అంతర్మథనంలో కరీంనగర్ జర్నలిస్టులు…
దిశ దశ, కరీంనగర్:
యూనియన్ ఎన్నికలప్పుడు కీలకంగా వ్యవహరించే సాధారణ జర్నలిస్టులపై చిన్న చూపు చూడడం తగునా..? నివేశనా స్థలాల విషయంలో వృత్తితో సంబంధం లేని వారికి ప్రాధాన్యత కల్పించడం సబబేనా..? ప్లాట్లు వచ్చాయన్న సంబరంతో నిలువ నీడ కోసం అప్పులు చేసిన తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. సంబంధం లేని వ్యక్తులకు లబ్ది చేకూర్చడంతో తమకు తీరని అన్యాయం జరిగిందని… ఇప్పుడు పట్టాలను రద్దు చేయడంతో తమ పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల దీనావస్థ…
దశాబ్దాల తరబడి జర్నలిజంతోనే మమేకమైన తమకు అన్యాయం చేసే విధంగా వ్యవహరించిన తీరుపై వాస్తవాలు వెలుగులోకి రావల్సిందేనని అంటున్నారు కరీంనగర్ కలం యోధులు. పెద్ద పత్రికల ముసుగులో జర్నలిజంతో ఏ మాత్రం సంబంధం లేని వార్లకు ప్లాట్లు కెటాయించడం వెనకున్న వారు తమ వైఖరిని మార్చుకోవలాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత జర్నలిస్టులు. కరీంనగర్ లోనే ఉంటూ ఏళ్ల తరబడి వార్త సేకరణలో రిపోర్టర్లు, వీడియోలు, ఫోటోల చిత్రీకరణలో కెమెరా మెన్లు అలుపెరగకుండా పని చేస్తుంటే జర్నలిస్టు సమాజంతో సంబంధం లేని వారికి ప్లాట్లు కెటాయించడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న వారి సిన్సియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా సీనియారిటీ అంశాన్ని లేవనెత్తి… పెద్ద పత్రికల్లో పని చేసిన వారికి మాత్రం అనతి కాలంలోనే ప్లాట్లు కెటాయించడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే ఉంటూ, ఇక్కడే జీవనం సాగిస్తూ జర్నలిజంతో మమేకమైన తమ విషయంలో సీనియారిటీ వంక చూపించిన వారు పెద్ద పత్రికల్లో పనిచేస్తున్న వారి విషయంలో ఎందుకు విస్మరించారని అడుగుతున్నారు. వడ్డించే వాడు మనవాడైతే బంతిలో ఏ మూలన కూర్చున్నా పరిపూర్ణమైన భోజనం దొరుకుతుందన్న నానుడి మాదిరిగానే కరీంనగర్ ప్లాట్ల కెటాయింపు తీరు సాగిందని విమర్శిస్తున్నారు. పెద్ద పత్రికల్లో పని చేస్తున్న వారికి వేలల్లో జీతభత్యాలు ఉంటాయని కానీ సామాన్య రిపోర్టర్లకు ఆయా సంస్థలు ఇచ్చే సొమ్ము నామమాత్రమేనన్నది అందరికీ తెలిసిందే అయినా వారికి ప్రాధాన్యత కల్పించి తమకు అన్యాయం చేయడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు. సంస్థలతో సంబంధం లేని వ్యక్తుల పేర్లు ఎలా చేర్చారని అడిగితే వారికి బీఆర్ఎస్ కోటాలో ఇచ్చారని ప్రచారం చేస్తున్నారని, అలాంటప్పుడు జాబితాలో వారు పత్రికకు ప్రాతినిథ్యం కల్పిస్తున్నట్టుగా ఎలా పేర్కొన్నారంటూ మండిపడుతున్నారు. బీసీ సంఘాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారి కుటుంబ సభ్యుల పేర్లు ఓ దినపత్రికలో పని చేస్తున్నట్టుగా రాయించడం వెనక ఉన్న కుట్రను బహిర్గతం చేయాలని కోరుతున్నారు. తప్పించుకునేందుకు అప్పటికప్పుడు ఏదో ఒక సమాధానం చెప్పున్నారు తప్ప తప్పిదాలను సవరించుకునే ప్రయత్నం ఎందుకు చేయడం లేదో అంతు చిక్కడం లేదని వాపోతున్నారు. జర్నలిజంతో సంబంధం లేని వారి పేర్లు జాబితాలో చేర్చిన తరువాత వారిపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు పెద్దలు చొరవ తీసుకోకపోవడానికి కారణమేంటో చెప్పాలని చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆ ప్రచారం వెనక..?
ఇకపోతే జర్నలిస్టులకు ప్లాట్లు కెటాయించిన వెంటనే నివేశన స్థలాలు ఉంటాయో పోతాయోనన్న ఆందోళనను రెకెత్తించిన తీరు అందరినీ విస్మయపరుస్తోంది. జర్నలిస్టులకు కెటాయించిన ప్లాట్లలో ఇల్లు కానీ షెడ్డు కానీ నిర్మించుకుని ఇంటి నంబర్ తీసుకున్నట్టయితే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్న ప్రచారం పెద్ద ఎత్తున చేసినట్టుగా తెలుస్తోంది. జర్నలిస్టులకు ఇచ్చిన ప్లాట్ల విషయంలో అధికారులు నిర్ణయాన్ని మార్చుకుంటారన్న విషయం ముందే తెలిసి ఈ ప్రచారానికి తెర లేపారా లేక ఆయా ప్లాట్లలో నిర్మాణం చేపట్టేందుకు కాంట్రాక్టులు ఇప్పించుకుని లాభాలు పొందేందుకు వ్యూహాలు రచించారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే తమకు కెటాయించిన ప్లాట్లు రద్దవుతాయేమోనని ఓ ఎలక్ట్రానికి మీడియా కెమెరా మెన్ తనవద్ద డబ్బులు లేకపోవడంతో స్థానికంగా ఉన్న మహిళా సంఘాల వద్ద అప్పు తీసుకుని షెడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గడువు ముగియడంతో సంఘాల ప్రతినిధులు డబ్బుల చెల్లించాలని నిలదీయడంతో చివరకు తన బార్య మెడలో ఉన్న బంగారన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకుని మహిళా సంఘాలకు చెల్లించాడంటే అతని దయనీయమైన పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దుర్భర పరిస్థితులు మరికొంతమంది జర్నలిస్టులు కూడా ఎదుర్కొంటున్నప్పటికీ బయటకు చెప్పుకోలేక బాధను దిగమింగుకుని బ్రతుకుతున్నారు. ప్రభుత్వం మారిన తరువాత ఆ ప్లాట్లు రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించడంతో తమ బ్రతుకు ఆగమ్యగోచరంగా మారిపోయిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు జర్నలిస్టులు.
బీపీఎల్ అయితే…
మరో వైపున బీపీఎల్ కోటాలో మహిళలకు ప్లాట్లు కెటాయించారని ప్రచారం చేస్తున్న తీరును కూడా తప్పు పడుతున్నారు జర్నలిస్టులు. దారిద్రరేఖకు దిగువన ఉన్న వారికి ఇవ్వాల్సిన కోటాలో నివేశన స్థలాలు కెటాయించినట్టయితే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి కుటుంబ సభ్యులకు ఎలా అలాట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. జర్నలిస్టు కోటాలో భూములు ఇప్పించినట్టయితే ఈ సమస్య ఎదురయ్యేది కాదన్న విషయం తెలిసి బీపీఎల్ కోటాలో భూములు ఇప్పించి తమ వృత్తితో ఏ మాత్రం సంబంధం లేని వారికి కూడా కెటాయించి ఇప్పుడు బీపీఎల్ కోటా అని ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారి కుటుంబ సభ్యులు కూడా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నందున ప్లాట్లు కెటాయించాల్సి వచ్చిందన్నది వాస్తవమే అయినప్పటికీ బీపీఎల్ కోటా అంటూ సరికొత్త మెలికి పెట్టి వీరికి కూడా అన్యాయం చేసే విధంగా చేస్తున్న ప్రచారాన్ని నిలిపివేయాలని అభ్యర్థిస్తున్నారు బాధిత జర్నలిస్టులు.