బాధలు ఎవరివి..? బాధ్యులెవరూ..?

టెన్త్ పేపర్లు బయటకు రావడం వెనక..?

దిశ దశ, స్పెషల్ కరస్పాండెంట్:

వందకు వంద శాతం రిజల్ట్ రావాలి, 10/10 జీపీఏ సాధించాలి విద్యాశాఖాధికారులు క్షేత్ర స్థాయిలో పనిచేసే ఉపాధ్యాయుల ముందు ఉంచే లక్ష్యం ఇది. ఇందు కోసం పది పరీక్షలు వస్తున్నాయంటే చాలు విద్యాశాఖ అధికారులు రివ్యూలు పెట్టడం మౌఖిక ఆదేశాలు ఇస్తుండడం కామన్ గా మారిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా విద్యాశాఖలో ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. దీంతో ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు చేపట్టిన వారు పరీక్షలకు హాజరైన విద్యార్థులు మాల్ ప్రాక్టీసుకు పాల్పడుతున్నారా అన్న విషయాన్ని విస్మరించే పరిస్థితికి చేరుకున్నారన్నది నిజం. విద్యా ప్రమాణాలు పెంచేందుకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేర్పులు చేసి నేటి తరానికి అనువుగా ఉండే విధంగా విద్యా బోధన చేయాల్సిన విషయాలను విస్మరిస్తున్న ప్రభుత్వం పాస్ పర్సెంటేజీని మాత్రం పెంచాలని చెప్పడం వెనక ఆంతర్యం ఏంటీ..? ప్రైవేటు విద్యా వ్యవస్థకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాల్సిన అంశాన్ని పక్కనపెట్టేసి లక్ష్యాలను నిర్దేశించడానికి కారణాలు ఏంటీ..? వాస్తవికతను పక్కన పెట్టేసి నేల విడిచి కర్ర సాము చేసిన విధంగా ఉపాధ్యాయులపై పాస్ పర్సెంటేజీ వంద శాతం ఉండాలి 10 జీపీఏ ఎక్కువ మంది సాధించాలన్న టార్గెట్స్ పెట్టడం సరైన పద్దతేనా అన్నది చర్చించాల్సిన విషయం. మౌళిక వసతులను కల్పించడం, టీచర్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై దృష్టి సారించకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటన్నది గమనించాలి. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ పాస్ గురించి ఎందుకు ప్రత్యేక శ్రద్ద చూపుతోంది..? క్వాలిఫైడ్ అయిన వాళ్ల సంఖ్య టాప్ లో ఉంటే క్రెడిట్ రావడం తప్ప ఏం లాభం ఉంటుంది. కానీ 10లో వంద శాతం ఉత్తీర్ణత కావాలన్న లక్ష్యానికి కారణంగా ప్రైవేటు కాలేజీలను పెంచి పోషించేందుకునేనన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఇంటర్ కాలేజీలు బోటాబోటిగా ఉండడంతో టెన్త పాస్ అయిన విద్యార్థుల చూపు ప్రైవేటు వైపు ఉంటుందన్న కారణంతోనే ఈ విధమైన టార్గెట్స్ పెడుతున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నవారూ లేకపోలేదు.

లక్ష్యం చేరేందుకు…

సంస్కారంతో కూడిన విద్యనందించి క్రమశిక్షణ కల్గిన విద్యార్థులను తీర్చిదిద్దిన సార్లే 10వ తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సర్కారు నిర్దేశించిన లక్ష్యం చేరుకోవాలంటే మెరిట్ స్టూడెంట్స్ ను వదిలేసి వీక్ గా ఉన్న విద్యార్థులకు అవసరమైన సమాధానాలు పంపించాల్సిన దుస్థితి తయారైంది నేటీ ఉపాధ్యాయలోకానికి. ఓ వైపు మానసిక సంఘర్షణకు గురవుతూ, మరో వైపున విద్యాశాఖ ఉన్నతాధికారుల నుండి తాఖీదులు అందుకోకూడదన్న ఆందోళనతో పంతుల్లే పక్కదారులు తొక్కాల్సి రావడం దురదృష్టకరం. కొన్ని చోట్ల అయితే సబ్జెక్ట్ టీచర్లకు ఇన్విజిలేషన్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అతన్ని ఓ డెన్ లో కూర్చోబెట్టి ప్రశ్నలకు సమాధానాలు రాసి పంపించాల్సి వస్తోంది సార్లకు. 20 ఏళ్ల క్రితం అబ్జెక్ట్ పేపర్ సమాధానాలు చెప్పేందుకు కూడా సంశయించిన ఉపాధ్యాయలోకం నేడు మాత్రం తమలోని సంస్కారాన్ని చంపేసుకుని మరీ చీటీలు అందించే స్థాయికి దిగజారి పోయారన్నది వాస్తవం కాదా..? క్రియేటివిటీతో విద్యనందించి స్టూడెంట్స్ కు విద్య యెక్క గొప్పతన గురించి వివరించి వారిని ఆదిశగా ముందుకు నడిపించాల్సిన పంతుళ్లు నేడు మాత్రం పరీక్షలు పాస్ చేయిస్తే చాలు గండం గట్టెక్కినట్టేనని సంబరపడిపోతున్న పరిస్థితులు తయారు అయ్యాయన్నది మాత్రం నిజం కాదా..? ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో ఎగ్జామ్ జరిగే పేపర్ ఇన్విజిలేటర్ల చేతికి వెళ్లకముందే బయటకు వచ్చేసి ఏంచక్కా సమాధానలను నింపుకుని మరీ సెంటర్ లోకి వెల్తున్నది నిజమా అబద్దామా అన్నది తేల్చాలి. ఇలాంటి పరిస్థితుల్లో 10వ తరగతి పరీక్షా పేపర్ లీక్ అవడమే అయినా మాల్ ప్రాక్టీస్ కావడమే అయినా కామన్ గా మారిపోయింది. ఈ సారి పదో తరగతి పరీక్షలకు ముందు గ్రూప్స్ ఎగ్జామ్స్ పేపర్లు లీక్ కావడం, ఈ విషయంలో సిట్ దర్యాప్తు, ఈడీ ఎంట్రీ కావడంతో టెన్త్ పేపర్ల లీకేజీకి ప్రాధాన్యత లభించింది తప్ప ఏటా జరుగుతున్న తంతే కాదా అన్న భావన ప్రతి ఒక్కరిలో నెలకొంది. వరసగా రెండో రోజు కూడా పేపర్ సోషల్ మీడియా వేదికగా లీకయిందని జరుగుతున్న ప్రచారం జరగడం నిజామా కాదా అన్న విషయం అలా ఉంచితే కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండాల్సిర పేపర్ లీక్ ఎలా అయిందన్నదే తేలాల్సి ఉంది. అయితే పేపర్ సదరు ఉపాధ్యాయుడు బయటకు పంపడానికి కారణమేంటీ అన్న విషయం ఆలోచించాల్సి ఉంది. లక్ష్యాన్ని నిర్దేశించడంతో తామెందుకు శ్రీముఖాలు అందుకోవడం, అందరి ముందు తల వంచుకుని బ్రతకడం అనుకున్న మాస్టార్లే మాల్ ప్రాక్టీస్ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. గతంలో కొన్ని చోట్ల మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయిన సంఘటనల్లోని టీచర్ల లోపలి మనిషిని టచ్ చేస్తే ఈ వాస్తవాలన్ని వెలుగులోకి రావడం ఖాయం.

అమెరికాలో ఎలా అంటే..?

ప్రపంచానికే పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాలో 15 నుండి 18 ఏళ్లకు చేరిన వారు స్వీయ ఉపాధి మార్గాలకు వెళ్లాల్సి ఉంటుంది. పేరెంట్స్ కూడా వాళ్లను సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ చేసుకుంటూ చదువుకుంటావో ఉపాధి పొందుతావో నీ ఇష్టం అని బయటకు పంపిచేస్తారు తమ సంతానాన్ని. దీంతో తల్లిదండ్రుల నీడన పెరిగిన ఆ బిడ్డలు ఉపాధి మార్గాలు వెతుక్కుంటూ చదువుకుంటుంటారు. దీనివల్ల చాలా మంది ఉన్నత విద్యను అందుకోలేని పరిస్థితులు లేవని తెలుస్తోంది. అక్కడ 35 శాతం లోపు వరకే డిగ్రీలు సాధిస్తున్నారని నివేదికలు చెప్తున్నాయి. జనాభా చాలా తక్కువగా ఉండే అగ్రరాజ్యంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే జనాభాలో ప్రపంచంలో టాప్ లో ఉన్న భారత దేశంలో మాత్రం 10 పాస్ కావాలన్న లక్ష్యాలను పెట్టి సార్లను ఒత్తిళ్లకు గురి చేయడం ఎందుకు అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. అన్ని విద్యాలయాలను శాంతినికేతన్ లా తీర్చిదిద్దకున్నా స్కూళ్లకు వెల్లిన విద్యార్థులను మెరిట్ అనే కభంద హస్తాల్లో తయారు చేసే విధానానికి స్వస్తి పలికి వారిలో చదువుకోవాలన్న ధ్యాస కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులతో పాటు చదువుకుంటున్న బడిలో సగటు విద్యార్థిని కావచ్చు వెనకబడ్డ విద్యార్థినీ కావచ్చు ఎంకరేజ్ చేసే పరిస్థితులు ఉంటే తప్ప సర్కారు నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోలేమన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

You cannot copy content of this page