ఎన్నికల ముందు వరకు కూడా నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ 2004 ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందన్న నమ్మకంతో పచ్చ కండువా కప్పుకుని గెలిచారు. ఉమ్మడి రాష్ట్ర ప్రజలు అనూహ్య తీర్పు ఇవ్వడంతో దానం టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుండి అసిఫ్ నగర్ నుండి పోటీ చేస్తే అక్కడి ఓటర్లు ఆయనను తిరస్కరించారు. ఆ తరువాత తెలంగాణ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వలస పోవడం ఆరంభం అయింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏ ఎమ్మెల్యే ఉద్యమ పార్టీని వీడిపోతారోనన్న ఆందోళన వ్యక్తం అయింది. తన్నీరు హరీష్ రావు కూడా ముఖ్యమంత్రి వైఎస్ ను కలిసి వచ్చిన ఫోటోలు మీడియాకు లీకయ్యాయి. దీంతో ఉద్యమ పార్టీ అంతర్థానం అయిపోవడం ఖాయమన్న సంకేతాలు కూడా ఇచ్చినట్టయింది. తాను మాత్రం సిద్దిపేటలో డిగ్రీ కాలేజీ మంజూరు కోసం సీఎం వద్దకు వెళ్లానని హరీష్ రావు వివరణ ఇచ్చారు. అయినప్పటికీ అధికార పక్షం నుండి వచ్చిన సంకేతాలు కావడం, అప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంతో హరీష్ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. స్వరాష్ట్రం సిద్దించిన తరువాత కూడా ఇదే సాంప్రాదాయం నెలకొంది. రాష్ట్రంలోని కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గులాభి పార్టీ పంచన చేరిపోయారు. అప్పుడు టీడీపీలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్ ను కలిసి వచ్చిన ఫోటోలు వైరల్ కావడంతో ఆయన కూడా పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెల్తున్న సీఎం కేసీఆర్ ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ ప్రాంతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణా రెడ్డిలు కలిశారు. అప్పుడు కూడా సంచలనం అయింది. అయితే శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగినప్పటికీ ఆయనతో వెల్లిన గండ్ర మాత్రం గులాభి కండువా కప్పుకున్నారు. ఆ తరువాత మరియమ్మ లాకప్ డెత్ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎమ్మెల్యేలు భట్టీ, శ్రీధర్ బాబులు కలిసి ఈఘటనపై విచారణ జరిపించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అప్పుడు కూడా సీఎం కేసీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు కలవడం వెనక ఆంతర్యం ఏంటన్న చర్చ సాగింది. కానీ వీరిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడంతో జరిగిదంతా తప్పుడు ప్రచారమేనని తేలిపోయింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఇదే పరిస్థితి తయారైంది. ఇటీవల మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీంఎంను కలవడం, తాజాగా మరో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో మరోసారి పార్టీ ఫిరాయింపుల అంశం చర్చ జరుగుతోంది.
ఆజ్యం పోస్తున్నదెవరూ..?
నియోజకవర్గాల అభివృద్ది విషయంలోనో… ప్రజా సమస్యల విషయంలోనో… సీఎంలను ఎమ్మెల్యేలు కలవడం దీని వెనక ఏదో జరుగుతుందన్న రీతిలో లీకులు ఇవ్వడంతో రాష్ట్రంలో గెలిచిన ఎమ్మెల్యేలపై ప్రజలు విశ్వసించే పరిస్థితి లేకుండా పోతోందన్నది వాస్తవం. ప్రజా సంక్షేమం కోసం అధికార పక్షాన్ని కలవడం నేరం అన్నట్టుగా మారిపోయింది. ఇందుకు తోడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరునెలల్లోనే మారుతుందని, ముఖ్యమంత్రి కేసీఆరే అవుతారని బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికలప్పుడు కూడా ఎవరు గెల్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. ఇలాంటి ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ చావు దెబ్బ తింటుందని బీఆర్ఎస్ భావించినప్పటికీ ఆ పార్టీకే పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. ఒకరకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆరే ఉంటారన్న నమ్మకాన్ని బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రచారంతో కొన్ని వర్గాల ఓటర్లలో అతి నమ్మకం కల్పించినట్టయింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించడానికి ఈ నినాదం కూడా పరోక్షంగా కారణమై ఉంటుందని గులాభి పార్టీ నాయకులు గుర్తించాల్సి ఉంది. ఇలాంటి ప్రచారాల నేపథ్యంలో రేవంత్ రెడ్డిని గద్దె దింపేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేస్తున్న ఎత్తులకు సీఎం పై ఎత్తులు వేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకుంటున్నారా అన్న అనుమానం కూడా వస్తోంది. తాము పెంచి పోషిస్తున్న బీజం తమ పార్టీని కూడా చుట్టుకుంటుందన్న విషయాన్ని విస్మరిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు… తామే మైండ్ గేమ్ ఆడుతున్నామని సంబరిపోతుండడం విస్మయానికి గురి చేస్తోంది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పంచన చేర్చుకున్నట్టయితే… పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్ ప్రోత్సహించిన తీరుపై తెలంగాణ ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి కూడా అదే రీతిలో తీర్పునిచ్చే ప్రమాదం లేకపోలేదన్నది గుర్తు పెట్టుకోవల్సి ఉంది.